Take a fresh look at your lifestyle.

మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి
వాతావరణ మార్పుల అంశంపై రెండు రోజుల వర్క్‌ షాప్‌
వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వక్తలు  

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 14 : మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాల రూపంలో సమాజం మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. యునైటెడ్‌ స్టేట్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ సహకారంతో, తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయుడబ్ల్యూజే) , వ్యూస్‌ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, జర్నలిస్టులకు వాతావరణ మార్పులు అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే వర్క్‌ షాప్‌  గురువారం ప్రారంభమైంది. మానవళి మనుగడకు ప్రధాన కారణమైన వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కథనాలకు మీడియా రంగం తగు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం మీడియా సమకాలీన రాజకీయాలు, వ్యాపార సంబంధమైన అంశాలకు తప్ప, ఎంతో కీలకమైన వాతావరణ మార్పులపై  కథనాలకు  ప్రాధాన్యం ఇవ్వడం లేదని వారు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో   కె.శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ..  వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

అనంతరం యునైటెడ్‌ స్టేట్స్‌ కౌన్సెల్‌ జనరల్‌ జెన్నీఫర్‌ లార్సన్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులపై జర్నలిస్టులకే ఎక్కువ అవగాహన ఉండాలన్నారు. ప్రపంచ అభివృద్ధి గమనానికి ప్రధాన కారణమైన వాతావరణ మార్పుల పై  మీడియా రంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని  గుర్తు చేశారు. వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలపై అప్రమత్తం చేసేందుకు జర్నలిస్టులు ఈ అంశంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉంటే మంచిదన్నారు. ఇలాంటి చక్కటి సదస్సుకు తాము సహకారం అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ జర్నలిస్టులు,  సమాజం భవిష్యత్తులో రాబోయే విపత్తుల ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. వాతావరణానికి మీడియాలో తగినంత ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి లేనప్పటికీ, జర్నలిస్టులు దీనిపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకుంటే ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు డిజిటల్‌ మీడియాలో విస్తృతంగా సమాచారం అందించి ప్రజలను చైతన్యపరచవచ్చునని పేర్కొన్నారు.

మీడియా రంగం తాత్కాలికమైన అంశాలకు, రాజకీయ అంశాలకు ఇచ్చినంతగా ప్రాధాన్యం వాతావరణ మార్పులకు ఇవ్వడం లేదన్నారు. మానవాళి మనుగడను ప్రశ్నార్థకంలో పడేస్తూ దీర్ఘకాలికంగా అంతర్లీనంగా కొనసాగుతున్న మార్పులను తద్వారా భవిష్యత్తులో జరగబోయే విపత్తులను మనం గుర్తించలేకపోతున్నామని ఆయన అన్నారు. ఎలాగైతే భారతదేశంలో ప్రజాస్వామ్యం తగ్గిపోతోందని, ఫాసిజం, నియంతృత్వం పెరిగిపోతుందన్న విషయాన్ని ప్రస్తుతం ఎవరు గుర్తించడం లేదని, మరికొన్ని ఏళ్ళ తర్వాత అది ప్రజలకు  అనుభవంలోకి వస్తుందన్నారు. వాతావరణ మార్పులపై ఎవరైనా మాట్లాడినా, దాని ప్రతికూల పరిణామాలపై ఉద్యమించినా దానిని కొన్ని వర్గాలు అభివృద్ధి వ్యతిరేక చర్యగా భావించడం విచారకరమన్నారు. మనుషుల మనుగడ ముడిపడి ఉన్న ప్రకృతి వైపరీత్యాల పై సున్నితంగా ఆలోచించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. నేడు మానవాళికి పట్టణీకరణ ప్రమాదకరంగా మారిందని, ఒకప్పుడు హైదరాబాద్‌ కు  గ్రామాల నుంచి వచ్చేవారు పేదోళ్ల ఊటీగా భావించే ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేదని, ప్రస్తుతం కాలుష్య విషంతో హైదరాబాద్‌ కొట్టుమిట్టాడుతుందన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో వేసవికాలం జనవరి తోనే మొదలయ్యే పరిస్థితి నెలకొందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్‌ అలీ మాట్లాడుతూ ప్రకృతిలో మార్పులు పర్యావరణ విపత్తులు అనేవి ఒక ప్రాంతానికో, దేశానికో పరిమితం కావని, ప్రపంచవ్యాప్తంగా గోచరిస్తున్న ఈ పరిణామాలపై జర్నలిస్టులు మరింత అవగాహన పెంపొందించుకోవాలన్నారు. మానవ మనుగడకు కారణమైన వాతావరణ మార్పులపై ప్రజలను చైతన్య పర్చాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. జర్నలిస్టులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహించేందుకు తమ సంఘానికి అవకాశం కల్పించిన యునైటెడ్‌ స్టేట్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ఈ శిక్షణ తరగతులలో హైదరాబాద్‌ తో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల జర్నలిస్టులు, ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఉమా సుధీర్‌, వ్యూస్‌ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ భీమారావు, యూఎస్‌ కౌన్సిలేట్‌ సిపిఆర్‌ఓ బాసిత్‌, సీనియర్‌ పాత్రికేయురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply