Take a fresh look at your lifestyle.

అమరుల త్యాగం మరువలేనిది

  • వారికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది
  • రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాళి…పార్లమెంట్‌పై దాడికి 22 ఏళ్లు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2001లో జరిగిన పార్లమెంట్‌పై జరిగిన దాడిలో అమరులైన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ.. దేశభక్తిని చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆపదను ఎదుర్కున్న వారి ధైర్యం, త్యాగం మన దేశం స్మృతి చిహ్నాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని రాసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా, కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, ఇతర నేతలు పార్లమెంటుకు హాజరై వీర జవాన్లకు నివాళులర్పించారు.

పార్లమెంట్‌ దాడి జరిగి నేటికి 22 ఏళ్లు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ సంస్థల ఉగ్రవాదులు డిసెంబర్‌ 13, 2001న పార్లమెంట్‌ కాంప్లెక్స్‌పై దాడి చేసి తొమ్మిది మందిని చంపారు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడిలో తమ ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అధ్యక్షుడు ద్రౌపది ముర్ము అన్నారు మరియు ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే ప్రతిజ్ఞను అందరూ పునరుద్ఘాటించాలని కోరారు.

22 ఏళ్ల క్రితం ఇదే రోజున, దేశంలోని అగశ్రేణి రాజకీయ నాయకత్వాన్ని నిర్మూలించి, మన ప్రజాస్వామ్య దేవాలయాన్ని దెబ్బతీయాలని ఉగ్రవాదులు వేసిన నీచమైన పథకాన్ని, మాతృభూమి కోసం తమ ప్రాణాలను అర్పించిన తొమ్మిది మందితో సహా వీర భద్రతా సిబ్బంది భగ్నం చేశారు.’ అని ముర్ము  ఒక పోస్ట్‌లో తెలిపారు. దేశం ఎప్పటికీ వారి రుణంలో ఉంటుందని ఆమె అన్నారు. ‘ప్రతిచోటా మానవాళికి ముప్పుగా ఉన్న ఉగ్రవాదాన్ని అన్ని రూపాలు మరియు వ్యక్తీకరణలలో ` తుడిచిపెట్టడానికి మా ప్రతిజ్ఞను మేము ఈ రోజు పునరుద్ఘాటిస్తున్నందున వారి త్యాగం వృథా కాదు’ అని రాష్ట్రపతి అన్నారు.

Leave a Reply