Take a fresh look at your lifestyle.

నేడు సిఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం

  • మధ్యాహ్నం 1.04కు ముహూర్తం ఖరారు
  • ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్‌ శాంతి కుమారి
  • ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రముఖులు, అమరుల కుటుంబాలకు ఆహ్వానం
  • ప్రమాణ స్వీకారం వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 : రాష్ట్ర 2వ సిఎంగా రేవంత్‌ రెడ్డి నేడు మధ్యాహ్నం ఎల్‌ బి స్టేడియం వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఆయన ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగనుంది. నూతన సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీస్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక రేవంత్‌ రెడ్డి బుధవారం దిల్లీలో మల్లికార్జున్‌ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ తదితర అగ్ర నేతలందరినీ విడివిడిగా కలిసి తన ప్రమాణస్వీకర కార్యక్రమానికి ఆహ్వానించారు. అదే విధంగా రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పుపై కూడా వారితో చర్చించారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై సీఎస్‌ శాంతి కుమారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఎల్‌బి స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy will take oath today1

ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సిఎస్‌ శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. స్టేడియంలో మంచి నీటితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారని, వారికి ప్రత్యేకంగా గ్యాలరీలతోపాటు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. వాహనాల పార్కింగ్‌, బందోబస్త్‌ లపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, అడిషనల్‌ డీజిలు సీవి ఆనంద్‌, శివధర్‌ రెడ్డి, నగరపోలీస్‌ కమీషనర్‌ సందీప్‌ శాండిల్యా, ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్‌, రిజ్వి, జలమండలి ఎండి దాన కిషోర్‌, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, సమాచార శాఖ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌, రాజ్‌ భవన్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు మల్లు రవి, వేం నరేందర్‌ రెడ్డి,అంజన్‌ కుమార్‌ యాదవ్‌, శ్రీమతి మున్సీ తదితరులు హాజరయ్యారు.

ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, రాష్ట్ర ప్రముఖులు, అమరుల కుటుంబాలకు ఆహ్వానం
సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికిహాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు రేవంత్‌ రెడ్డి ఆహ్వానం పలికారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక, ఏఐసీసీ నేతలను ఆహ్వానించారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దిరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఆ రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానించారు. రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లట్‌, ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్‌ బఘెల్‌, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చౌహన్‌, గతంలో ఇంచార్జిలుగా పనిచేసిన దిగ్విజయ్‌ సింగ్‌, వీరప్పమొయిలీ, కుంతియా, వాయిలార్‌ రవి, మాణిక్కం టాగూర్‌, మరికొందరు ముఖ్యులను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చిదంబరం, విూరాకుమారి, సుశీల్‌ కుమార్‌ షిండే, కురియన్‌, మరికొందరు నేతలను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ అమరుల కుటుంబాలను కూడా ఆహ్వానించారు. కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, హరగోపాల్‌, కంచ ఐలయ్యలతోపాటు మరికొందరు ఉద్యమ కారులు, రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఏపీ సీఎం జగన్‌ తోపాటు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులను పిలిచారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌తో పాటు వివిధ కుల సంఘాల నేతలు, మేధావులను రేవంత్‌ రెడ్డి ఆహ్వానించారు. ఈరోజు సాయంత్రం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వొచ్చారు.

ప్రమాణ స్వీకారం వెంటనే ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం
మొదటి నుంచి రేవంత్‌ రెడ్డి చెప్పుతున్న విధంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2004లో అప్పుడు కాంగ్రెస్‌ సిఎంగా రాజశేఖర్‌ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఉచిత విద్యుత్‌పై తన తొలి సంతకం చేసిన విధంగానే నేడు తాను సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతుగాకుండా ఆ పథకాలు ఎప్పటి నుండి అమలులోకి వొస్తాయో సభా వేదికగా ప్రకటించే అవకాశం వొస్తుంది.

దిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలిసిన రేవంత్‌ రెడ్డి
న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన బుధవారం సాయంత్రంతో ముగిసింది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ నుంచి పిలుపు రావడంతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి దిల్లీకి వెళ్లిన రేవంత్‌ రెడ్డి..తిరుగు పయనమయ్యే వరకు వరుసగా అగ్ర నేతలతో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్ర నేత రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీలతో ఆయన సమావేశమయ్యారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించిన నేపథ్యంలో వారికి రేవంత్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా హైదరాబాద్‌లో జరగబోయే తన ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించారు. అదే విధంగా రాష్ట్రంలో మంత్రివర్గం కూర్పు, ఇతర అంశాలపై కూడా రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ హైకమాండ్‌ నేతలతో చర్చించారు.

ఎంపి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా
ఎంపీ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్‌ ఓమ్‌ బిర్లాను కలసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. గురువారం ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి ఎంఎల్‌ఏగా గెలుపొందారు. కాగా రేవంత్‌ ఇప్పటి వరకు మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారానికి ఇదే నా ఆహ్వానం
రాష్ట్ర ప్రజలకు రేవంత్‌ రెడ్డి బహిరంగ ఆహ్వాన లేఖ
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : తన నాయకత్వంలో ఏర్పాటు కాబోయే ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా నేడు  సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలను ఆహ్వానించారు. ఎల్‌బి స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో దానికి రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయన తన ప్రకటనలో ’తెలంగాణ ప్రజలకు అభినందనలు. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలనకు అందించేందుకు, బలహీనవర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. మీ అందరి ఆశీస్సులతో డిసెంబర్‌ 7న ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ఈ మహోత్సవానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం..’ అని పేర్కొన్నారు.

 తొలి హావిూని నిలబెట్టుకుంటున్న రేవంత్‌

దివ్యాంగురాలికి తొలి ఉద్యోగం
ఎల్బీ స్టేడియంకు  రావాలని ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6 : ‘తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్‌ రెడ్డి సార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్‌ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హావిూ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది’ అని దివ్యాంగురాలు రజిని ఆనందం వ్యక్తం చేశారు. అధికారంలోకి గనుక వొస్తే.. అంటూ హావిూలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో సర్కార్‌ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమై పోయింది. నేడు ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హావిూలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు.  అక్టోబర్‌ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతుంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్‌ రెడ్డి ..‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్‌ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వొస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ‘ అంటూ రేవంత్‌ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు..కాంగ్రెస్‌ గ్యారెంటీ కార్డు విూద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. నెలన్నర తర్వాత..ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది.

Leave a Reply