Take a fresh look at your lifestyle.

ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా సెంట్రల్‌ ‌హాల్‌

4 ‌వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం
ఇకపై సంవిధాన్‌ ‌సదన్‌గా పాత పార్లమెంట్‌
‌సెంట్రల్‌ ‌హాలు విశేషాలను వివరించిన ప్రధాని మోదీ
కొత్త పార్లమెంట్‌ ‌భవనంలోకి సభ్యులు
ప్రధాని మోదీ వెంట నడిచిన మంత్రులు
గ్రూపు ఫోటో దిగిన పార్లమెంట్‌ ‌సభ్యులు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌సెంట్రల్‌ ‌హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాత పార్లమెంట్‌ ‌భవనం ఇకపై సంవిధాన్‌ ‌సదన్‌గా ఉండనుందని తెలిపారు. పార్లమెంట్‌లో మంగళవారం నాటి సమావేశం ఎంతో భావోద్వేగంతో కూడుకుందని, ఈ సెంట్రల్‌ ‌హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి అని, మన రాజ్యాంగం ఈ సెంట్రల్‌ ‌హాల్‌లోనే రూపుదిద్దుకుందని ప్రధాని తెలిపారు. పార్లమెంట్‌ ‌నూతన భవనంలో భారత్‌ ‌ప్రయాణం ప్రారంభమైంది. కొత్త చరిత్రలోకి అడుగుపెట్టింది. మంగళవారం పార్లమెంట్‌ ‌పాత భవనంలోని సెంట్రల్‌ ‌హాల్‌లో జరిగిన ప్రధాని ఉద్విగ్న ప్రసంగం తర్వాత ఉభయ సభ సభ్యులు కొత్త పార్లమెంట్‌కు పాదయాత్రగా వెళ్లారు. ప్రధాని మోదీ ముందు నడవగా..మంత్రులు, ఎంపీలు ‘భారత్‌ ‌మాతాకీ జై’ అంటూ ఆయన్ను అనుసరించారు. అలాగే సెంట్రల్‌ ‌హాల్‌లోని రాజ్యాంగ పుస్తకాన్ని నూతన భవనంలోకి తరలించారు. లోపలికి వెళ్లిన ప్రధాని కొత్త భవనాన్ని తరచి చూశారు. సభలోకి వెళ్లిన వెంటనే జాతీయ గీతం ఆలపించారు. ఆ తర్వాత సభ్యులు వారి సీట్లలో కూర్చున్నారు. అనంతరం పార్లమెంట్‌ ‌కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌ ‌మాట్లాడిన తర్వాత.. ప్రధాని మోదీ తొలి ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్‌ ‌భవనం ప్రారంభించుకుంటున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ధ్రాని మాట్లాడుతూ…వినాయక చవితి రోజు కొత్త భవనం ప్రారంభించుకోవడం శుభసూచకమని, ఆజాదీ అమృత కాలంలో ఇది ఉషోదయ కాలమని కొత్త భవనంలోకి కొత్త సంకల్పం తీసుకొని వెళ్లాలని సభ్యులకు సేచించారు. చంద్రయాన్‌ 3 ‌విజయం దేశవాసులను గర్వపడేలా చేసిందని, జీ20 సమావేశాల సమర్థ నిర్వహణ భారత ప్రతిష్ఠను పెంచిందన్నారు. ప్రాచీన ప్రజాస్వామ్య స్ఫూర్తి, ఆధునిక భారతీయతత్వాలకు కలబోత కొత్త భవనమని ఈ సందర్బంగా మోదీ వెల్లడించారు. కొత్త పార్లమెంట్‌కు తరలివెళ్లే ముందు ఉభయ సభల సభ్యులు పాత భవనంలోని సెంట్రల్‌ ‌హాల్‌లో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వారసత్వంపై అందులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ… ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా సెంట్రల్‌ ‌హాల్‌లోనేనని, 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ఇక్కడే ప్రసంగించారని, రాష్ట్రపతులు 86 సార్లు ఇక్కడ తమ ప్రసంగాలను వినిపించారని వివరించారు. ఇక్కడి నుంచే 4 వేలకుపైగా చట్టాలను ఆమోదించుకున్నామని, అనేక కీలక చట్టాలను ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదించుకున్నామని, తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌చట్టాలు ఇక్కడే ఆమోదం పొందాయని తెలిపారు.

ఆర్టికల్‌ 370 ‌నుంచి విముక్తి కూడా పార్లమెంట్‌ ‌ద్వారానే జరిగిందని, దాంతో ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ ‌శాంతిపథంలో పయనిస్తుందని ప్రధాని వెల్లడించారు. అలాగే తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌లో కొత్త చైతన్యం వొస్తుందని, మనం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామో అంత వేగంగా ఫలితాలు వొస్తాయన్నారు. సాంకేతికతను అందించడంలో మన దేశ యువత ముందువరుసలో ఉందని, ప్రజల ఆకాంక్షలు ఉజ్వలంగా ఎగసిపడుతున్నాయన్నారు. వాటిని అందుకునే ప్రయత్నం నిరంతరం సాగాలని, అందుకే కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలని సభ్యులను కోరారు. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేమన్నారు.

అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌..‌త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని తెలిపారు. అలాగే ప్రపంచంలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత ఉందని, దానిని భారత్‌ ‌పూరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వతంత్ర భారత్‌లో చోటుచేసుకున్న ఎన్నో కీలక ఘట్టాలకు పాత పార్లమెంట్‌ ‌సాక్షిగా మిగలనుందన్నారు. ఈ సమయంలో పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ‌ఫొటో దిగారు. వారంతా ఇందుకు మంగళవారం ఉదయం పాత పార్లమెంట్‌ ‌ప్రాంగణానికి వొచ్చారు. మొదట ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ‌ఫొటోకు దిగారు. తర్వాత రాజ్యసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులు విడివిడిగా ఫొటో దిగారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ ‌జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం ‌బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ‌హరివంశ్‌ ‌తదితరులు ముందు వరుసలో కూర్చున్నారు. ఉపరాష్ట్రపతి, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ ‌సింగ్‌ ‌మధ్యలో మోదీ కూర్చుని కనిపించారు.

Leave a Reply