Take a fresh look at your lifestyle.

తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోతున్నదా ..?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే తెలంగాణ తన అస్థిత్వాన్ని కోల్పోతున్నదా అన్న అనుమానం కలుగుతున్నది. తెలంగాణ ఏర్పడడానికి ముందు 2001 నుండి నిన్నమొన్న బిఆర్‌ఎస్‌ ఏర్పడే వరకు టిఆర్‌ఎస్‌ ‌తెలంగాణ రాజకీయాల్లో ఈ ప్రాంతానికి పెట్టనికోట అనుకున్నారు. ఎప్పుడైతే టిఆర్‌ఎస్‌- ‌బిఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందో దాని పరిధులు తుడిచిపెట్టినట్లైంది. నూతనంగా ఆవిర్భవించిన బిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అయినప్పుడు, ఆ పార్టీ ఏపి తో సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో భాగస్వామి అవుతున్నప్పుడు తెలంగాణలో ఏపి నాయకులు ఎందుకు రాకూడదన్న వాదన ఆనాడే మొదలైంది. ఆ మేరకు ఒక్కో రాజకీయ పార్టీతో తెలంగాణ గడ్డమీద ఏ నాయకులనైతే ఒద్దు అనుకున్నామో వారికి మనమే దారి సులభం చేసినట్లైంది. తెలంగాణ రావడానికి అడ్డుపడిన శక్తులన్నీ ఇప్పుడు ఏదో బంధుత్వం, బాంధవ్యాల పేరు చెప్పుకుని ఇక్కడి ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతున్నదని, తాము ఆ అన్యాయాన్ని ప్రజల పక్షాన ఎదిరించగలుగుతామంటూ మరోసారి స్థానికత్వం సంపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని ఎన్నో కలలు కన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఆ ఆశయం సిద్దించకముందే తనువు చాలించాడు. కాని, తెలంగాణ ఏర్పడకుండా ఉండేందుకు అనేక మాయమాటలు చెబుతూ వొచ్చిన నాటి నాయకుల గురించి ఆనాడు ఆయన అన్నమాటలు నేటికీ మన చెవుల్లో గింగురు మంటున్నాయి. ఆనాడు జరుగుతున్న పరిణామాలపై ఆనాడాయన మాట్లాడుతూ ‘‘ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక అనుమానం కలుగుతున్నది.

అవతలినుండి వొచ్చి అన్ని ఆక్రమించుకున్న వాడే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తాడన్న భయం కలుగుతున్నది’’ అందుకే చెబుతున్న ప్రాంతేతరుడు ఏ స్థితిలో వొచ్చాడో అదే స్థితిలో తెలంగాణను విడిచిపెట్టి పోవాలె. ఎందుకంటే వాళ్ళ సంపాదనంతా ఇక్కడి ప్రజలను లూటీ చేసింది కాబట్టి. దోపిడి సొమ్ము వాపస్‌ ‌కావాలె అన్నాడు కాళోజీ.’’ కాని ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నది. పెద్ద పెద్ద ప్రాజెక్టుల కాంట్రాక్ట్‌లన్నీ ప్రాంతేతరులకే ధారదత్తం అవుతున్నాయని నిత్యం విపక్షాలు ఘోష పెడుతూనే ఉన్నాయి. ఇంకా విభజన హామీలేవీ నెరవేరడం లేదు. వీటికి తోడు మళ్ళీ రాజకీయాల పేరున మరోసారి సీమాంధ్రనేతలు ఇక్కడ పెత్తనం చెలాయించేందుకు సిద్దపడుతున్నారు. తాజాగా కేవీపి, విహెచ్‌ల పంచాయితీ చూస్తుంటే కాళోజీ మాటలే గుర్తుకు వొస్తున్నాయి. ‘‘తాను హైదరాబాద్‌లోనే ఉంటున్నానని, ఇప్పటికీ తన వోటుహక్కు తెలంగాణలోనే ఉందని, అందుకు తెలంగాణ వాడిగానే తనను పరిగణించాలంటున్నాడు ఒకప్పుడు డా. వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి ఆత్మగా చెప్పుకోబడిన కేవీపి రాంచందర్‌రావు. తాను ఎప్పటికైనా ఈ మట్టిలో కలిసి పోయేవాడినే కాబట్టి తెలంగాణ వాడిగానే తనను గుర్తించాలంటున్నాడు.

మొత్తంగా కాకున్నా.. సగం తెలంగాణ వాడిగానైనా గుర్తించాలంటాడు. తనను ఆంధ్ర ప్రాంతంవాడిగా చూడవొద్దంటున్నాడు. రాంచందర్‌రావు తెలంగాణ ఉద్యమకాలంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు సమైక్యంగానే ఉండాలన్న ప్లకార్డులు పట్టుకుని గంటలకొద్ది నిలబడ్డాడు. అదే విషయాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ సీనియర్‌ ‌నేత విహెచ్‌ ‌హనుమంతరావు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ విభజన జరిగి దశాబ్ధకాలం గడుస్తున్నా ఇంకా సీమాంధ్ర నేతలకు తెలంగాణ పైన ఉన్న మమకారం వీడడం లేదనడానికి ఇదొక మచ్చుతునక. విచిత్రమేమంటే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న ఏపీలో రాజకీయాలు చేస్తున్న నాయకుల నివాసాలు మాత్రం ఇంకా హైదరాబాదులోనే ఉండడం. ఇక్కడినుండే వారు ఏపీలో రాచకార్యాలు చక్కబెడుతున్నారు. కేవీపి కొనసాగుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఏపిలో పూర్తిగా క్షీణించి పోయింది. అక్కడ పార్టీని పునరుద్దరించాల్సిందిపోయి వీరంతా తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంటున్నారు. అదే విషయాన్ని విహెచ్‌ ‌తనమాటల్లో వ్యక్తపర్చారు. వాస్తవంగా ఆయన అవసరం ఏపిలో ఉంది, అక్కడే ఉండి రాజకీయం చేసుకోమని సలహా ఇచ్చారాయన.

అదే మాదిరిగా వైఎస్‌ ‌షర్మిల, రేణుకా చౌదరిల మధ్య ఇలాంటి వాతావరణమే చోటుచేసుకుంది. తెలంగాణకు తాను అడ్డమూ కాదు.. నిలువుకాదు అని వెక్కిరింపుగా మాట్లాడిన డా . వైఎస్‌ ‌రాజశేఖర్‌రెడ్డి తెలంగాణకు రావాలంటే పాస్‌పోర్టు తీసుకోవాలా అని అడిగిన విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు. ఆయన మరణం తర్వాత జగనన్న విడిచిన బాణాన్ని అని చెప్పుకుని సమైక్యంగానే రాష్ట్రం ఉండాలని తిరిగిన వైఎస్‌ ‌షర్మిల గత రెండేళ్ళుగా తాను తెలంగాణ కోడలినంటూ గొంతు సవరించుకుంది. తెలంగాణ పేరునే ఒక పార్టీని స్థాపించి, అన్యాయమైపోతున్న తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే వొచ్చానని చెప్పడం, పోటీ చేసే నియోజకవర్గాలు కూడా ఎంచుకోవడం చూస్తుంటే కాళోజీ మరోసారి మనకు గుర్తుకు రాకపోడు. విచిత్రమేమంటే నిన్నటి వరకు ఆమె గొడవేదో ఆమె పడుతుందనుకున్నదల్లా, ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తుండడమే. అదిగో అక్కడ మండింది రేణుకా చౌదరికి. తెలంగాణ పట్ల రేణుకాచౌదరి ఎంత నిబద్దతతో పనిచేశారన్నది తెలియందికాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకు పోటీ వొస్తుందడంతో షర్మిల కోడలు అయినప్పుడు తాను ఆడబిడ్డనన్న విషయం ఆమెకు గుర్తుకు వొచ్చింది. షర్మిల ఏదైనా అడగవొచ్చు. అడగడానికి టాక్స్ ఏమీ ఉండదు కదా. కాని అడగడానికి అర్హత ఉండాలంటోంది రేణుకా చౌదరి. ఎన్నికల నాటి వరకు ఇలాంటి మరెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి ఉందో మరి.

Leave a Reply