ఉద్యాన పంటలు సాగుకు ప్రోత్సాహం
రైతులు నష్టపోకుండా అన్ని విధాలా చర్యలు
ఉద్యాన, పట్టు పరిశ్రమ, వ్యవసాయ రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష
అమరావతి,ఆగస్ట్13 : ఉద్యానపంటలు సాగు చేసే రైతులు నష్టపోకుండా ఉండేలా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఉద్యాన, పట్టు పరిశ్రమ, వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఉద్యాన రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని నిర్దేశించారు. పండించిన పంటలకు తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలని, పంటను పారబోసే పరిస్థితి ఎక్కడా కనిపించకూడదని స్పష్టం చేశారు.
మెరుగైన సాగు విధానాలు, నాణ్యమైన ఉత్పత్తులు వచ్చేందుకు అవసరమైన పరిశోధనలన్నింటినీ చేయాలని, దీనికోసం జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. అగ్రికల్చర్ విద్యార్థులు ఇకపై తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలని సీఎం ఆదేశించారు. రైతులకు బిందు, తుంపర్ల సేద్యం పరికరాలు మరింత తక్కువ ధరకు అందించేందుకు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం ఆదేశించారు. ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ప్రూట్ బౌల్ ఆఫ్ స్టేట్‌గా ఏపీ పేరుపొందిందని సీఎంకు అధికారులు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్ధానంలోనే నిల్చిందని, టిష్యూ కల్చర్ విధానంలో అరటిసాగు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.