Take a fresh look at your lifestyle.

బడ్జెట్‌పై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

  • శాఖల వారీగా కేటాయించాల్సిన నిధులపై చర్చ
  • కొరోనాతో కోల్పోయిన నష్టాన్ని పూడ్చుకునే అంశంపై ఆరా

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టి సారించారు. ఈమేరకు 2021 22 బడ్జెట్‌ ‌రూపకల్పనపై గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ ‌రావుతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా కేటాయించాల్సిన నిధులపై చర్చించారు. అలాగే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి రావలసిన నిధులలో ఎంతమేర కోత విధించారు ? దీంతో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏమేరకు ప్రభావం పడుతుంది ? అనే అంశాలపై ప్రధానంగా చర్చించారు.

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కోత బాగా జరిగిందనీ, దీంతో రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందనే అంశంపైనా సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో చర్చించారు. మరోవైపు, గత ఏడాది కొరోనా కారణంగా రాష్ట్రానికి రావలసిన ఆదాయం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్‌, ‌స్టాంప్స్ ‌రిజిస్ట్రేషన్‌ ‌శాఖల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయం వస్తుంది. కొరోనా కారణంగా దాదాపు ఆరు నెలలు వైన్స్, ‌బార్‌ అం‌డ్‌ ‌రెస్టారెంట్లు మూతపడగా, రాష్ట్రవ్యాప్తంగా భూములు, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలచిపోయాయి. ఈ కారణంగా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల వరకూ ఆదాయానికి కోత పడింది.

ఇప్పుడిప్పుడే రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి కొరోనాకు ముందు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు ఈ యేడాది ఎంత మొత్తం నిధులు అవసరం అవుతాయి ? అలాగే, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఏమేర నిధులు అవసరం అవుతాయి ? వాటిని ఏ విధంగా సమకూర్చుకోవాలనే అంశాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీతో పాటు ప్రతీ ఏటా వచ్చే నిధులలో ఎంత తేడా వస్తుంది ? వాటిని సమకూర్చుకునేందుకు వచ్చే బడ్జెట్‌లో పన్నుల రూపంలో ఏయే రంగాల నుంచి ఆదాయం పొందాలి అనే విషయాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించారు.

Leave a Reply