దుబ్బాక ఫలితం కేసీఆర్కు చెంపపెట్టు
కాంగ్రెస్ నేత దాసోజ్ శ్రావణ్
దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు రఘునందన్ రావుకు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ అభినందనలు తెలిపారు. ఇది బీజేపీ గెలుపు కాదని రఘునందన్ రావ్ గెలుపు అని అన్నారు. మంగళవారం దుబ్బాక ఎన్నికల ఫలితాల తర్వాత గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ….కాంగ్రెస్కు వోట్లు వేసిన దుబ్బాక ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని,
కాంగ్రెస్ ఆశించిన ఫలితం రాకపోయినప్పటికీ కేసీఆర్ దుర్మార్గపు పాలన అంతానికి నాంది లాంటిదే అని అన్నారు.
దుబ్బాక ఫలితం కేసీఆర్కు చెంపపెట్టులాంటిదని, దుబ్బాక ప్రజలు కేసీఆర్కు కర్రు కాల్చి వాతపెట్టారని విమర్శించారు. అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో గెలవొచ్చు అనుకున్న కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు. మల్లన్న
సాగర్ రైతుల ఉసురు కేసీఆర్కు తగిలిందని, ఈ పలితాలతోనైనా కేసీఆర్ కళ్ళు తెరవాలని, భూమి మీదకు వచ్చి పాలన సాగించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ వోట్ల షేరింగ్ బిజెపికి వెళ్ళిందని, ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందేమో చూడాలని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూల మీడియా ఎన్నికల రోజు ఫేక్ వీడియో ప్రసారం చేసి కాంగ్రెస్ను దెబ్బతీసిందన్నారు. ఈ ఎన్నికల్లో హరీష్ రావు ఇమేజ్ డామేజ్ చేసే కుట్ర దాగివుందని దుబ్బాక ఓటమిపై పార్టీలో లోతైన సమీక్ష నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలు ఎక్కడా నిరాశ పడవద్దని, పోరాట పటిమను విడొద్దని ధైర్యం చెప్పారు.