Take a fresh look at your lifestyle.

అధికార కేంద్రం చుట్టూ అవకాశవాద రాజకీయాలు!

దేశంలో అధికారమే పరమావధిగా జరుగుతున్న చీలికల గురించి..పెదవి విరుస్తున్న ఆయా పార్టీలు గతంలోనూ.. ఇప్పుడు జరిగిన, జరుగుతున్న పరిణామాలపై చర్చించాలి. మహారాష్ట్రలో జరిగిన తిరుగుబాటు రాజకీయాలు మన ప్రసాజ్వామ్య వ్యవస్థలో కొత్తగా జరుగుతున్న పరిణామాలు కావని కూడా గుర్తించాలి. శరద్‌ ‌పవార్‌ ‌కాంగ్రెస్‌ను చీల్చి బలయకు వొచ్చిన వారే. కాంగ్రెస్‌ ‌హయాంలోనే ఇలాంటి అనేకానేక అవలక్షణాలు మన ప్రజాస్వామ్యంలో చోటు చేసుకున్నాయి.. నీరు పల్లమెరుగు..అన్న రీతిలో అధికారంలో ఉన్న పార్టీవైపు ఆకర్షితులు  కావడం సర్వసాధారణంగా మారింది. అధికారం కోసం అందరూ ఆరాటపడుతున్న వారే. ఈ చీలికలను నిరోధించడానికి పటిష్టమైన చట్టాలు అవసరం. వాటి గురించి ఎవరు కూడా చర్చించడం లేదు.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మూకుమ్ముడిగా ఖండించివుంటే ఇలా జరిగేవి కాదు. ఇకపోతే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఎన్సీపీలో జరిగిన పరిణామాలు షాక్‌ ‌కలిగించాయి. కూటమిలో ప్రధాన నేతగా ఉన్న శరద్‌ ‌పవార్‌ ‌పార్టీలో చీలిక జరగడంతో నేతల్లో ఆందోళన వ్యక్తం కావడం సహజం. ఎన్సీపీలో చీలిక ప్రతిపక్షాలు కూటమికి పెద్ద ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వొచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ చీలిక వారిలో ఆందోళన కలిగించడం కూడా సహజమే. రాజకీయాల్లో తలపండిన శరద్‌ ‌పవార్‌ ‌పార్టీలో జరుగుతున్న పరిణామాలపై గంభీరంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆయనలోనూ ఆందోళన ప్రస్ఫుటంగా కన్పిస్తున్నది.

మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న కారణంగా అధికారం కోసం స్థానికంగా నేతలు అర్రులు చాస్తున్నారనే చెప్పాలి. తెలంగాణ లోనూ కాంగ్రెస్‌ ‌నుంచి అనేకమంద ఎమ్మెల్యేలు అధికార టిఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీ (ఎన్‌సిపి) కీలక నేత అజిత్‌పవార్‌ ‌తన మద్దతుదారులతో కలిసి ఏక్‌నాథ్‌ ‌షిండే నేతృత్వంలోని అధికార కూటమిలో చేరారు. శివసేనను ఏక్‌నాథ్‌ ‌చీల్చితే..ఇప్పుడు అజిత్‌ ‌పవార్‌ ఎన్సీపిని చీల్చారు. గతంలో మధ్యప్రదేశ్‌లో ఇలాగే జరిగింది. రాజస్థాన్‌లో చీలిక దాకా వొచ్చి ఆగిపోయింది. అజిత్‌ ‌పవార్‌ ‌తన మద్దతుదారులతో కలిసి గవర్నర్‌ను కలవడం, వెంటనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

ఆయనతో పాటు మరో ఎనిమిది మంది ఛగన్‌ ‌భుజ్‌బల్‌, ‌దిలీప్‌ ‌వాల్సే పాటిల్‌ ‌హసన్‌ ‌ముష్రిఫ్‌, ‌ధనంజయ్‌ ‌ముండే, అదితి తట్కరే, ధర్మారావు అట్రమ్‌, అనిల్‌ ‌పాటిల్‌, ‌సంజయ్‌ ‌బన్సోడే కూడా మంత్రులు గా ప్రమాణం చేశారు. కాగా శరద్‌ ‌పవార్‌కు గట్టి మద్దతుదారులుగా భావిస్తున్న ఛగన్‌ ‌భుజ్‌బల్‌, ‌వాల్సేపాటిల్‌ ‌లు కూడా మంత్రులుగా ప్రమాణం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో అజిత్‌ ‌పవార్‌పై ఇన్నాళ్లుగా ఉన్న అనుమానాలు ఇప్పుడు నిజమైనాయి. అంతకు ముందు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో అజిత్‌పవార్‌ ‌తన నివాసం దేవగిరిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శరద్‌పవార్‌ ‌కుమార్తె సుప్రియా సూలే సహా పలువురు ఎన్‌సిపి నేతలు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంనుంచి సూలే అర్ధంతరంగా బైటికి వెళ్లిపోయారు.

అనంతరం అజిత్‌ ‌పవార్‌ ‌రాజ్‌భవన్‌కు తరలి వెళ్లగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ ‌షిండే కూడా అక్కడికి చేరుకున్నారు.ఈ క్రమంలోనే అజిత్‌ ‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వొచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదానుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు అజిత్‌పవార్‌ ‌ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అజిత్‌ ‌పవార్‌ ‌నివాసంలో ఎన్‌సిపి నేతల సమావేశం గురించి తనకు తెలియదని పుణెలో ఉన్న శరద్‌పవార్‌ ‌చెప్పడం గమనార్హం. పాట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో శరద్‌పవార్‌తో పాటుగా ఆయన కుమార్తె, పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సుప్రియా సూలే పాల్గొనడం అజిత్‌పవార్‌, ఆయన మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించిందని, దాని ఫలితమే ఈరోజు పరిణామాలని అజిత్‌ ‌పవార్‌ ‌సన్నిహిత వర్గాలు తెలియజేశాయి.

ఎన్‌సిపిలోని మొత్తం 53 మంది ఎంఎల్‌ఎలలో 40 మంది ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని మహారాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ‌బవన్‌కులే చెప్పారు. ఏడాది క్రితం ఏక్‌నాథ్‌ ‌షిండే నేతృత్వంలో అప్పటి ఉమ్మడి శివసేనలో తిరుగుబాటు చోటు చేసుకోవడంతో ఉద్ధవ్‌ ‌ఠాక్రే  నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడి( ఎంవిఎ) ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్‌ 30‌న షిండే ముఖ్యమంత్రిగా బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తెలిసిందే. ఏడాది తిరక్కుండానే ఇప్పుడు అజిత్‌ ‌పవార్‌ ‌కారణంగా ఎన్‌సిపిలో తిరుగుబాటు చోటు చేసుకోవడం గమనార్హం. ఏడాదిలో రెండు పెద్ద పార్టీలను చీల్చిన ఘనత బిజెపికి దక్కింది. నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీనుంచి దాదాపు 40 మంది ఎమ్మెల్యే  లను తీసుకుని అధికార బిజెపిశివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్‌ ‌పవార్‌ ‌మరో బాంబు పేల్చారు. ఎన్‌సిపి గుర్తు, పార్టీ తమవేనని ప్రకటించుకున్నారు.

ఒక పార్టీగానే తాను, ఇతర ఎన్‌సిపి ఎమ్మెల్యే లు మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరామని, ఎన్‌సిపి గుర్తుపైనే భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోను పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకోవాలన్న తన నిర్ణయాన్ని అజిత్‌ ‌పవార్‌ ‌సమర్థించుకున్నారు. దేశాభివృద్ధి కోసమే తాము షిండే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నామని చెప్పిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ• నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తంగా అవకాశవాద రాజకీయాలకు ఇవే మొదలు కాదూ..ఇవే అంతిమం కూడా కావు. దేశంలో అధికార కేంద్రం చుట్టూ అవకాశవాద రాజకీయాలు పరిభ్రమిస్తూనే ఉంటాయి. అలాగే రాజకీయాల్లో విశ్వాసం కలిగిన వ్యక్తులు ఉంటారని అనుకోవడం కూడా భ్రమే.
(ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్).

Leave a Reply