Take a fresh look at your lifestyle.

దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుంది ..

మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ‘జన గణ మన అభియాన్‌’
-ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రమా మేల్కోటే
-భారత్‌ జోడో ఆధ్వర్యంలో తెలంగాణలో మిస్డ్‌ కాల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం

ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10 : రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని 2024 తర్వాత దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పాలకులు రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి దేశంలో విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా జన గణ మన అభియాన్‌ ప్రచారాన్ని తెలంగాణలో భారత్‌ జోడో అభియాన్‌ ద్వారా జనవరి 1 నుండీ 31 వరకూ నెల రోజుల ప్రచారానికి దేశవ్యాప్త పిలుపుకు మిస్డ్‌ కాల్‌ నంబర్‌ 9587040998 కు తెలంగాణ రాష్ట్ర పౌరులు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని, రాబోయే రోజుల్లో జరిగే ప్రచారంలో పాల్గొనాలని ప్రముఖ పౌర సమాజ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణలో పౌర సమాజ ప్రజా చైతన్య ప్రచారాన్ని జన గణ మన అభియాన్‌ పేరుతో సీనియర్‌ సామాజిక కార్యకర్తలు ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, ప్రొఫెసర్‌ రమా మెల్కోటే ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రచార పోస్టర్‌ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న మతపరమైన, ద్వేష పూరిత రాజకీయాలు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు పెరుగుతున్నదని అన్నారు.

దేశం ప్రస్తుతం చాలా క్లిష్టమైన దశలో ఉందని, ఫాసిజం, ఇంటి గుమ్మంలో ఉందని చెప్పారు. పార్లమెంటులో చాలా తక్కువ చర్చలతో ప్రాథమిక రాజ్యాంగ విలువలను బలహీనపరిచే చట్టాలను తేవడానికి ఫాసిస్టు శక్తులు జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని మతపరమైన విభజనను ఉద్దేశపూర్వకంగా తీవ్రతరం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం, భిన్నత్వం, సమానత్వం, సామరస్యంతో కూడిన మెరుగైన భారతదేశం కోసం పౌరులు కలిసి వచ్చి ఇటువంటి రాజకీయాలను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్‌.వెంకట్‌ రెడ్డి, అంబికతో పాటు టీపీజేఏసీకి చెందిన కన్నెగంటి రవి, భారత్‌ జోడో అభియాన్‌ కు చెందిన జాహిద్‌ ఖాద్రీ, కిరణ్‌ కుమార్‌ విస్సా, ముస్లిం సంఘాల జేఏసీ ప్రతినిధులు సలీం పాషా, ఓబీసీ స్టూడెంట్స్‌ యూనియన్‌, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ అఖిల భారత కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply