Take a fresh look at your lifestyle.

మోడీ ప్రభుత్వం వ్యవసాయ విధ్వంస చట్టాలు మూడింటిని తిరస్కరించండి!

1. ధర భరోసా మరియు వ్యవసాయ సేవల కోసం రైతుల(సాధికారత మరియు రక్షిత) ఒప్పంద చట్టం.
2. రైతుల ఉత్పత్తుల వ్యాపారం మరియు వాణిజ్యం(ప్రోత్సాహం మరియు సౌలభ్యం) చట్టం.
3. అత్యవసర సరుకుల(సవరణ) చట్టం.
వీటిని ఎందుకు వ్యతిరేకించాలి?
1. ప్రజాస్వామిక పద్ధతులను అన్నింటిని ఉల్లంఘించి ఈ  చట్టాలు చేశారు. రాజ్యాంగం ప్రకారం అత్యవసర పరిస్థితిలోనే ఆర్డినెన్సులను జారీ చేయాలి. ఏ విధమైన అత్యవసర అవసరం లేకపోయినప్పటికీ మూడు వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం జూన్‌ 5 2020 ‌న ఆర్డినెన్స్ ‌రూపంలో ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత,  రైతులు  మరియు రైతు సంఘాలతోను, విపక్ష పార్టీలతోనే గాక,  స్వపక్షము లోని ఇతర రాజకీయ పార్టీలతో కూడా చర్చించకుండా పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ప్రజాస్వామిక పార్లమెంటరీ పద్ధతులు అన్నింటిని తోసి వేసి అరుపులు కేకలు మధ్య మూజువాణి ఓటుతో ఈ ఆర్డినెన్సులకు ఆమోదం పొందింది.
2. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ‘కనీస మద్ధతు ధర’ పదాన్ని తొలగించి, దాని స్థానంలో ‘గిట్టుబాటు ధర’ అనే పదమును చట్టంలో చేర్చారు.
3. గిట్టుబాటు ధరలను స్వామినాథ•న్‌ ‌కమిషన్‌ ‌రికమండేషన్‌ల ప్రాతిపదికన ప్రభుత్వమే నిర్ణయించే నిబంధన ఏదీ చట్టంలో లేదు. అంటే, ధరలను  నిర్ణయించే స్వేచ్ఛ బడా వ్యాపార వాణిజ్య సంస్థల గుత్తాధికార గుప్పిటలోకి పోతుంది.
4. బడా వ్యాపార వాణిజ్య సంస్థలు సిండికేట్లుగా మారి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను తగ్గించి వేయకుండా నియంత్రించే నిబంధనలు ఏవి ఈ చట్టాలలో లేవు.(వ్యాపారస్తులు కుమ్మక్కు అయి ధరలను పాతాళంలోకి తీసుకుపోవడం వలన టమాటోలు, ఉర్లగడ్డలు, బంగాళాదుంపలు మొదలగు వాటిని  రైతులు రోడ్లపైనే పారబోయడం మనం చూస్తూనే ఉన్నాం).
5. కనుక, ఎప్పుడు ఎక్కడ ‘గిట్టుబాటు ధర’ వస్తే అప్పుడు అచ్చటనే  రైతు తన పంటలు అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం చెబుతున్న మాటలు నీటి మూటలు.
మన దేశంలోని మొత్తం రైతులలో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు(5ఎకరాల లోపు). ఇప్పటికే, పది ఎకరాల రైతు కూడా, వ్యాపారస్తుల దయాదాక్షిణ్యాల నిర్ణయ ధరలకు తమ ఉత్పత్తులను అమ్ముకొనక తప్పని పరిస్థితి మనం చూస్తున్నాం. రైతులు బడా కంపెనీల ఎత్తుగడలు వ్యూహాలకు బలికాకుండా కాపాడే నిబంధనలు ఏవి ఈ చట్టాలలో లేవు. కనుక మొత్తం రైతాంగం అంబానీ, అదానీ లాంటి కార్పొరేటు వాణిజ్య సంస్థల కబంధ హస్తాలలో పిప్పి పిప్పి అయిపోతారు.
6. వ్యాపారస్తులు ధరలను తగ్గించి వేసినప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ ‌కమిటీయే రంగంలోకి దిగి రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది అనే క్లాజ్‌ ‌చట్టంలో లేదు.
7. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని కంపెనీలు ఉల్లంఘిస్తే రైతులు కోర్టులో కేసు వేసుకోవచ్చని చట్టంలో ఉన్న క్లాజ్‌ ‌కంపెనీల ధనం శక్తి ముందు  నీరుకారిపోతుంది.
8. ఈ కారణాల వలన ఈ చట్టాలు రైతు యొక్క జీవించే హక్కుపై దాడి. అంటే అంబేద్కర్‌ ‌విరచిత, యావత్‌ ‌రాజ్యాంగ సభ ఆమోదించిన భారత రాజ్యాంగం లోని 21వ అధికరణను ధిక్కరించటమే.
9. వ్యవసాయ ఉత్పత్తులను గోదాములలో దాచిపెట్టి వాటి ధరలను 50 నుంచి 100 శాతం మేర పెంచి వేసి అమ్ముకునే స్వేచ్ఛను అత్యవసర సరుకులను నియంత్రణ చట్టం,2020(3 చట్టాలలో ఒకటి) వ్యాపార వర్గాలకు దఖలు పరిచింది. అంటే, మొత్తం దేశ ప్రజల యొక్క ఆహార భద్రత హక్కుపై, అనగా జీవించే హక్కుపై నేరుగా దాడి చేయడమే.
10. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌ ‌ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల హక్కుల పరిధిలోని అంశం అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజాస్వామికంగా చర్చ చేయలేదు.
11. ఈ చట్టం మరియు దాని నియమాలు లేదా ఆదేశాల అమలు కోసం, కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ లేదా వాటికి చెందిన అధికారి గానీ లేదా ఏ ఇతర వ్యక్తి గాని సదుద్దేశంతో చేసినటువంటి, చేయబోయేటటువంటి ఏ వ్యవహారము గానీ  న్యాయస్థానాల విచారణ పరిధిలోకి రావు. భవిష్యత్తులో చేసే వ్యవహారం కూడా న్యాయస్థానాల విచారణ పరిధిలోకి రావు అని ఏ చట్టంలో లేదు. ఆ విధంగా ఈ చట్టం కార్యనిర్వాహక వర్గంకి  అత్యంత విచ్చలవిడి అధికారాలను కట్టబెట్టింది.
ఈ అన్ని కారణాల రీత్యా, అంబానీ అదానీ లాంటి వారి  మరియు వారి స్నేహితులగు సామ్రాజ్యవాద కంపెనీల సేవలోనే  తమ  స్వార్థపూరిత రాజకీయ భవిష్యత్తును కాపాడుకోదలచుకున్న మరియు మనదేశ ఆహార ఉత్పత్తిదారులైన రైతులపైన, వారి జీవితాలపైన, తద్వారా మనందరి జీవితాలపైన దాడి చేయడానికి పూనుకున్న నరేంద్ర మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న, ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో పాల్గోన వలసిందిగా ప్రజలందరకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(ఓపిడిఆర్‌) ‌విజ్ఞప్తి చేస్తోంది.
 ‌సి. భాస్కరావ్‌, అధ్యక్షుడు, బి. నరసింహా కార్యదర్శి, కేంద్ర కమిటీ, ఓపిడిఆర్‌.

Leave a Reply