దేశంలోని పలు రాష్ట్రాల్లో కొరోనా మళ్ళీ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో మూడున్నర నెలల తర్వాత కేసుల సంఖ్య మళ్ళీ ఆరు వేలు దాటినట్టు సమాచారం. ఒక వంక నాసా అంగారక గ్రహానికి పంపిన రోవర్ సురక్షితంగా ల్యాండ్ అయినట్టు సంతోషాన్ని కలిగించే వార్తను మోసుకుని వొచ్చినట్టే మీడియా ఈ వార్తలను కూడా వ్యాపింపజేశాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేసినట్టు వార్తలు వొచ్చాయి. ముంబాయిలో కూడా కొరోనా తిరిగి విజృంభిస్తోంది. మరో వంక టీకాలు వేసే కార్యక్రమం జోరుగా సాగుతోందనీ, కోటికి చేరుకుందని వార్తలు వొచ్చాయి. టీకాలు పని చేస్తున్నా, కొరోనా మళ్ళీ విజృంభించడానికి కారణంపై జనం ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రవ్యాప్తం
శుక్రవారం నమోదైన కేసుల్లో అకోలా,పూణె, ముంబై డివిజన్లలోనే అత్యధికంగా వెలుగు చూసినట్టు అధికారులు తెలిపారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,87,632కు చేరినట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, కొరోనా కారణంగా నిన్న 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుని రాష్ట్రంలో కొరోనాకు బలైన వారి సంఖ్య 51,713కు పెరిగింది. రాష్ట్రంలో కొరోనా కేసులు పెద్ద ఎత్తున వెలుగు చూస్తుండగా అదే సమయంలో రికవరీల సంఖ్య గణనీయంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య44,765గా ఉండగా,నిన్న కొరోనా కోరల నుంచి 2,159 మంది మాత్రమే బయటపడ్డారు.
మరోవైపు, గతేడాది సెప్టెంబరులో కొరోనా బారినపడి కోలుకున్న మహారాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి బచ్చు కడుతోపాటు ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే రెండోసారి కొరోనా బారినపడ్డారు. ఖడ్సేకు గతేడాది నవంబరులో వైరస్ సోకగా చికిత్స అనంతరం బయటపడ్డారు. తాజాగా తాము రెండోసారి కొరోనా వైరస్ బారినపడినట్టు వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, రాష్ట్రంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయని, వైరస్ వ్యాప్తి మళ్లీ పెరగడానికి అదే కారణమని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.ఉష్ణోగ్రతలు పడిపోవడానికీ, కొరోనా విజృంభణకూ కారణం ఏదైనా ఉందా అని అధికారులు పరిశీలన జరుపుతున్నారు. మహారాష్ట్రలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా, చాలా మంది దీని పట్ల ఆసక్తి చూపకపోవడం, మొదటి సారి టీకా వేయించుకున్న వారు రెండో సారి టీకా వేయించుకోవడానికి ఆసక్తిని చూపకపోవడం, వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య సమన్వయం లేకపోవడం మొదలైన కారణాల వల్ల కొరోనా మళ్ళీ విజృంభిస్తోందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతో ఇంతో కొరోనా వ్యాప్తి చెందుతూనే ఉంది. కొరోనా మరణాలు మునుపటి మాదిరిగా బెదరు కొట్టేరీతిలో లేకపోయినా రోజుకు పది నుంచి ఏభై వరకూ నమోదు అవుతూనే ఉన్నాయి. వ్యాక్సినేషన్ జరుగుతోంది కనుక కొరోనా ఏం చేయదన్న ధీమా జనంలో కనిపిస్తోంది.
పండుగలు ఇప్పుడేమీ లేకపోయినా, రాజకీయ పరమైన సమావేశాలు పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తమిళనాడు, కేరళ, బెంగాల్ పర్యటనలకు సమాయత్తమవుతున్నారు.హోం మంత్రి అమిత్ షా , బీజేపీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డాలు బెంగాల్ లో పర్యటించి రాష్ట్రంలో తదుపరి అధికారం తమ పార్టీదేనని ఢంకా భజాయించి మరీచెప్పారు. ఇందుకోసం వేలాది మంది ప్రజలతో రోడ్డు షోలూ, ర్యాలీలు నిర్వహించారు.ఆంధప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం సంబంరంలా సాగుతోంది. ఎన్నికలను ఆపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను మూడు దశలను ఇంతవరకూ ప్రశాంతంగానే నిర్వహించింది.
ఆదివారం (21వ తేదీ) నాల్గవ దశ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రథసప్తమి, తిరుమలలో ఉత్సవాలు, మినీ జాతర్లు, శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలు యథాప్రకారం జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రజల అవస్థలు ఎలా ఉన్నా రాజకీయ నాయకులకు కావల్సింది ఎన్నికలు, గెలుపొంది,అధికారంలోకి రావడం.. వ్యాక్సినేషన్ రెండు దశల కార్యక్రమం పూర్తి కాకపోయినా, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు లోటు లేకుండా సాగి పోతున్నాయి. ప్రజల్లో కూడా నిర్లిప్తతా భావం కానవస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆసక్తిని కనబర్చడం లేదు. అలాగే, మాస్క్‌ల ధారణ, శానిటేజర్ల వినియోగం వంటి వి ఇప్పుడు మొక్కుబడిగా జరుగుతున్నాయి. మాస్కులను మొక్కుబడిగా గడ్డం కింద కు లాగి కట్టుకుంటున్నారు తప్ప చిత్తశుద్దిని ప్రదర్షించడం లేదు. కొరోనా కొత్తల్లో వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలూ జరిగేవి.ఇప్పుడు పబ్లిగ్గానే నిర్వహిస్తున్నారు. ప్రజలను గతంలో మాదిరిగా ఈ కార్యక్రమాలకు తరలిస్తున్నారు. కొరోనా పట్ల ఎవరూ భయాన్ని ప్రదర్సించడం లేదు.అందుకే, వైరస్ మళ్ళీ విజృంభిస్తోందన్న మాట వినిపిస్తోంది. ప్రభుత్వ సిబ్బంది సరిపడనంత మంది లేకపోవడం వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుకుగా సాగడం లేదు. వ్యాక్సినేషన్ సంపూర్ణంగా చేయడానికి ప్రైవేటు హాస్పిటల్స్ సహకారం తీసుకోవాలన్న సూచనలు కూడా వొచ్చాయి .ముంబాయిలో కొత్తగా మార్గదర్శకాలను జారీ చేశారు. పర్యవసానంగా వెయ్యిపైగా భవనాలను సీజ్ చేశారు. హోం క్వారంటైన్ నిబంధనలను కూడా జారీ చేశారు.వీటిని అతిక్రమిస్తే శిక్షార్హులని హెచ్చరించారు. మొత్తం మీద మొదటిసారి మాదిరిగానే రెండో సారి కొరోనా వేవ్ ముంబాయినీ, మహారాష్ట్రనూ ఊపేస్తోంది. కర్నాటక, కేరళలో కూడా రెండోసారి కొరోనా విజృంభణ సాగుతోందని వార్తలు వొచ్చాయి. ఈ తరుణంలోనే ఎన్నికల ప్రచారానికి రాజకీయ పార్టీలు సమాయత్తం కావడం గమనార్హం.