Take a fresh look at your lifestyle.

‘‌నిర్భయ’ కేసు మళ్ళీ వాయిదా దోషి వినయ్‌శర్మ పిటిషన్‌ ‌తిరస్కరణ

Justice Bhanumathi, who fell ill in the court hall

నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్షలు తక్షణం అమలు చేయాలని ఎవరెంతగా వేడుకుంటున్నా కేసు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంది. హత్యాచారం కేసులో దోషి అయిన వినయ్‌శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌తిరస్కరించడంపై అతడు పిటిషన్‌ ‌దాఖలు చేయగా.. జస్టిస్‌ ఆర్‌ ‌భానుమతి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, ‌జస్టిస్‌ ఏఎస్‌ ‌బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.నిర్భయ కేసులో దోషుల్లో ఒకడైన వినయ్‌శర్మ తన మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదంటూ రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించడంతో వినయ్‌శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. వినయ్‌శర్మ మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయన మెడికల్‌ ‌రిపోర్టులను బట్టి అతడు ఆరోగ్యంగాననే ఉన్నాడని ధర్మాసనం పేర్కొంది. క్షమాభిక్ష తిరస్కరణపై న్యాయసక్ష కోరేందుకు ఎలాంటి ఆధారాల్లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు నిర్భయ దోషులు న్యాయపరమైన అవకాశాలను ఒక్కొక్కరుగా వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఉరి ఆలస్యం అవుతోంది. ఫిబ్రవరి 1నే నలుగురు నిందితులను ఉరితీయాల్సి ఉండగా.. వినయ్‌శర్మ ఒక్కరోజు ముందు రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడంతో ఢిల్లీ కోర్టు ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉరిశిక్షను నిలిపివేయాలని ఆదేశించింది.

కోర్టు హాల్‌లోనే అస్వస్థతకు గురైన జస్టిస్‌ ‌భానుమతి
నిర్భయ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్‌ ‌న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ ‌భానుమతి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తూ ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కోర్టు సిబ్బంది ఆమెను హుటాహుటిన ఛాంబర్‌కు తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించారు. కొద్ది క్షణాల తర్వాత ఆమె స్ప•హలోకి వచ్చారు. జస్టిస్‌ ‌భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని, అయినప్పటికీ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు వచ్చారని సొలిసిటర్‌ ‌జనరల్‌ ‌తుషార్‌ ‌మెహతా తెలిపారు. ప్రస్తుతం ఛాంబర్‌లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నట్లు చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసును వచ్చే వారానికి వాయిదా వేశారు. త్వరలోనే తీర్పును వెల్లడిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.

Leave a Reply