Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతున్న కొరోనా కేసులు

  • రాష్ట్రంలో  పాజిటివ్‌ ‌కేసులు  364
  • గాంధీ ఆసుపత్రికి రోగుల తాకిడి
  • ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో ఒక్కరోజే 23 మందికి పాజిటివ్‌
  • ‌నిజామాబాద్‌లో 10, మహబూబ్‌నగర్‌లో పసికందుకు నిర్దారణ
  • పాజిటివ్‌ ‌కేసులన్నీ మర్కజ్‌ ‌ట్రావెల్‌ ‌హిస్టరీవే
  • వన్య ప్రాణుల రక్షణకు చర్యలు
  • 30 వరకూ హైకోర్టు లాక్‌డౌన్‌
  • ‌పోలీసుల ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వాహనాలు

రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌సోకిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్‌ ‌నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఈ మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 364గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
అధికారులు ప్రకటించారు. తాజాగా మంగళవారం ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో ఒక్కరోజే 23 పాజిటివ్‌ ‌కేసులు
నమోదైనట్టు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.  నిజామాబాద్‌లో 10 మహబూబ్‌నగర్‌లో 3 పాజిటివ్‌ ‌కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క నిజామాబాద్‌ ‌జిల్లాలోనే ఇంకా 109శాంపిల్స్ ‌పెండింగ్‌లో ఉన్నాయనీ, వీటిలో మరిన్ని పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉందనీ, దీంతో ఈ సంఖ్య మరింతగా పెరగవచ్చ•ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవన్నీ దిల్లీ మర్కజ్‌ ‌ట్రావెల్‌ ‌హిస్టరీ ఉన్నవే కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను ఇంకా కొద్ది రోజుల పాటు పొడిగిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. కొరోనా రక్కసి కరాళ నృత్యానికి అంతా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో మరో మూడు పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. ఈకేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కొరోనా సోకినట్లు ఆ జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్‌రావు ప్రకటించడం అందరినీ కలచివేస్తున్నది. దీతో ఆ పసికందును మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే, నిజామాబాద్‌ ‌జిల్లాలో కొత్తగా పది మందికి కొరోనా వైరస్‌ ‌సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు, రాష్ట్రంలో కొరోనా కేసులు పెరుగుతుండటంతో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టుల్లో ఈనెల 30 వరకూ లాక్‌డౌన్‌ ‌కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ఫుల్‌కోర్టు సమావేశం నిర్వహించిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 25న మరోసారి సమావేశమై లాక్‌డౌన్‌పై చర్చించాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో ఉన్న పెద్ద పులులు, వన్య ప్రాణుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అమెరికాలోని జూపార్క్‌లో నాలుగేళ్ల పులికి వైరస్‌ ‌సోకిన నేపథ్యంలో రాష్ట్రంలో వన్యప్రాణుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అటవీ శాఖ అధికారులతో ఫోన్‌లో సమీక్షించారు. రాష్ట్రంలోని ఫారెస్ట్‌లలో ఉన్న జంతువులు ఆనారోగ్యానికి గురి కాకుండా చూసుకోవాలనీ, జంతువులకు సురక్షితమైన ఆహారం అందించాలని సూచించారు. అలాగే, జూలో జంతువులకు ఆహారం అందించే సిబ్బందికి కూడా కొరోనా వైరస్‌ ‌నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.  ఇదిలా ఉండగా, అత్యవసర సమయాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మంగళవారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభించారు. సీనియర్‌ ‌సిటిజన్లు, మెడికల్‌ ‌సర్వీసలు కోసం వీటిని వినియోగించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy