Take a fresh look at your lifestyle.

ఉత్సవాల వరుసలు… పట్టాలెక్కని సర్కార్‌ ‌సదువులు

పాఠశాల స్థాయిలో విద్యార్థులలో పఠనాసక్తి పెంచాలనే లక్ష్యం పై ప్రభుత్వం శ్రద్ధ చూపటం ఆహ్వానించతగిన పరిణామం. ఇందుకోసం జూన్‌ 26 ‌నుండి జూలై నెల చివర వరకు ప్రత్యేక కార్యక్రమం అమలుకు ప్రభుత్వం హడావుడిగా ఆదేశాలు జారీ చేసింది. పఠనమనేది పాఠశాల స్థాయిలో విద్యార్థులు సాధించాల్సిన నాలుగు ప్రధాన సామర్ధ్యాలలో ఒకటి. నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులలో పఠన సామర్ధ్యం కొరవడిందనేది నిస్సందేహం.జూన్‌ 12 ‌నుండి తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు, ఆపై పఠనోత్సవాలు, మలి విడత బడిబాట ఉత్సవాలు, కొనసాగుతున్న ఎఫ్‌.ఎల్‌.ఎన్‌.‌కార్యక్రమం వెరసి ఇవన్నీ విద్యార్థులకు ఉపయుక్తమే కానీ మరో వైపు బడుల్లో ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను బోధనకు దూరం చేసేందుకు దోహదపడుతున్నాయి.బడి ప్రారంభంలో తరగతుల నిర్వహణ లో సీరియస్నెస్‌ ‌లోపించటం, బోధనను కుంటుపడేసేందుకు కారణమవుతున్న వీటి నిర్వహణకు ప్రత్యామ్నాయం వెదకకుంటే సర్కార్‌ ‌బడులలో సదువులు ఆగస్ట్ ‌చివర వరకూ పట్టాలెక్కటం లేదనే అపఖ్యాతి మూటగట్టుకునే ప్రమాదముంది.
ఏమిటీ పఠనోత్సవాలు
విద్యార్థులందరూ ధారాళంగా చదవగలగాలి, చదవటం అలవాటు గా మారాలి,చదవటం ఆనందంగా మారాలి,విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా ఎదగాలి.అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం 10 వతరగతి విద్యార్థుల వరకు నిర్వహించేలా రూపొందించారు. బడి టైం టేబుల్‌ ‌లో రోజూ ఒక పీరియడ్‌ ‌ను గ్రంధాల  పఠనానికి కేటాయించాలని  అన్ని పీరియడ్లలో మొదట పదినిమిషాలు సబ్జెక్ట్ ‌ను బాహ్యపఠనం చేయించాలని సూచించారు.పిల్లలతో గ్రంధాలయ కమిటీలు వేయాలని, రోజు వారీ ప్రార్ధన సమయాల్లో కూడా పఠనం చేయించాలని సూచించారు. బడి బయట కూడా సమాజం ముందు విద్యార్థులతో చదివించాలని తల్లిదండ్రుల, సమాజం భాగస్వామ్యం వుండాలని సూచించారు. ఇందులో భాగంగా జులై 10 నుండి 17 వరకం గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించాలని ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సమీక్షలు సిద్దంచేయాలని అధికారులను ఆదేశించారు.
గత కార్యక్రమాల సమీక్షలేమయ్యాయి ?
తెలంగాణ పాఠశాలలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా పాఠశాల స్థాయిలో విద్యార్థులలో వివిధ అభ్యసన సామర్ధ్యాల అభివృద్ధి కి సర్వ శిక్షా అభియాన్‌ ‌మరియు సమగ్ర శిక్షా అభియాన్‌ ‌లు పాఠశాలల్లో అమలు చేసిన పలు కార్యక్రమాలు, ఉపాధ్యాయులకు పలు పేర్లతో నిర్వహించిన విభిన్న విద్యా శిక్షణా తరగతులు, పాఠ్యగ్రంధాలలో మార్పులు, మాడ్యుల్‌ ‌ప్రచురణలు వాటి ఫలితాలు,ఆ ఫలితాలపై సమీక్షలు వాటి సాఫల్యాలు,వైఫల్యాలు, వెరసి మొత్తంగా ఇందుకోసం వెచ్చించిన నిధులు వీటన్నింటిపై ప్రభుత్వం, విద్యాశాఖ సింహావలోకనం చేసుకోవల్సివుంది.విద్యార్థులలో వివిధ విషయాలలో సంబంధిత సామర్థ్యాలు సాధించటం కోసం అపెప్‌, ఆపై డిపెప్‌ ‌నిర్వహించిన క్లిప్‌, ‌క్లాప్‌,‌లెప్‌ ‌నుండి గత సంవత్సరం నిర్వహించిన తొలిమెట్టు , ఎఫ.ఎల్‌. ఎన్‌.‌వరకు ఇవన్నీ ఇదేవిధంగా పక్కా ప్రణాళికలు కార్యాచరణతో నిర్వహించారు. మరి యేటేటా ఓ కొత్త పేరు తో నిర్వహిస్తున్న కార్యక్రమాల పూర్తి అనంతరం ఎలాంటి సమీక్షలు నిర్వహించారు? వాటిలో అత్యంత సాఫల్యతలు సాధించిన కార్యక్రమమేది? లేదా వైఫల్యం చెందిన కార్యక్రమం యేది? ఫలితాలు లభించిన కార్యక్రమం వుంటే దానినే తిరిగి కొనసాగించవచ్చును. లేదా ఇంకా కొంత ఆధునీకరించి ఆచరించి వినియోగించ వచ్చును. ఈ కనీస సామర్థ్యాలైన పఠనలేఖనాలపై పాఠశాల విద్యార్థులకు ప్రతి యేటా నిర్వహించాల్సివస్తుందంటే గత విద్యా సంవత్సరంలో విద్యార్థి బడిలో పొందిన సామర్థ్యాల జ్ఞానం శూన్యం అనుకోవల్సిందే కదా! బడులలో ఆ విద్యా సంవత్సరం విద్యార్థులు తగు సామర్థ్యాలు పొందలేకపోవటానికి కారణాలు అన్వేషించాల్సి న అవసరం వుంది కదా! యేటా ఓ కార్యకమం లాంఛ్‌ ‌చేయటం, దానికోసం ఉపాధ్యాయులకు శిక్షణ, పర్యవేక్షక బృందాల ఏర్పాటు వీటన్నింటిపై నిధుల వ్యయం ఇవన్ని  గందరగోళం సృష్టిస్తున్నాయి.
నిజంగా విద్యారంగాభివృద్ది పై సర్కార్‌ ‌కుచిత్తశుద్ధి వుందా!
ఉమ్మడి తెలుగురాష్ట్రాల గత రెండున్నర దశాబ్దాలలో పాఠశాల విద్యారంగాన్ని సమాజం ముందు దోషిగా చూపేందుకు సమాజానికి ప్రభుత్వ బడిని దూరం చేసేందుకు ప్రభుత్వ బడులలో రాజకీయ పక్షాల పరోక్ష ప్రవేశానికి దోహదపడే ప్రభుత్వ విద్యారంగ విధ్వంసక కార్యకలాపాలు కొనసాగాయి. ఆకాంక్షల తెలంగాణ లో విద్యారంగం బాగుపడుతుందనుకున్న ఆశలు నిరాశ లయ్యాయి.ఈ తొమ్మిదేళ్ళ కాలంలో విద్యారంగం అభివృద్ధి పేరిట విధ్వంసానికి గురై నేడు పూర్తిగా అదృశ్య మయ్యే స్థాయికి చేరువవుతూంది.  కేజీ నుండి పిజీ స్థాయి విద్య ఉచితంగా లభిస్తుందన్న హామీ మోసగించింది. వేలాది ప్రభుత్వ బడుల మూతవేయటం బోధనా, బోధనేతర సిబ్బంది నియమాకాలు లేకపోవటం, విద్య పూర్తిగా ప్రయివేట్‌ ‌పరం కావటం, విద్యాభివృద్ధికి ప్రభుత్వానికి అసలు ఒక విజన్‌ అనేది లేకపోవటం తో ప్రభుత్వ విద్యారంగం మృత్యుశయ్యపై కొన ఊపిరితో వున్నది. 2014 విద్యాసంవత్సరంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ‌లో  విద్యారంగానికి 11 శాతం నిధులను కేటాయించింది.నేడు యేటేటా తగ్గిస్తూ గత రెండువార్షిక బడ్జెట్‌ ‌లలో 6.7 శాతం నిధులతో విద్యారంగాభివృద్దిని కుంటుపడేస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ని ఇరవై వేల పాఠశాలల్లో  గ్రంధాలయాలు కనీసంగా నైనా వున్న పాఠశాలలు ఎన్ని? గత తొమ్మిదేళ్ళుగా ఏనాడూ పాఠశాల గ్రంధాలయాలకు ఫర్నీఛర్‌, ‌పుస్తకాలుమంజూరు చేయలేదు.అదనపు పఠనీయ గ్రంధాల ఆవశ్యకత పై పదేళ్ళు గా దృష్టిసారించని సర్కార్‌ ఈరోజు ఐదువారాల పాటు పఠన ఉత్సవాలు నిర్వహించటం అర్ధరహితం. జూన్‌ 12 ‌న విద్యా సంవత్సరం ప్రారంభమైంది.మండుటెండలున్నాయి, ఒంటి పూట బడులు నడపాలన్న తల్లిదండ్రుల  వినతిని ప్రభుత్వం ఖాతరు చేయలేదు. 20 వ తేదీ  వరకు పాఠ్యపుస్తకాలు. ఏకరూపదుస్తులు విద్యార్థులకు ఇవ్వకుండా తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో 20 వ తేదీ న జరిపిన విద్యాదినం రోజున ఇవ్వమన్నారు.
ఎర్రటెండలలో పాఠాలు జరగక పది రోజులపాటు విద్యాదినాల నష్టం జరిగింది. జూన్‌ 26 ‌నుండి జూలై 31 వరకు పఠనోత్సవాలు అని ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తున్నారు. జూన్‌ 1 ‌వ తేదీ నుండి 9వ తేదీ వరకు బడిబాట పేరిట నిర్వహించిన కార్యక్రమానికి ఇప్పుడు సీక్వెల్‌ ‌ప్రకటించారు. జూన్‌ 26 ‌నుండి జూలై 6 వరకు 2 వారాల పాటు మళ్ళీ బడిబాట నిర్వహించనున్నారు. ఉన్నత తరగతులైన 8,9,10 తరగతులకు ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. ‌నిర్వహణకు కార్యక్రమం అమలుచేస్తూ రాష్ట్ర స్థాయి పర్యవేక్షణకు టీంలు సిద్దం చేశారు.ఈ ఉత్సవాలు ఒక వైపు నిర్వహిస్తూనే మరోవైపు పాఠశాలల్లో జులై చివరివారంలో మొదటి ఫార్మాటివ్‌ అస్సెస్మెంట్‌ ‌నిర్వహించవల్సివుంటుంది. ఇన్ని వరుస కార్యక్రమాల అమలు, రోజువారి నివేదికలు సిద్దంచేయటం బడులలో భోధనాభ్యసన ఉపాధ్యాయులకు గారడీ ఆటలా వుంది. ఇవన్నీ విద్యార్థుల సామర్థ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలని భావించి అమలుచేయక తప్పదు. కానీ ఈ కార్యక్రమాల అమలుకు నిర్వహణకు ప్రధానమైన ఉపాధ్యాయ సిబ్బంది పాఠశాలల్లో చాలినంత లేరనే ప్రధాన సమస్యను  ప్రభుత్వం విస్మరిస్తూంది. రాష్ట్రంలో దాదాపు 25000 ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలున్నాయి. కరోనా విపత్తు,ఇంగ్లీష్‌ ‌మీడియం, ప్రైవేట్‌ ‌పాఠశాలల ఫీజు దోపిడీ తదితర  కారణాలతో పట్టణప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో గణనీయంగా విద్యార్థుల నమోదు శాతం పెరుగుతూ వస్తున్నది. కొన్ని ప్రధాన సబ్జెక్ట్ ‌లను బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవటం పై ప్రభుత్వం దృష్టి సారించటం లేదు. నాలుగేళ్ళుగా విద్యా వాలంటీర్ల పునర్నియమాకం లేదు.వర్క్ అడ్జెస్ట్ ‌మెంట్‌ ‌కింద విద్యార్థుల నమోదు శాతం తక్కువ వున్న బడుల నుండి ఉపాధ్యాయులను ఎక్కువ నమోదు శాతం వున్న బడులకు పంపిస్తున్నారు.పైగా ఉన్న.ఉపాధ్యాయులు తమ సబ్జెక్టుల బోధనపై దృష్టి కేంద్రీకరించకుండావిద్యార్థుల సామర్థ్యాల మెరుగుదల కోసం అంతర్గత ప్రణాళికలు తయారు చేసుకోకుండా కళ్లెం వేస్తున్న
ట్టు ఈ కేంద్రీకృత కార్యక్రమాలు ఇబ్బందిపెడుతున్నాయి.
విద్యాసంవత్సరం ప్రారంభంలో ఎస్‌.‌సి.ఇ.ఆర్‌.‌టి.విడుదల చేసే క్యాలెండర్‌ ‌లో నెలలవారిగా సిలబస్‌, ‌బోధనాభ్యసన తరగతుల నిర్వహణ సంబంధించి కార్యాచరణ ప్రణాలికను అందచేస్తుంది.జులై నెల చివరి వారంలో ఫార్మాటివ్‌ ‌టెస్ట్ ‌నిర్వహించాల్సివుంటుంది. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో రకరకాల ఉత్సవాలు విద్యాసంవత్సరం ప్రారంభంలో నిర్వహిస్తున్నారు.
ఒకవైపు ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో సీరియస్‌ ‌గా సిలబస్‌ ‌బోధనాభ్యసనలు కొనసాగుతుంటాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ప్రయివేట్‌ ‌పాఠశాలల మధ్య గమని ంచిన అంతరాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల అడ్మిషన్లు ప్రయివేట్‌ ‌బడుల వైపు మళ్ళుతున్నాయి.ఈ విద్యా సంవత్సరం ఆరువేల మంది ఉపాధ్యాయులను వర్క్ అఢ్జెస్ట్ ‌మెంట్‌ ‌కింద ఇతర బడులకు డిప్యుట్నే పై పంపించనున్నారు. ప్రధానమైన ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించకుండా విద్యార్థుల తల్లిదండ్రులను,సమాజాన్ని పక్కదారి పట్టించే ఉత్సవాల నిర్వహణ ఏ ప్రయోజనాల కోసం అనేది తెలియాలి. ప్రతి నవంబర్‌ ‌రెండవ వారంలో ఎట్లాగు గ్రంధాలయ వారోత్సవాలు నిర్వహించటం చాలాకాలంగా నడుస్తున్న సాంప్రదాయం. విద్యా సంవత్సరం లో ఇప్పుడు ‘‘రూం టు రీడ్‌’’ ‌పేరిట రీడ్‌ ‌టు లెర్న్ , ‌లెర్న్ ‌టు రీడ్‌. ‌కార్యక్రమం అమలు కోసం ఐదు వారాల విద్యదినాలు,మలి బడి బాటకోసం రెండువారాలు కార్యక్రమాల నిర్వహణ ప్రభుత్వ బడులను రెండు వారాల పనిదినాలు స్కూల్‌ ‌కాంప్లెక్స్ ‌పాఠశాలల్లో హెడ్‌ ‌మాస్టర్లు, సి.ఆర్‌.‌పి. లు క్లస్టర్‌ ‌పాఠశాలలు, ఎం.ఇ..వో.లు మండలం లోని పాఠశాలల పర్యవేక్షణలో బిజీ అవుతారు. ఆగస్ట్ ‌మొదటి తేదీ వరకు పాఠశాలల్లో చదువు అటకెక్కుతుందనేది అంగీకరించాలి.
గతంలో రాయించిన లిబాలసాహిత్యం ఎమైందిలి ?     ప్రస్తుతం పాఠశాలల్లో గ్రంధాలయాల స్థితిగతులపై నిర్వాహకులకు వాస్తవ అవగాహన లేకపోవటం వలన ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పఠన ఉత్సవాల పై విమర్శలు తలెత్తుతున్నాయి. 2006 లో సర్వశిక్షా అభియాన్‌ ఆధ్వర్యాన బాలసాహిత్యం రూపకల్పన పేరిట విద్యార్థుల చేత రాయించిన కథలు,గేయాలు వివిధ సాహిత్య సారస్వత ప్రక్రియలు రాయించి, బొమ్మలతో ముద్రించి పాఠశాలలకు అదనపు పఠనం కోసం వివిధ శ్రేణులుగా బాలసాహిత్యం పుస్తకాలు పాఠశాలలకు పంపిణీ చేశారు. తెలుగు, ఇంగ్లీషు, ఉర్ధూ ఇంకా ఆరు గిరిజన భాషలలో ఈ అదనపు పఠనగ్రంధాలు పాఠశాలలకుఅందజేశారు.రెండు మూడేళ్ళపాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్‌ ‌కేంద్రంగా జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ జర్నలిస్టులైన ఉపాధ్యాయులు,కవులు, రచయితలు అయిన సాహితీకారులైన ఉపాధ్యాయులను ప్రతి జిల్లాలో ఐదుగురిని గుర్తించి వారి సేవలను ఇందుకోసం వాడుకున్నారు. అన్ని జిల్లాలలో జరుగుతున్న ఈ సాహిత్య కార్యక్ర మాలను పర్యవేక్షించి,మార్గదర్శనం చేసేందుకు ఎనిమిదిమంది సాహితీవేత్తలైన ఉపాధ్యాయుల సేవలను వినియోగించారు.
విద్యార్థుల చేత చెప్పించిన, రాయించిన కథలు గేయాలు ఎడిటింగ్‌ ‌చేయటం, ప్రింటింగ్‌ ‌కోసం సిద్దంచేసే బాధ్యతలను ఈ ఉపాధ్యాయులు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా చక్కని బొమ్మలు గీయగలిగే ఉపాధ్యాయుల తో ఈ పుస్తకాలలో బొమ్మలు కవర్‌ ‌పేజీలు వేయించారు. ఈ పుస్తకాలు అన్ని పాఠశాలలో విద్యార్థులకు అదనపు పఠనం కోసం చక్కగా ఉపయోగపడ్డాయి. ఇంత ఉపయోగకరమైన పఠన సామాగ్రి ఫలితాలను చూశాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పాఠశాల విద్యార్థుల రచనలతో కూడిన బాలల మాస పత్రికలు ముద్రించి పంపిణీ చేశారు. జిల్లాలలో ఈ కార్యక్రమాలను జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు నిర్వహించాయి.  రాష్ట్ర స్థాయి లో ప్రధాన సహాయకులుగా వ్యవహరించిన ఒక ఉపాధ్యాయుడు ఈ బాలసాహిత్యం పై రాసిన స్క్రిప్ట్ 30 ‌మినట్స్ ‌లైవ్‌ ‌షో టి.వీ 9 లో టెలికాస్ట్ అయింది. ప్రాచుర్యం పొందిన ఈ బాలసాహిత్యం పాఠశాలలకు పంపిణీ చేయటం వల్ల పఠనలక్ష్యాలు సిద్దించేందుకు ఇవి దోహదపడతాయి. ఈ బాలసాహిత్యం పుస్తకాల రూపకల్పనలో వేలాది మంది నాటి విద్యార్థులు, వందలాదిమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సర్వశిక్షా అభియాన్‌.‌ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా పూర్తిచేసిన కార్యక్రమాల్లో ఇదే ప్రధమమైనదని భావించాలి. ఈ బాలసాహిత్యం తిరిగి ముద్రింపచేసి పాఠశాలలకు పంపించటం ఉపయోగకరమని ఆనాటి బాలసాహిత్యం కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రధాన బాధ్యులలో ఒక విషయనిపుణుడిగా నేను అభిప్రాయ పడ్తున్నాను.
 
– అజయ్‌, ఉపాధ్యక్షులు,టి.పి.టి.ఎఫ్‌., ‌వరంగల్‌.

Leave a Reply