Take a fresh look at your lifestyle.

మొక్కలు నాటడం.. పిల్లల భవిష్యత్ కు బాటలు

మొక్కలు నాటడం అంటే.. రేపటి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడమేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ మున్సిపాలిటీ సంగాపూర్ లో కల్పక వనం- అర్బన్ ఫారెస్ట్ పార్కును గురువారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. గజ్వేల్ అర్బన్ పార్కును అత్యంత సుందరంగా రూ.7.50 కోట్ల రూపాయలతో అద్భుతమైన అటవీ పార్కును తీర్చిదిద్దారని, అటవీ శాఖ అధికారులు పీసీసీఎఫ్ శోభ, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్, గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రామారావును అభినందించి, గజ్వేల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవాళ్టి నుంచి కల్పక వనం అర్బన్ ఫారెస్టు పార్కు గజ్వేల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. అన్నీ రకాల పండుగలు, బోనాలు, వన భోజనాలు, పిల్లలతో సాయంత్రం పూట వచ్చి సరదాగా కాసేపు ఉల్లాసంగా గడపాలని, ఉదయాన్నే వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ చేయాలని, అర్బన్ పార్కు ప్రజల కోసం నిర్మించిందని, ప్రజలు మంచి ఆరోగ్యంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం కోసమే అర్బన్ పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని, రేపటి నుంచి అర్బన్ పార్కును గజ్వేల్, గజ్వేల్ పరిసర ప్రాంత ప్రజలు పార్కుకు వచ్చి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందాలని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు.

మొక్కలు నాటడం అంటే.. రేపటి పిల్లల భవిష్యత్తుకు బాటలు వేయడమేనని, పిల్లలకు ఆస్తులు, అంతస్తులు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. మంచి పర్యావరణాన్ని ఇవ్వడం కూడా అంతకంటే చాలా ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఇప్పటికే మంచినీళ్ల బాటిళ్ళు కొనుక్కొని తాగినట్లు, ఆక్సిజను బాటిళ్ళు కొనుక్కొని పీల్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. స్వచ్ఛమైన గాలికోసం ఢీల్లీ వాసులు నగరాన్ని వీడి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడమంటే.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమేనని పేర్కొన్నారు. పట్టణాలను చూస్తే రోజూ రోజుకు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్నాయని, కాంక్రీట్ జంగిల్ ప్రజలకు స్వచ్చమైన గాలి, ఆట విడుపు లేకపోవడం, పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింటున్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున్న అర్బన్ పార్కులను హైదరాబాదు జంట నగరాలతో పాటు అన్నీ జిల్లా, తాలుకా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టి అద్భుతంగా దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ పార్కులను నిర్మింప చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్-సంగాపూర్ లో 36 వ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభం చేసుకున్నామని తెలిపారు. అర్బన్ పార్కు మీ కోసం నిర్మించాం. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కోరుకునే పర్యాటకులకు అర్బన్ పార్కులు ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తాయని మంత్రి చెప్పారు. ఇప్పటికే 240 కోట్ల మొక్కలు నాటి, గ్రామ గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 4 శాతం గ్రీన్ కవర్ ఏర్పాటు కావడం అంటే ప్రపంచమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. పోచారంలోని మూషిక జింకలను గజ్వేల్, సిద్ధిపేట అర్బన్ పార్కులకు పంపాలని అటవీశాఖ అధికారులకు మంత్రి హరీశ్ సూచించారు. అంతకు ముందు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్ మండలం సంగాపుర్ లో 117 హెక్టార్లలో రూ. 7.43 కోట్ల వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయి ప్రతినిధి తెలంగాణ రాష్ట్రం తక్కువ సమయంలో 4 శాతం ఫారెస్టు గ్రోత్ వచ్చిదంటే.., ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అడవులు, గ్రామాలు, మున్సిపాలిటీలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని, ఈ పార్కులో ఏలాంటి హానికరమైన జంతువులు లోపలికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. సీఏం తీసుకున్న నిర్ణయంతో నశించిపోయిన అడవులను పునరుజ్జీవనం చేయడం జరిగిందని, గతంలో కలెక్టర్లకు సీఎం సూచించి స్వయంగా చూసి మీ ప్రాంతాల్లో చేయాలని ఆదేశాలు ఇస్తే మంత్రులు, జిల్లా కలెక్టర్లు చూసిన తర్వాత.. ఇక్కడ గమనించిన అంశం 3 సంవత్సరాలలోపే నశించిపోయిన అడవులను తిరిగి పునరుజ్జీవనం చేయడం జరిగిందని మంత్రి ఐకే రెడ్డి చెప్పారు.

అనంతరం గజ్వేల్ షరీఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని సంగాపూర్, కోమటిబండ అటవీ ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గజ్వేల్ షరీఫ్ రిజర్వ్ ఫారెస్ట్ లోని సంగాపూర్, కోమటిబండ అటవీ ప్రాంతంలో అటవీ పునరుజ్జీవనంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. అడవుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అడవుల సంరక్షణపై సిఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ ఫలితాలు ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నాయన్నారు. గత ఆరేండ్లుగా నాటిన మొక్కలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో నాటిన మొక్కలు.. నేడు మానులుగా మారి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని చెప్పారు.

ఆరేండ్ల పాటు కష్టపడడంతో నేడు అటవీ ప్రాంతాలు పచ్చని చెట్లతో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.ఈ మేరకు గజ్వేల్‌, వర్గల్‌ ప్రధాన రహదారిని అనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్‌ ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దారు. పార్కు లోపల ‘సేవ్‌ ఫారెస్ట్‌..సేవ్‌ ఎర్త్‌’ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్‌, వాచ్ టవర్, ఒపెన్ జిమ్, చిన్న పిల్లల కోసం ప్రత్యేక ఆట స్థలం, గజీబొ, రాశివనం, ఒపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలతో పార్కును సుందరంగా తీర్చిదిద్దారని అటవీ శాఖ అధికారి శ్రీధర్, గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రామారావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, పీసీసీఎఫ్ ఆర్. శోభ, ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా, గడ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డి, సీఎఫ్ శర్వనంద్, డీఎఫ్ వో శ్రీధర్ రావు, గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రామారావు, ఇతర ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply