Take a fresh look at your lifestyle.

ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ అంత్యక్రియలు

మరో మార్గం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాహసం: అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తనువు చాలించిన ఓ వ్యక్తి అంత్యక్రియలు జరపడం కోసం ఆ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టారు. గత ఐదారు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సిద్దిపేట జిల్లాతో సహా పలు జిల్లాలు, మండలాల్లో వాగులు ,వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఒ హృదయ విధారకమైన ఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే …సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వేచిరేణి గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. గ్రామస్థులు, బంధువులందరూ కలిసి ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇక శవాన్ని బంధువులు, గ్రామస్తులు మోస్తూ స్మశాన వాటిక వైపు బయలు దేరారు. స్మశాన వాటిక కు వెళ్ళే దారి మధ్యలో ఉన్న బ్రిడ్జిపై గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. స్మశాన వాటికకు వెళ్ళడానికి వేరే దారి లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అర చేతిలో ప్రాణాలు పెట్టుకుని వారంత వాగు దాటి అంత్యక్రియలు చేశారు. ఈ సంఘటన చూసిన వారందరూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గతంలో బ్రిడ్జి నిర్మించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. బ్రిడ్జి నిర్మాణం జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఒకవేళ జరగరానిది జరిగితే అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలని కోరారు.

Leave a Reply