రైతుల సమస్యలు వినాలని కేంద్రాన్ని కోరిన ప్రియాంక
న్యూఢిల్లీ,డిసెంబర్28: కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ వేడుకలను పార్టీ నేతలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోని పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి పార్టీ సీనియర్ నేతలతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా పాల్గొన్నారు. అయితే, ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధినేత రాహుల్ గాంధీ దూరంగా ఉండటం మరోసారి చర్చనీయాంశమయ్యింది.పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడిన ప్రియాంక గాంధీ, దేశంలో ఆందోళన బాటపట్టిన రైతుల సమస్యలను వినాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు చేపట్టిన ఈ ఉద్యమాన్ని రాజకీయ కుట్రగా పేర్కొనడాన్ని మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల సమస్యలను వినేందుకు చర్చలు జరపాలని.. తద్వారా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అయితే, రాహుల్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై డియా ప్రశ్నించగా.. ప్రియాంక గాంధీ స్పందించలేదు. ఇదే విషయంపై భాజపా నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఎంతో ముఖ్యమైన పార్టీ ఆవిర్భావ వేడుకల వేళ రాహుల్ గాంధీ మాత్రం అదృశ్యమయ్యారని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ట్విటర్లో అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, గతకొంత కాలంగా అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి ఒకరోజు ముందే విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆవిర్భావ వేడుకలకు దూరమయ్యారు. ఆయన మరికొన్ని రోజులు విదేశీ పర్యటనలోనే ఉండే అవకాశం ఉంది. అయితే, రాహుల్ ఎక్కడికి వెళ్లారనే విషయంపై మాత్రం గోప్యత కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆయన ఇటలీలోని మిలాన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది.