Take a fresh look at your lifestyle.

తండ్రి ఆస్తిలో .. కూతుళ్ళూ హక్కుదారులే..

వారికీ సమాన వాటా అన్న సుప్రీమ్‌కోర్టు
సంచలన తీర్పును వెలువరించిన ధర్మాసనం

మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, సంఘంలో గౌరవం, కుటుంబంలో సమానత్వం వంటి విషయాల్లో మరొక ముందడుగు పడింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, తండ్రి ఆస్తిలో వాటా పొందేందుకు హక్కుదారేనని సుప్రీమ్‌కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి రావడానికి పూర్వమే తండ్రి మరణించినప్పటికీ, ఆ తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు ఆయన కుమార్తెకు ఉంటుందని, ఆమె సమష్టి కుటుంబ భాగస్థురాలేనని స్పష్టం చేసింది. హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమలు గురించి భిన్నాభిప్రాయాలు రావడంతో జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి హిందూ కుటుంబంలోని కుమార్తె సమష్టి కుటుంబ సహభాగస్థురాలు అవుతుంది. కానీ ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు తండ్రి మరణించినపుడు ఆయన కుమార్తెకు ఈ హక్కు ఉంటుందా? అనే అంశంపై స్పష్టత లేదు.

దీనిపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం వివరణ ఇచ్చింది. ఈ వివరణతో మహిళలకు కుటుంబంలో సమాన గౌరవం, •దా, హక్కులు లభిస్తున్నాయి. ప్రకాశ్‌ ‌వర్సెస్‌ ‌ఫూల్‌వతి కేసులో సుప్రీమ్‌కోర్టు 2016లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రాకముందు కుమార్తెలకు హక్కులు ఉండవు. దానమ్మ వర్సెస్‌ అమర్‌ ‌కేసులో సుప్రీమ్‌కోర్టులోని వేరొక ధర్మాసనం 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం, ఈ చట్టం అమల్లోకి రావడానికి ముందు తండ్రి మరణించినప్పటికీ, ఆయన ఆస్తిలో ఆయన కుమార్తెకు హక్కు ఉంటుంది, ఆమె ఆ సమష్టి కుటుంబ సహభాగస్థురాలే. ఈ రెండు తీర్పులు విభిన్నంగా ఉండటంతో దీనిపై వివరణ కోరారు. దీంతో జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్రా నేతృత్వంలోని సుప్రీమ్‌కోర్టు ధర్మాసనం వివరణ ఇచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 6 ‌ద్వారా కుమార్తెలకు కల్పించిన సమానత్వ హక్కును పోగొట్టరాదని జస్టిస్‌ అరుణ్‌ ‌మిశ్రా ధర్మాసనం స్పష్టం చేసింది.

2005 సెప్టెంబరు 9 నుంచి హిందూ వారసత్వ సవరణ చట్టం, 2005 అమల్లోకి వచ్చింది. తమ తండ్రి ఆస్తిలో తమ అన్నదమ్ములతో సమాన వాటా కోరే అక్కచ్లె•ళ్ళ వ్యాజ్యాలను పరిష్కరించేందుకు ఈ తేదీనే కొలబద్దగా  న్యాయస్థానాలు పరిగణిస్తున్నాయి. ఈ అంశంపై పెండింగ్‌లో ఉన్న విచారణలను 6 నెలల్లోగా పూర్తి చేయాలని కూడా సుప్రీమ్‌కోర్టు ఆదేశించింది. ఆస్తి పంపకాల విషయంలో చాలా ఏళ్లుగా కూతుళ్లకు అన్యాయం జరుగుతూనే ఉంది. తండ్రి ఆస్తిని కుమారులకు మాత్రమే పంచుతున్నారు. కూతుళ్లకు వాటా ఇవ్వడం లేదు. ఆడపిల్లలకు సమాన వాటా ఇవ్వాలని హిందూ వారసత్వ సవరణ చట్టం-2005 చెబుతున్నా ఇప్పటికీ చాలా మంది ఆడపిల్లలకు న్యాయం జరగడం లేదు. ఈ క్రమంలో మంగళవారం సుప్రీమ్‌ ‌సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకూ సమాన వాటా పంచాల్సిందేనని స్పష్టం చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!