Take a fresh look at your lifestyle.

అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌కో ..మారో? !

‘‘ ‌దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు కట్టుకుని.. కంట్రాక్టర్లకు దోచిపెడుతున పాలకులు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని ఓ నిట్టూర్పు మాటతో తమ బాధ్యతను విస్మరిస్తున్నారు.’’

image.png

image.png
అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌సర్కార్‌..‌నినాదాన్ని బాగా ప్రాచుర్యం చేయాలనుకుని…రైతు ప్రభుత్వం అని చెప్పి మరోమారు వారి మద్దతు పొందాలని తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌పక్కా ప్రణాళికతో సాగుతున్నారు. రైతులు రాజ్యం ఏలాల్సిందే అన్న నినాదం ఇస్తున్నారు. ఎపిల కావచ్చు..కేంద్రంలోని మోదీ కావచ్చు.. అందరూ రైతులను దైవంగా భావిస్తారు. కానీ చిన్న సమస్యలు కూడా పట్టించుకోరు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆగమయ్యారు. తెలంగాణలో ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన రైతులు కూడా ఆగమయ్యారు. ఇప్పుడు ట్రిపుల్‌ ఆర్‌ అం‌టే రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు బుస కొడుతోంది. తమ భూములను ఇవ్వమని రైతులు మొండికేస్తున్నారు. అయినా వారిని లెక్కచేయకుండా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో గంధమల్ల ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతుల ఆక్రందనలు..రైతు జపం చేస్తున్న కెసిఆర్‌ ‌చెవికెక్కడం లేదు. అలాగే రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డుకు భూములు  ఇవ్వబోమని తెగేసి చెబుతున్న రైతులకు కూడా లాఠీ రుచి చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో బేడీలు వేసి లాకప్‌ ‌లో వేస్తున్నారు.. పోలవరం కోసం భూములు త్యాగం చేసిన గిరిజన రైతులదీ ఇదే పరిస్థితి. మొత్తంగా అబ్‌ ‌కీ బార్‌ ‌కిసాన్‌ ‌కో ..మారో అన్న రీతిలో దుర్మార్గపు పాలన సాగిస్తున్నారు. ధరణిలో భూములు తలకిందులవుతున్నా..ధరణిని ఏలుతున్న పాలకులు పట్టించుకోవడం లేదు.

నిజానికి మంచి చేసివుంటే..మంచి జరిగి ఉంటే రైతులు రోడ్డెక్కు తారా అన్నది ఆలోచించాలి. వారిని జైళ్లలో పెట్టడం కాదు. బెదిరించడం కాదు…లాఠీలు ఝళిపించడం కాదు… భిన్నంగా ఆలోచించాలి. సిఎం కెసిఆర్‌  ఎం‌దుకు స్పందించడం  లేదో చెప్పాలి. జాతీయ రాజకీయాలతో ప్రజలను ఉద్దరిస్తాననని , దేశాన్ని బాగు చేస్తానని చెప్పడం కాదు..ఇక్కడి నుంచే అంటే తెలంగాణ నుంచే ఆ బాగు మొదలు పెట్టాలి. కూట్లో రాయి తీయలే నోడు.. ఏట్లో రాయి తీస్తాడా..అన్న సామెతలా మనం ఉండరాదు. మన నేపథ్యం వేరు. మన ఆకాంక్షలు వేరు. ప్రజలకు మేలు జరిగితే.. రైతులకు న్యాయం జరిగితే విపక్షాలు వేలు పెట్టడానికి కూడా అవకాశం రాదు… ప్రజలు కాని, రైతులు కానీ సందివ్వరు. ఈ విషయం కెసిఆర్‌కు తెలియంది కాదు. ప్రజలను ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్య పెట్టడం, మోసపుచ్చడం సులువు కావచ్చు.. కానీ దాని ఆగ్రహజ్వాల తరవాత దహించి వేస్తుందన్న భయం కూడా ఉండాలి.ప్రాజెక్టులే కావచ్చు.. పరిశ్రమలే కావచ్చు.. వాటికి ఇచ్చే భూముల కోసం రైతులు,ప్రజలు త్యాగాలు చేయాల్సిన సందర్భాల్లో వారు బికారులు అవుతున్నారు. భూములు ఇవ్వమని అన్నందుకు  తన్నులు తినాల్సి వస్తోంది.

సర్వం కోల్పోయి రోడ్డున పడాల్సిందే.. రీతిలో పాలకుల తీరు ఉంది. దేశంలో అప్పుడూ..ఇప్పుడూ..ఇదే జరుగుతోంది. భూసేకరణ అనగానే లాఠీలు విరగాల్సిందే! ప్రజల వీపులు పగలాల్సిందే.! బలవంతంగా భూములు గుంజుకోవాల్సందే.. రైతులను, ప్రజలను మోసం చేసి బలవంతం భూసేకరణ చేయాల్సిందే.. దేశం యావత్తూ ఇదే తంతు జరుగుతోంది. మూటాముల్లె సర్దుకుని ప్రభుత్వం వారిచ్చిన జాగాల్లో మళ్లీ గుడిసెలు వేసుకోవడం ..తమ మానాన తాము బతకడం అలవాటుచేసుకోవాల్సిందే. ప్రాజెక్టులు కట్టుకుని.. కంట్రాక్టర్లకు దోచిపెడుతున పాలకులు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని ఓ నిట్టూర్పు మాటతో తమ బాధ్యతను విస్మరిస్తున్నారు. ప్రజలకోసం..ప్రజల ఆకాంక్షల మేరకు..ప్రజల బాగు కోసం ఏర్పడ్డ తెలంగాణలో కూడా ఇందుకు పరిస్థితి భిన్నంగా లేదు. ఎలుగెత్తి ఆందోళన చేస్తే మరింత కఠిన శిక్షలు వేస్తున్నారు. ఎక్కడైనా కాంట్రాక్టర్లకు మేలు జరిగిందే తప్ప త్యాగం చేసినరైతులకు, ఊళ్లు వదిలిన ప్రజలకు ఎక్కడా మేలు జరగడంలేదు. మాటలు మాత్రం తీయగా చెప్పి వారిని మోసపుచ్చి భూములు గుంజుకోవడమే జరిగింది. కెసిఆర్‌ను ప్రజలంతా బాగా నమ్మారు. దగాపడ్డ తెలంగాణలో కన్నా ఇప్పుడు తమ బతుకు బాగుపడు తాయని భావించారు. ప్రాజెక్టులు కడితే వారికి పరిహారంతో పాటు ఆవాసం మంచిగా ఇస్తారని భావించారు. భూములకు భూములు ఇవ్వకున్నా మరోచోట ఎకరానికి అర ఎకరమైనా కొనుక్కునే వీలు కలిగేలా పరిహారం ఇస్తారని భావించారు. భూముల ధరలు పెరిగాయని ఎక్కడికి వెళ్లినా చెబుతున్న కెసిఆర్‌ ‌పెరిగిన ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వడం లేదు.

పాలనలో కెసిఆర్‌ ‌కూడా మిగతా ప్రభువు లకన్నా తక్కువే తినలేదని నిరూపించుకుంటున్నారు. మల్లన్న సాగర్‌ ‌కావచ్చు..కొండపోచమ్మ కావచ్చు..గౌరవెల్లి కావచ్చు..గంధమల్ల కావచ్చు..ట్రిపుల్‌ ఆర్‌ ‌కావచ్చు…భూములు ఇచ్చి,గ్రామాలను నీటిలో ముంపునకు వదులుకున్న ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో ఇంత దారుణంగా భూసేకరణ జరుగుతందని బహుశా ఎవరు కూడా ఊహించి ఉండరు. లక్షల కోట్లు అప్పు చేస్తున్న ప్రభుత్వం సామాన్య రైతులకు, ప్రజలకు ఇంత దగా చేస్తుందని ఎవరూ అనుకోలేదు. నిజానికి భూములు ఇచ్చిన రైతులకు, ముంపు గ్రామాల ప్రజలకు గౌరవ ప్రదమైన జీవితం గడిపేలా చేయాలి. కానీ మాటల్లో ఇవన్నీచేసి..లాఠీలతో దెబ్బలు కొట్టించి, బూటుకాళ్లతో తన్నులు తినిపించి..అంతా బాగుందని ప్రచారం చేసుకోవడం ఉద్యమ నేతగా చెప్పుకుంటున్న కెసిఆర్‌కు మంచిదా అన్నది ఆలోచించాలి. ప్రజల శాపనార్థాలు ఎప్పుడూ మంచిది కాదు.

వారి వేదనాభరిత జీవితంలో నుంచి వొచ్చే  తిట్టు కావొచ్చు.. ఏడుపులు కావొచ్చు..ఎప్పుడో ఒకప్పుడు దహించక మానవు. నిజానికి పథకాల పేరుతో వోట్ల  వేటలో పడి పప్పు బెల్లాలకు పందేరం చేసే బదులు భూసేకరణలో సర్వం కోల్పోతున్న వారికే అగ్రతాంబూలం ఇవ్వాలి. వారికే ఓ రూపాయి ఎక్కువ ముట్ట చెప్పాలి. అలా కాకుండా చేయడం వల్లనే ఇవాళ ప్రాజెక్టుల్లో భూములను, ఇళ్లను కోల్పోతున్నవారు కన్నీరు పెట్టుకుంటున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలంగాణలో భూమలు ధరలు పెరిగాయని, ఎక్కడా 30,35 లక్షలకు తక్కువ ఎకరం లేదని పదేపదే వల్లె వేస్తున్న కెసిఆర్‌ ‌వీరికి ఆ మేరకు పరిహారం ఇచ్చారా అన్నది ఆలోచించాలి. వారి  హృదయవేదన వినాలని ఏనాడైనా కనీసం ఆలోచించి ఉంటే వారికి ఈ కష్టాలు వొచ్చేవి కావు. తానూ ఓ సామాన్యుడిగానే ఇవాళ తెలంగాణ సిఎంగా ఎదిగానని ఆలోచించి ఉంటే వారికి కష్టాలు, కన్నీళ్లు, లాఠీల దెబ్బలు తినాల్సి వొచ్చేది కాదు. కోర్టుల చుట్టూ పరిహారం కోసం తిరగాల్సి వొచ్చేది కాదు. జైళ్లకు వెళ్లాల్సి వొచ్చేది కాదు. భూములు కోల్పోయి దిక్కులేని వారుగా తయారైన ఒక్కో రైతును కదిలిస్తే..వారి గోడు వినే ఓపికే ఉంటే కన్నీటి కథలు పుస్తకాలుగా రాయొచ్చు. రైతులను ఆదుకుంటే వొచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేం. ప్రజలు నమ్మి వెన్నంటి ఉంటే ఏ విపక్షం కూడా ఏ చేయలేదు. మల్లన్నసాగర్‌, ‌కొండపోచమ్మ సాగర్‌,‌గౌరవెల్లి ప్రాజెక్ట్ ‌బాధితుల గాధలను కూడా వినాలి. అప్పుడే బాధల అంటే ఏమిటో తెలుస్తాయి.
 – ప్రజాతంత్ర డెస్క్ 

Leave a Reply