Take a fresh look at your lifestyle.

వ్యవసాయ బిల్లు ఆమోదానికి తొందరెందుకు..?

దేశంలో కొరోనా వైరస్‌  అడ్డు అదుపు లేకుండా కుదిపేస్తున్న తరుణంలో ప్రజలకు తగిన వైద్య సౌకర్యాలను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన రీతిలో స్పందించలేకపోతున్న సమయంలో కేంద్రం కొత్త వ్యవసాయ విధానాన్ని ఎలాగైనా సరే ఆమోదింప జేసుకోవాలని ప్రయత్నించడంపై   ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ భాగస్వామ్య పక్షమైన అకాలీదళ్‌ ‌కూడా దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీకి చెందిన సిమ్రత్‌ ‌కౌర్‌  ‌కేంద్ర మంత్రి పదవికి  రాజీనామా చేసిన రెండు రోజులకే  మాట మార్చారు. కొత్త వ్యవసాయ విధానాన్ని తాను విమర్శించలేదంటూ  శనివారం ప్రకటన చేశారు. అకాలీదళ్‌వి వొత్తిడి రాజకీయాలని  సరిపెట్టుకోవచ్చు. దేశంలో ఇతర పార్టీలు కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెరాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శ ఖరరావు ఈ బిల్లు తేనెపూసిన కత్తి వంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్‌  ‌సీనియర్‌ ‌నాయకుడు పి చిదంబరం కూడా ఈ బిల్లును తమ పార్టీ ఎన్నడూ సమర్ధించలేదంటూ స్పష్టం చేశారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ బిల్లును ఇదివరకే వ్యతిరేకించాయి.   కేంద్రం రాష్ట్రాల జాబితాలోని  విద్యుత్‌, ‌వ్యవసాయం వంటి రంగాల్లో జోక్యం చేసుకుని రాష్ట్రాల ఆదాయాన్నీ, స్వేచ్ఛనూ హరించేందుకు ప్రయత్నిస్తోందని వామపక్షాల నాయకులు ఆరోపించారు. మరో వంక కొరోనా కేసులు పన్నెండు గంటల వ్యవధిలో 94 వేలకు పైగా పెరిగాయి, మరణాలు 1214 నమోదు అయ్యాయి.

కొరోనా రెండవ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ బ్రిటిష్‌ ‌ప్రధాని బోరిస్‌ ‌జాన్స్‌న్‌ ‌హెచ్చరించారు. వ్యాక్సిన్‌ ఏ‌ప్రిల్‌ ‌నాటికి వస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌ప్రకటించారు. అంటే కొరోనా వ్యాక్సిన్‌ ‌కోసం మరో 7 నెలలు ఆగాల్సిందేనని ఆయన చెప్పకనే చెప్పారు. రష్యా విడుదల చేస్తున్న వ్యాక్సిన్‌ ‌వల్ల కొత్త రోగాలు వస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా కొరోనా నివారణకు లేదా నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాను అనుకున్న పని పూర్తి అయ్యే వరకూ నిద్రపోని పట్టుదలను ప్రదర్శిస్తున్నారు. అలాంటి పట్టుదల దేశంలో అధిక సంఖ్యాకులకు ఉపయోగపడే అంశాలపై కేంద్రీకరిస్తే అందరికీ మంచిది..ఆయనకూ మంచి పేరు వస్తుంది. ఆయన కొత్త వ్యవసాయ విధానాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. కొందరు రైతులు రైతులను పెడతోవ పట్టిస్తున్నారని హెచ్చరించారు. ఆ కొత్త విధానం మంచిదో కాదో అత్యున్నత ప్రజావేదిక అయిన పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగేందుకు అవకాశాలను కుదించేస్తున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ సహా పలువురు విఐపీలకూ, పలువురు ఎంపీలకూ కొరోనా సోకిన కారణంగా పార్లమెంటు సమావేశాలను కుదించాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంటే కొత్త వ్యవసాయ విధానంపై చర్చ లేకుండా, లేదా తూ తూ మంత్రంగా చర్చ జరిగిందనిపించి ఆమోదింపజేయాలన్న ఆత్రుత ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది. కొత్త వ్యవసాయ విధానాన్ని రాజకీయాలకు అతీతంగా అంతా వ్యతిరేకిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఎన్నో దశాబ్దాలుగా అనుభవం ఉన్నవారు సైతం ఈ విధానం కాంట్రాక్టు ఫార్మింగ్‌ ‌చేసే వారికే ఉపయోగకరమైనదని ప్రకటిస్తున్నారు.

ఈ బిల్లు చట్టరూపం దాల్చితే తమ పంటకు కనీస మద్దతు ధర రాదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కేంద్రం చేస్తున్న వాదన మరో విధంగా ఉంది. రైతులు ఎక్కువ ధర ఎక్కడ ఇస్తే అక్కడ పంటలను అమ్ముకోవచ్చనీ, మార్కెట్‌ ‌సెస్‌ను రాష్ట్రాలు వసూలు చేయకూడదనీ, అమ్మకం దారునికీ, కొనుగోలు దారునికీ మధ్య సత్సంబంధాలు ఉండేట్టు చేయడమే ఈ కొత్త బిల్లు ముఖ్యోద్దేశ్యమని కేంద్రం చెబుతోంది. అయితే, ఆహారోత్పత్తులపై నియంత్రణ ఎత్తివేస్తే    ఆహార కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదనీ రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఈ బిల్లులో వివాదాస్పదమైన అంశాలు అనేకం ఉన్నాయి కనుక, దీనిపై సమగ్రంగా చర్చ జరగాలనీ, అందరి అభిప్రాయాలనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ప్రజా హితైషులు  డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రభుత్వం ఈ బిల్లును ఇంత హడావుడిగా ఆమోదింప జేసుకోవాలన్న ఆత్రాన్ని ప్రదర్శించడంతో చాలా మందిలో అనుమానాలు  వ్యక్తం అవుతున్నాయి. పంజాబ్‌, ‌హర్యానా రైతులు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీస మద్దతు ధరను ఎగవేయడం కోసమే ఈ కొత్త బిల్లును కేంద్రం తెచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించింది. యూపీఏ ప్రభుత్వం అమలు జేసిన విధానాలను వ్యతిరేకించడమే ధ్యేయంగా మోడీ ప్రభుత్వం పని  చేస్తోందనీ, ఉపాధి హామీ పథకాన్ని ఇప్పటికే నీరు గార్చిందనీ, వ్యవసాయ రంగంలో యూపీఏ అమలు జేసిన రైతు ప్రోత్సాహక విధానాలను రద్దు చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. మోడీ ప్రభుత్వం ప్రతి సమస్యనూ ప్రజా ప్రయోజనాల దృష్టితో కాకుండా రాజకీయ కోణం నుంచి చూడటం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. యూపీఏ హయాంలో అవినీతి జరిగిన మాటవాస్తవమే కావచ్చు,   ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టిన చందంగా, అవినీతి జరిగిందని పథకాలను ఏమార్చడం ఎంత మాత్రం మంచిది కాదని  రాజకీయాలతో సంబంధం లేని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏ రంగంలో సంస్కరణలను తేవాలని ప్రభుత్వం అనుకుంటోందో ఆ రంగానికి చెందిన నిపుణులను సంప్రదించడం సంప్రదాయం. మోడీ ప్రభుత్వం ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చిందనీ, అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని వారు ఆరోపించారు. కొరోనా నియంత్రణ విషయంలో కూడా మోడీ ముఖ్యమంత్రులతో  వీడియో సమాశాల్లో తాను చేయదల్చుకున్నది చెబుతున్నారే తప్ప, ముఖ్యమంత్రుల సూచనలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మోడీ తన పద్దతి మార్చుకోవాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

Leave a Reply