- అనతి కాలంలోనే అన్ని రంగాల్లో పురోగతి
- రాష్ట్రంలో గణనీయమైన ప్రగతి
- 2022-23కు గాను బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి హరీష్ రావు
- రాష్ట్రం స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తుందని వెల్లడి
కెసిఆర్ విజన్‌తో రాష్ట్రం అనతి కాలంలోనే అన్నిరంగాల్లో పురోగమించిందని, ఉమ్మడి ఎపిలో అనేక బాధలు, అషక్టకష్టాలు పడ్డ తెలంగాణ ఇప్పుడు అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో ప్రకటించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమని ప్రకటించారు. వివిధ పథకాల తీరుతో ధాన్యం దిగుబడులు పెరిగాయని, అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సాధించిందని అన్నారు. ఈ క్రమంలో కెసిఆర్ దార్శనికతతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలించిందని అన్నారు. 2022-23కు గాను బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్ రావు శాసనసభలో సోమవారం ఉదయం ప్రవేశపెట్టారు. ఇది కెసిఆర్ మార్క్ బడ్జెట్ అన్నారు. మూడోసారి బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెడుతున్నారు. రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ను రూపొందించారు. రూ. 2,56,958.51 కోట్లతో హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లుగా ఉంటుందని తెలిపారు.
మొత్తం బడ్జెట్ రూ.2 లక్షల 56 వేల 958 కోట్లుగా ఉందని, దేశ జిడిపి వృద్ధి రేటు 8.9 శాతంగా ఉంటే తెలంగాణ వృద్ధి రేటు 19.4 శాతంగా ఉందన్నారు. సేవల రంగం 18.3 శాతంగా వృద్ధి సాధించిందని, తెలంగాణ తలసరి ఆదాయం 2 లక్షల 78 వేల 833కు చేరిందన్నారు. తలసరి ఆదాయం వృద్ధిలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ స్థిరమైన వృద్ధి రేటు సాధిస్తుందన్నారు. తెలంగాణ దేశంలో అగ్రగామిగా రూపుదాల్చిందని మంత్రి తెలిపారు. పారదర్శక విధానాలతో రాబడిని పెంచుకున్నామన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ అగచాట్లు పడిందని గుర్తుచేశారు. పోరాటం దశ నుంచి ఆవిర్భావం వరకూ తెలంగాణ కొత్తరూపం సంతరించుకుందని తెలిపారు. సవాళ్లు, క్లిష్టమమైన సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్‌ఎస్ రాజీలేని వైఖరిని అవలంబించిందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు విద్యుత్ కోతలు, ఆకలి చావులు లేవన్నారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్ అని తెలిపారు. ఆసరా, రైతుబంధు ఇలా ఏ పథకమైనా లబ్దిదారులకే చేరుతుందని అన్నారు. ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం నిరుత్సాహపరుస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచే కేంద్రం దాడి మొదలైందన్నారు. ఏడు మండలాలను ఏపీకి అక్రమంగా బదలాయించిందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించామని హరీష్ రావు తెలిపారు. సీఎం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. పరిపాలనలో రాజీలేని వైఖరిని టీఆర్‌ఎస్ అవలంభించింది. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు అని స్పష్టం చేశారు.
ఇక బడ్జెట్ కేటాయింపుల వివరాలు పరిశీలిస్తే..2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూ. 2.56 లక్షల కోట్లు కాగా..రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లుగా చూపారు. క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లుగా, పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లుగా, కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లుగా, పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లుగా, గ్రాంట్లు రూ. 41,001 కోట్లుగా, రుణాలు రూ. 53,970 కోట్లుగా, అమ్మకం పన్ను అంచనా రూ. 33 వేల కోట్లుగా, ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు వొస్తుందని, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం రూ. 15,600 కోట్లు వొస్తుందని అంచనా వేశారు. బడ్జెట్‌లో ఆర్టీసీ బలోపేతానికి రూ. 1500 కోట్లు, పోలీసు శాఖకు రూ. 9,315 కోట్లు, కాళేశ్వరం సర్క్యూట్‌లో టూరిజం అభివృద్ధి కోసం రూ. 1500 కోట్లు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ కోసం రూ. 1542 కోట్లు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా రూ. 2,142 కోట్లు, పరిశ్రమలకు విద్యుత్ రాయితీల కింద రూ. 190 కోట్లు, పావలా వడ్డీ పథకానికి రూ. 187 కోట్లు, మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు, కొత్త వైద్య కాలేజీలకు రూ. 1000 కోట్లు, అటవీ విశ్వవిద్యాలయాలకు రూ. 100 కోట్లు, మన ఊరు- మన బడి పథకానికి రూ. 3,497 కోట్లు, వొచ్చే ఆర్థిక సంవత్సరం ఏడాది రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అలాగే రూ. 50 వేల లోపు రైతు రుణాలు మార్చి లోపు మాఫీ చేస్తామని అన్నారు. పంట రుణాలు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ చేశామన్నారు.
ఈ దఫా 5.12 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయించారు. పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు కేటాయిస్తూ .. రాష్ట్రం లో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పేర్కొన్నారు. కొత్త లబ్దిదారులకు ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలుపుతూ ఆసరా పెన్షన్లకు రూ. 11,728 కోట్లు కేటాయించారు. సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా పెన్షన్లు ఇవ్వనున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసేలా దళితబంధుకు రూ. 17,700 కోట్లు కేటాయించారు. ఎస్టీల సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు,బీసీల సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ. 2,750 కోట్లు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు, ధూప దీప నైవేద్య పథకానికి రూ. 12.50 కోట్లు, సొంత స్థలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. అయితే సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల ఆర్థిక సాయం4 లక్షల మందికి ఇస్తామని చెప్పారు. గతంలో 5 లక్షలు ఇస్తమాని దానిని 3 లక్షలకు పరిమితం చేశారు.
ఇలా నియోజకవర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపు కేటాయించి, ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు కేటాయింపు చేస్తామన్నారు. నిర్వాసితులు, ప్రమాద బాధితులకు 43 వేల ఇండ్లు కేటాయింపు చేస్తామన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి రూ. 12 వేల కోట్లు కేటాయించారు. పల్లె ప్రగతికి రూ. 3330 కోట్లు, పట్టణ ప్రగతికి రూ. 1394 కోట్లు, హరితహారానికి రూ. 932 కోట్లు, హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచిత నీటి పథకానికి రూ. 300 కోట్లు, పాతబస్తీలో మెట్రో రైలు కోసం రూ. 500 కోట్లు, అర్బన్ మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రో అనుసంధానానికి రూ. 500 కోట్లు, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు రూ. 1500 కోట్లు, హైదరాబాద్, ఓఆర్‌ఆర్ చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొరతను తీర్చేందుకు రూ. 1200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇక గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ ఏడాది పద్దు ప్రవేశపెట్టారు.
బ్జడెట్ ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. అవినీతి రహితంగా పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. దరఖాస్తు పెట్టాల్సిన పని లేకుండానే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. సీఎం ప్రగతిపథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర అని అన్నారు.