Take a fresh look at your lifestyle.

వరద సహాయక చర్యలపై శ్రద్ధ ఏదీ

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 1: రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజకీయాలపై ఉన్న ఫోకస్ వరద సహాయక చర్యలపై లేదని టీపీసీసీ ఉపాధ్యక్షులు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అంత  అతలాకుతలం అయిందని అన్నారు. దాదాపు 60 మంది భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విలయ తాండవం చేయడంతో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పంటలు పెద్దఎత్తున నష్టపోయారని తెలిపారు. ఇళ్లు కూలిపోయి, పశువులు, మేకలు, కోళ్లు, గొర్రెలు వేల సంఖ్యలో మరణించాయని చెప్పారు. రోడ్లు, వంతెనలు చాలా దెబ్బతిన్నాయని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితి రాష్ట్రంలో ఉంటే, సోమవారం కేబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం కూడా స్పందించకపోవడం విడ్డూరమన్నారు. సంతాపం ప్రకటించలేదు. వరద బాధితులకు ఎలాంటి పరిహారాలు ప్రకటించలేదు. కనీసం వరద ప్రాంతాలను సందర్శించకుండా  మహారాష్ట్రకు వెళ్లారని అన్నారు. తన రాజకీయాలే ప్రధానంగా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు అమానవీయంగా, జుగుప్సాకరంగా ఉంటున్నాయని విమర్శించారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని గాలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

Leave a Reply