Take a fresh look at your lifestyle.

శ్రీవైష్ణవ ఆళ్వార్లలో ఏకైక స్త్రీమూర్తి గోదా కవయిత్రి

ఆళ్వార్‌ అం‌టే మనను ఏలు వారు అని అర్థం. ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపథంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణుభక్తులు 12 మంది. పన్నిద్దరాళ్వారులు (12 మంది ఆళ్వారులు) అంటారు. ఈ ఆళ్వారులలో చాలామంది వైష్ణవ కులంలో పుట్టిన వారు కాదు. కులబేధాలను పాటించని మతం వైష్ణవం, విశిష్టాద్వైతం. వారిలో తండ్రీకూతుళ్లు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్‌) ‌శ్రీవిష్ణుచిత్తులు, గోద ఉన్నారు. 12 మందిలో స్త్రీమూర్తి ఈమె ఒక్కరే.  స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిదీ అని చెప్పడానికి ఈనాటికీ నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావై.  

గోవింద గోదా గీతమ్‌ (‌తిరుప్పావై)

తిరుప్పావై, (సిరినోము, శ్రీ వ్రతం) పేర ఎనిమిది పాదాలతో 30 పద్యాల (తమిళంలో పాశురాలు) మధుర భక్తి కావ్యం ద్వారా 12 వందల సంవత్సరాల తరువాత కూడా చిరంజీవియై భాసిస్తున్న మహాకవయిత్రి గోదా దేవి. గోదా దేవి నలనామ సంవత్సరం, కర్కాట మాసం, పుబ్బా నక్షత్రం, ఆషాఢ శుద్ధ చతుర్దశి రోజున (క్రీ.శ. 776) తులసిమొక్కలు ఎక్కువగా ఉన్న పూలవనంలో కలుపు తీస్తున్నపుడు జనకునికి సీత వలె, విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ.  అయోనిజ. తులసీదళాలకు తోడు ఒక పూవు దొరికిందనుకున్నాడు తండ్రి.  ముద్దుగా కోదై (తులసిమాల) అని పేరు పెట్టుకున్నాడు. భూమినుంచి తులసి వచ్చినట్టే ఈ పాపకూడా వచ్చిందని మరొక అర్థం. పెంచింది శ్రీ విష్ణుచిత్తుడు. విష్ణువే చిత్తములో గలవాడు. తండ్రి ఆలోచనలు, మనసు, మనసులో ఉన్న వటపత్రశాయి ఆమెలోనూ భాసించారు. వైష్ణవ మతంలోని ప్రేమ తత్త్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించారు. పిలుపులలో గోదై, అనే పేరు కాస్త మారి గోద అయింది.  13 ఏళ్ల వయసులో తిరుప్పావై రచించిన విద్యన్మణి గోదాదేవి. అందరినీ కలుపుకుని పోయే నాయకత్వలక్షణాన్ని ఈవ్రతం వివరిస్తున్నది.

మహిళా విద్యకు సజీవ సాక్షి గోదాదేవి
ఆళ్వార్‌ అం‌టే మనను ఏలు వారు అని అర్థం. ఆచార్యులై మనను పరిపాలించేవారే మనను విష్ణుపథంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణుభక్తులు 12 మంది. పన్నిద్దరాళ్వారులు (12 మంది ఆళ్వారులు) అంటారు. ఈ ఆళ్వారులలో చాలామంది వైష్ణవ కులంలో పుట్టిన వారు కాదు. కులబేధాలను పాటించని మతం వైష్ణవం, విశిష్టాద్వైతం. వారిలో తండ్రీకూతుళ్లు పెరియాళ్వారు (పెద్ద ఆళ్వార్‌) ‌శ్రీవిష్ణుచిత్తులు, గోద ఉన్నారు. 12 మందిలో స్త్రీమూర్తి ఈమె ఒక్కరే.  స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెల్లవనడానికి 12 వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిదీ అని చెప్పడానికి ఈనాటికీ నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావై. తులసీ వనంలో పుట్టి విష్ణుచిత్తుని నారాయణ కీర్తనలు మంత్రాలు వింటూ పూజల్లో వెంటనడుస్తూ గోదాదేవి ఎదిగింది. నారాయణుని లీలలను తండ్రి వివరిస్తుంటే విని, అతడే తన భర్త అని ఏనాడో నిశ్చయించుకున్నది.

ఆండాళ్‌ (‌నా బంగారు తల్లి)
తండ్రి పూలు కోసి, తులసీదళాలతో చేర్చి మాలలు అల్లుతూఉంటే తనూ నేర్చుకున్నది గోద. తండ్రి నోటినుంచి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణుకథలు, భారత భాగవతాలు, రామాయణ రమ్య ఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చికూర్చిన పాశురాలు అన్నీ వింటూ ఎదిగింది గోదాదేవి. ఆ తులసీ మాల కోదై పూమాలలద్వారా శ్రీవిల్లిపుత్తూరులోని మూలమూర్తి వటపత్రశాయికి ప్రేమసందేశాలు పంపింది. ఆ కథల్లో అన్ని అవతారాలలో ఉన్న నారాయణుడు రంగనాథుడి రూపంలో ఆమెకు మరింత నచ్చినాడు. శ్రీరంగంలోని పూలరంగడికి మనసిచ్చింది. ఆయనే తన ప్రియుడనీ భర్తఅని బంగారు కలలు కన్నది. వటపత్రశాయిలో రంగడిని చూసుకున్నది. తండ్రీ తానూ ఎవరు అల్లినా సరే  ఆ పూలమాలలను ముందు తను అలంకరించుకుని బాగుందో లేదో అద్దంలో చూసుకుని తృప్తిచెందిన తరువాతనే మూలమూర్తికి పూలబుట్టను పంపేది. ఆమాలలు ఆయన మెడలో చూసి పరవశించిపోయేది.
ఓరోజు తాను తీసుకుని పోయిన పూమాలలో అమ్మాయి శిరోజం వచ్చిందని బాధపడి మాలలను స్వామికి సమర్పించకుండా వచ్చి కూతురిని మందలించాడు విష్ణు చిత్తుడు. అపరాధం చేసానని బాధపడుతూ నిద్రించిన విష్ణుచిత్తుడికి విష్ణవే కలలో కనిపించి కోదై ధరించి ఇచ్చిన మాల అంటేనే తనకు ప్రియమని కనుక గోదమ్మ ధరించిన మాలలనే తనకు ఇమ్మని కోరుతాడు.  విష్ణుచిత్తునికి గోదా చిత్తంలో విష్ణువు, విష్ణువు చిత్తంలో గోద ఉన్నారని అర్థమవుతుంది. గోద తన కూతురు కాదు తనకు కన్నతల్లి ఆండాళ్‌ (అం‌టే నను గన్న తల్లి అని అర్థం) అని పిలుస్తాడు. అప్పడినుంచి విష్ణుచిత్తులు వారు ఆమెను ఆండాళ్‌ అనే పిలిచేవారు. (మనం కూడా కన్న కూతురిని బంగారు తల్లి అనీ మా అమ్మే అనీ అనుకుంటాం కదా). ఆమె ధరించిన మాలలనే స్వామికి అర్పించేవారు.

శ్రీరంగని వలచి వరించి…
అప్పడినుంచి ఆమె కు వచ్చిన మరో పేరు చూటిక్కొడుత్త ( ఈ తమిళ పదానికి ‘ఆముక్త మాల్యద’ అనే సంస్కృత పదానికి ‘‘ధరించి ఇచ్చిన’’ అని అర్థం) శ్రీ కృష్ణదేవరాయలు రచించిన గోదారంగనాథుల ప్రణయైక్య కావ్యానికి ఆముక్త మాల్యద అని పేరు. 30 పద్యాలు పాడి ఇచ్చినారు కనుక ‘‘పాడికొడుత్త నాచ్చియార్‌’’ అని మరో పేరుకూడా వచ్చింది. పెరియాళ్వార్‌ ‌కు అమ్మాయికి వరుడిని వెదికే బరువు దిగిపోయింది. కూతురు కోరిన విధంగా విష్ణువు కూడా వరించినాడు కనుక మనసు నెమ్మదించింది. ఇక గోద నెలరోజుల పాటు దీక్ష వహించి శ్రీ వ్రతం, (సిరినోము, కాత్యాయనీ వ్రతం, తిరుప్పావై) పాటించింది. తాను రాధ అయితే తోటి  బాలికలు గోపికలు, విల్లిపుత్తూరే బృందావనం, వ్రేపల్లె,  అక్కడ ప్రవహించే నదే యమునానది, వటపత్రశాయే క్రిష్ణయ్య, మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకున్న భాగవత కథలు, ఉపనిషద్‌ ‌సూత్రాలు, వేదసార వాక్యాలే పాశురాలు. వరిచేలు, తుళ్లిపడే చేపలు, చిలుకలు, కొంగలు, ఆవులు దూడలు, మల్లె పొదలు, తులసీ వనాలు అన్ని బృందావనానికి ప్రతిబింబాలే. తొందరగా లేవవేం తల్లీ, లేచినా తలుపు తీయవా, తలుపు తీసినా లోపలికి రానీయవేమిటి అంటూ కొద్దిగా కోపం చూపే కలహాలు, మందలింపులు, అంతలోనే కలిసిపోయే స్నేహాలు ఇవన్నీ ఆమె పాశురాల్లో ఆశువుగా కురిసాయి. ఒక్కో పాశురం అర్థం తెలిసి చదువుతూ ఉంటే ఆనాటి యమునా తీర విహారి రాసలీలలు చూస్తున్నట్టు తోస్తుంది. భాగవత భావగత కథాకథనాలను కళ్లకు కట్టే దృశ్యకావ్యం తిరుప్పావై. వ్రతం పూర్తికాగానే ఫలం సిద్ధించింది. రంగడు  శ్రీరంగంలో ఆలయ పెద్దలకు కలలో కన్పించి పల్లకీని శ్రీవిల్లిపుత్తూరుకు పంపి గోదను విష్ణుచిత్తులవారిని తీసుకొని రమ్మన్నాడు. గోదను వివాహం చేసుకున్నాడు. గోద రంగనాథునిలో లీనమైంది. గోదాదేవి కథ ఒక అద్భుతం. ఎనిమిదో శతాబ్దంలో జరిగిన దివ్య చరిత్ర.

మరో మహా కావ్యం
శ్రీరంగనాథుని ప్రేమించిందనడానికి ప్రమాణం ఏమిటి? ఇది కట్టుకథ అని వాదించే వారుంటారు.  దీనికి ప్రమాణం గోదాదేవి పదిహేనేళ్లప్రాయంలో రచించిన మరో కావ్యం ‘‘నాచ్చియార్‌ ‌తిరుమెళి‘‘ నాయకి రచించిన పవిత్రగీతాలు అని అర్థం. రంగనాథుని వలచిన గోదాదేవి తన వలపు, రంగనికి పంపిన ప్రేమలేఖలు, తన భావావేశ అనురాగ సందేశాలు, ఆశలు, ఆశయాలు, అలకలు, కోపాలు ఇందులోని 143 పాశురాలలో వ్యక్తమవుతాయి. నాచ్చియార్‌ ‌తిరుమోళి గోదాత్మను పరమాత్మతో అనుసంధించే అద్భుత కావ్యమైతే తిరుప్పావై ఆమెను సశరీరంగా రంగనాథునిలో విలీనంచేసిన మహాద్భుత కావ్యం. రెండు కావ్యాలూ భక్తిని పరమాత్మపట్ల సమర్పణ భావాన్ని, రంగని వెతుక్కునే తాపత్రయాన్ని వివరిస్తాయి. మోక్షగాములందరికీ అనుసరణీయ మార్గాలను చూపుతాయి.

ఓం నమో నారాయణాయ
తిరుప్పావై ఉపనిషత్తుల సారాంశం. భగవద్గీతతో సమానంగా సంభావిస్తారు. భగవద్గీత కూడా ఉపనిషత్తుల సారాంశం కనుక గీతోపనిషద్‌ అని వర్ణించినట్టే గోదాదేవి తిరుప్పావైని గోదోపనిషత్‌ అని గౌరవించారు. వేదోపనిషత్తులను సూర్యోదయంలోనే పఠించాలి. కనుక తిరుప్పావైని కూడా సూర్యాస్తమయం తరువాత అనుసంధానించకూడదంటారు. ఓంకారానుసంధానంతో వేదాల అధ్యయనం ఆరంభమవుతుంది. ఓంకారంతోనే ముగిసిపోతుంది. తమిళంలో అందరికీ అర్థమయ్యేందుకు సులువుగా రచించిన నాలుగువేల కవితలను నాలాయరమ్‌ (‌నాల్‌ అం‌టే నాలుగు, ఆయిరం అంటే వేలు) అంటారు. శాత్తుమఱై అంటే నైవైద్యం తరువాత సాగే మంగళా శాసనం. నాలాయిర ప్రబంధ పారాయణం తిరుప్పావై తో ముగుస్తుంది. అంటో ప్రణవనాదంతో ముగుస్తుందని అర్థం. ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదంలేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు.

అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, తిరుమంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ చెప్పినాడు రామానుజుడు. కులమతబేధాలు లేకుండా అందరికీ నారాయణుని చేరే జ్ఞాన వ్రత మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ. రామానుజుడిని తిరుప్పావై జీయర్‌ అం‌టారు. గోదాదేవి పుట్టి శ్రీరంగనిలో లీనమైన రెండువందల సంవత్సరాల తరువాత జనించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం, తరువాత తనకు రంగనితో వివాహ మైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో సుందర బాహుస్వామికి వేయిబిందెల పాయసం చేయిస్తానని పెట్టుకున్న మొక్కును రామానుజుడు తీర్చడం మరో కారణం. భగవంతుడిలోలీనం కావడం వల్ల గోదా ఆ మొక్కు తీర్చలేకపోయారు.

ధనుర్మాసం
థనుర్మాసం సూర్యమానంలో తమిళ నెల. సూర్యుడు ధనుర్‌ ‌రాశిలో ఉండే నెలను ధనుర్మాసం అంటారు. చాంద్రమానంలో తెలుగువారు లెక్కించే మార్గశీర్ష మాసంలో మొదలవుతుంది. ఆమె రోజుకో పాశురాన్ని పాడి తోటి వారిని పూజకు పిలిచిన నెల ఇది. శంగత్తమిళ్‌ ‌ముప్పదుం అంటారు. అందమైన తమిళంలో రచించిన 30 కవితలు. ఎనిమిది పాదాల్లో ఎంత అర్థం గుమిగూర్చారో తెలుసుకుంటే ఇది ఎంత గొప్ప కావ్యమో అర్థమవుతుంది. కథ వలె ఉంటుంది కథ కాదు. పురాణాల ప్రస్తావన ఉంటుంది కాని పురాణం కాదు. రామాయణ ఘట్టాలు వస్తాయి, రామాయణ కావ్యం కాదు. భాగవత తత్వం, శ్రీకృష్ణలీలలు ఉటంకిస్తారు. కాని పూర్తి భాగవతం కాదు. విశిష్టాద్వైత సిద్ధాంత సారం ఉంటుంది. కాని సిద్ధాంత తత్వ గ్రంధం కాదు. ఇదొక బోధన, సాధన, పిలుపు, వ్రతం, ఆరాధన, ప్రేమరసాత్మం. భక్తిభావ బంధురం.

గోవిందునికి మేలు కొలుపు
తిరుమల తిరుపతిలో ఈ ముఫ్పయ్‌ ‌రోజులు వెంకన్న సుప్రభాతం వినడు. తిరుప్పళ్లియజిచ్చి అని విప్రనారాయణుడు (తొండరడిప్పొడియాళ్వార్‌ అం‌టే భక్తాంఘ్రిరేణు ఆళ్వార్‌) ‌రచించిన పద్యాల తరువాత తిరుప్పావు పాశురాలు వింటాడు, గోదమ్మ రోజూ పాడే గీత గోవిందాన్ని వింటూ గోవిందుడు పరవశిస్తాడు. కనుక ఇది ధనుర్మాస గోవింద సుప్రభాతం. మొత్తం దేశమంతటా ఉన్న వైష్ణవాలయాలలో తిరుప్పావై గ్రంధ రహస్యాలను రోజుకో రెండుగంటల చొప్పున వివరించే ఉపన్యాస కార్యక్రమాలు 30 రోజులు సాగుతాయి. పొద్దున్నే తిరుప్పావై పారాయణాలు, సాయంత్రం తిరుప్పావై ప్రవచనాలు ప్రబోధాలు. తెలుగు రాష్ట్రాలు రెండింటా నారాయణుని కోవెలల్లో ఈ నెలంతా తిరుప్పావై ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. వందల మంది వైష్ణవాచార్యులు. మహిళా శిరోమణులు తిరుప్పావై అర్థ తాత్పర్యాలను వివరిస్తూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలలో విస్తృతంగా తిరుప్పావై పారాయణాలు జరుగుతాయి.  ఈ 30 గీతాలను కర్ణాటక శాస్త్రసంగీతకారులు కీర్తనలుగా పాడారు. నాట్యకీర్తనలుగా కూడా పాశురాలు భాసిస్తున్నాయి. హైదరాబాద్‌ ‌లో కూడా కొన్ని వందల చోట్ల తిరుప్పావై కాలక్షేపాలు జరుగుతూ ఉంటాయి. ఈ సిరినోము సంక్రాంతి దాకా సాగే ఆధ్యాత్మికోద్యమం. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఈ పాశురాలను తెలుగులోకి అనువదించారు. ఇది చాలా గొప్ప వైష్ణవ భక్తి సాహిత్యంగానే కాకుండా, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా కూడా తిరుప్పావై గొప్ప రచన గా భావిస్తున్నారు.

శ్రీకృష్ణుడే చెప్పిన వ్రతం
శ్రీ కృష్ణుడుండేటి అందాల పల్లె వ్రేపల్లెలో కరువువచ్చి అందరూ ఆందోళన పడుతూ క్రిష్ణయ్య దగ్గరకు వెళ్లి ఏం చేద్దాం అని అడిగారు. ఆదుకోమన్నారు. దీనికేదైనా వ్రతముంటే చేద్దాం అని గోపకులంలో పెద్దవారు సూచించారట. చిన్నారి కన్నె పిల్లలయిన గోపికలతో ఈ వ్రతం చేయిస్తే బాగుంటుందనీ అన్నారట. సరే నని శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి వ్రత నియమాలు వివరించారు. మన వ్రతం పెందల కడ మొదలవుతుంది. కనుక మీరంతా తెల్లవారు ఝామున రావాలి సుమా అని గోపికలకు మరీ మరీ చెప్పి పంపించాడా గోవిందుడు. మరునాడు శ్రీకృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నామన్నఆనందం ఉత్సాహం ఎక్కువై గోపికలకు నిద్ర పట్టలేదు. ఎంత త్వరగా జాములు గడుస్తాయా, ఎప్పుడు బ్రహ్మ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రిగడిపారు. తెల్ల వారు ఝామునే రమ్మన్నాడు కిట్టయ్య, కనుక ముందే లేచి అందరినీ లేపుదాం అని బయలుదేరారు గోపికలు. ఇదీ తిరుప్పావై నేపథ్యం.

మన యేడాది, దేవతలకు ఒక రోజు. మన ఉత్తరాయణం వారికి దినంలో తొలి అర్థభాగం. ఉత్తరాయణానికి ముందు వచ్చే నెల మార్గశిర మాసం అంటే దేవతలకు తెల్లవారుఝాము. మార్గశిరం మొత్తం బ్రహ్మ ముహూర్తమని అర్థం. అందులో తొలి పక్షం (శుక్లపక్షం), వెన్నెల నిండిన రాత్రి గడిచి, వస్తున్న తెల్లవారుఝాము. దానికి కాస్త ముందటే లేచి నదీ స్నానంచేసి శ్రీకృష్ణుడిని చేరుకుంటే వ్రతసాధనాలన్నీ ఆయన సమకూర్చుతాడు. రండి రండి అంటూ తొలి పాశురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. గోపికలు నారాయణుని కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాశురాలన్నీ సుప్రభాత ప్రబోధ గీతాలు. గోపకులంలో అంతా సంపన్నులే. శ్రీకృష్ణుడంటే ఆనంద స్వరూపుడైన నారాయణుడే. గోపకులానికి నాయకుడు, నారాయణుడి తండ్రి నందగోపుడు. అంటే అందరి ఆనందమైన నారాయణుడిని రక్షించే వాడు నందగోపుడు. యశోదా దేవి నోముల పట్టి ఈ నారాయణుడు. శ్రీ కృష్ణుడు బాల సింహము. నీలమేఘ శ్యాముడు. ఆయన నయనాలు అరుణ నయనాలు. సూర్యచంద్రులతో సమానమైన నయనాలతో భాసిల్లే వదనం ఆయనది. ఆ నారాయణుడే మన సాధనం, ఆ నారాయణుడే మనకు సాధనం ఇస్తాడు. ఆ నారాయణుడే మన సాధనకు లక్ష్యం. పదండి, త్వర పడండి. లేవండి వెళదాం…అని రారమ్మంటున్నది గోదమ్మ ఈ పాశురాల్లో.

శ్రీహరి నామాన్నే నిరంతరం కీర్తించడం, అతనే దిక్కని శరణాగతి చేయడం, తోటలో పూలు, తులసీదళాలు కోసి స్వామికి అర్పించడం గోదాదేవి జీవన చర్యలుగా మారిపోయాయి. గోపికలు శ్రీ కృష్ణుడినే భర్తగా భావించారని, ఆయనే భర్తగా పొందాలని పరితపించారని, అందుకు ఒక వ్రతం కూడా చేశారని తండ్రి సత్కథా కాలక్షేపం చేస్తూఉంటే విన్న గోదాదేవికి ఆమాటలు మనసులో నాటుకుని పోయాయి. మా శ్రీవిల్లిపుత్తూరు వ్రేపల్లె కాదా, మా వటపత్రశాయి క్రిష్ణయ్య కాదా, నేను గోపికను కాలేనా, ఆ వ్రతం చేయలేనా అని యుక్తవయస్క అయిన గోద లో ఈ భావాలు ప్రశ్నించాయి. ఆ వ్రతమే తిరుప్పావై. ముఫ్పయ్‌ ‌పాశురాల గోదా గోవింద గీతం ఇది. మొదటి అయిదు పాశురాలు ఈ వ్రత నియమాలు విధివిధానాలు పరిచయం చేసేవి. తరువాత పది పాశురాల్లో గోదాదేవి పదిమంది గోపికలను (ఆళ్వారులను) ఏ విధంగా పలకరించారో, నిద్రలేచిరమ్మని పిలిచారో వివరిస్తారు. వారిని తీసుకుని నందగోపుని భవనానికి వెళ్లి అక్కడ భవన పాలకుడిని, ద్వార పాలకుడిని మేల్కొలిపి భవనంలోకి వెళ్తారు. అంత: పురంలో నందుడిని, యశోదాదేవిని, బలరాముడిని నిద్రలేపుతారు. శ్రీ కృష్ణుని నిద్రలేపే పాశురం ఒకటి, నీలాదేవికి సుప్రభాతం మరొకటి. వచ్చి సింహాసనాన్ని అథిష్టించవయ్యా కిష్టయ్యా అని పాడే పాట ఇంకొకటి. ఆయన గంభీరంగా వేంచేయగానే మంగళాశాసనం పాడతారు, వచ్చిన పని నివేదిస్తారు. నిన్నెప్పుడూ సేవించే మహాభాగ్యం ఇమ్మంటారు. 16 నుంచి 30 వ పాశురం దాకా ఈ అంశాలు ఉంటాయి. ఇదే తిరుప్పావై. ఇదే వ్రతం చేయడమంటే. శ్రీకృష్ణుడిని సన్నిధానం కన్న ఇంక కావలసేందేమిటి? ఆయన కోసమే ఈ వ్రతం. ఆయనే వ్రత విధానం, ఆయనే వ్రత సాధనం.

ఇది మధురమైన భక్తి, భగవంతుడిని భర్తగా భావించే భక్తి. గోపికల భక్తిని రసమయ భక్తి అన్నారు. శృంగారం ఒక రసం. కాని పతిపత్నీభావం శృంగారరసం కాదు. అదీ భక్తి రసమే. నారాయణుడితో ప్రణయ భావం. అమలిన శృంగారం ఇది. మన మనసుకు తోచే కామం కాదు. నిరంతరం పతిధ్యానంలో ఉండే పతివ్రత వలె, అనురాగమయి అయిన భార్యను నిరంతరం పరిశుద్ధంగా ప్రేమించే భర్తవలె భగవంతుడి పట్ల అనురాగ రంజితంగా ఉండే ఈ ప్రేమలో కామం వాసన ఉండదు. భర్త భార్య ఏకాత్మభావనతో జీవాత్మ పరమాత్మలో కలిసిపోయే అద్భుత భావన ఇది. మగవారు ఆడవారు అని మన లెక్క. కాని భగవంతుని ముందు అందరూ స్త్రీలే అని, ఆయన పురుషోత్తముడైన పరమాత్ముడనీ, జీవాత్మ జగత్పతి అయిన పరమాత్ముడిలో కలవడానికి పత్నిభావపు గోపికలుగా మారి భక్తిమార్గాన్ని అనుసరించాలని బోధిస్తూ  పత్నీభావాన్ని వివరిస్తున్నారు.  భక్తులంతా గోపికలై వ్రతం ఆచరించి విష్ణువులో కలిసారని ఉదాహరణ గా చూపడం తిరుప్పావై అర్థం. తిరుప్పావైలోని పదంలో పాదంలో పాశురంలో ప్రవహించేది ఈ మధుర సమర్పణభావనా రసమే. ఈ జ్ఞాన బోధన చేసి వ్రత సాధన చెప్పింది గోదా దేవి.

గోదా గోవిందగీతం – 1
హరిగుణ గానమే స్నానమట
(నారాయణుడే వ్రతం, నారాయణుడే వ్రతఫలం అని చెప్పే పాశురం మార్గళి తొలి గోవింద గీతం).

మార్గళి త్తింగళ్‌ ‌మది నిఱైంద నన్నాళాల్‌
‌నీరాడ ప్పోదువీర్‌ ‌పోదుమినో నేరిళైయీర్‌
‌శీర్‌ ‌మల్గుం ఆయ్‌ ‌ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్‌
‌కూర్వేల్‌ ‌కొడుందోళిలన్‌ ‌నందగోపన్‌ ‌కుమరన్‌
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్‌ ‌శింగం
కార్మేని చ్చెంగణ్‌ ‌కదిర్మదియం పోల్‌ ‌ముగత్తాన్‌
‌నారాయణనే నమక్కే పఱైతరువాన్‌
‌పారోర్‌ ‌పుగళప్పడిందేలోర్‌ ఎమ్బావాయ్‌

‌లక్ష్మణ యతీంద్రుల అనువాదం
నారాయణుండు కన్నయ్య – ఆతండె
సర్వమ్ముమనకు తా సమకూర్పగలడు
మనసున్న వారెల్ల మానినులార
తానమ్ములాడగ తరలిరండమ్మ

బొమ్మకంటి శ్రీనివాసాచార్యుల వారి అనువాదం సిరినోము

శ్రేష్ఠమై ఈ మార్గశిరపు వెన్నెల రేయి
నీరాడ రారండి నెలతలార1
చెలువమ్ము, సంపద చెలగు వ్రేపల్లె జ
వ్వనులార 1 భూషిత ప్రమదలార 1
వేలాయుధము దాల్చి వేయి కన్నుల గాచు
నందగోపు ననుంగు నందనుండు
చలువకంటి యశోద సాకు సింగపు పిల్ల
కరి మేను చెంగనుల్‌ ‌గలుగువాడు
సూర్యచంద్రుల బోలు సుంద రాస్యము వాడు
నారాయణుడె ఇచ్చునమ్మ ‘డక్కి’
నీరాడగానెంచు నెలతలారా 1 రండు
వాడ వాడలు మన వ్రతము పొగడ 1

పదాలు అర్థాలు
ఇది మార్గళినెల (మార్గళి త్తింగళ్‌) ‌చంద్రుడు పదహారుకళలతో పూర్తిగా వికసించిన మంచిరోజు (మది నిఱైంద నన్నాళాల్‌) ‌స్నానం చేయదలిచిన వాళ్లు (నీరాడ ప్పోదువీర్‌) ‌రండి (పోదుమిన్‌) అం‌దమైన ఆభరణాదు ధరించిన సుదతులారా (నేరిళైయీర్‌) ‌సిరిసంపదలతో కూడిన (శీర్‌ ‌మల్గుం) గొల్లపల్లెలోని (ఆయ్‌ ‌ప్పాడి) భగవదనుగ్రహమనే సంపదను, ధనధాన్యాలనే సంపదను (శెల్వచ్చిఱుమీర్గాళ్‌) ‌వాడియైన శూలం ధరించి (కూర్వేల్‌) ‌శ్రీకృష్ణుడికి హాని చేయదలిచిన దుర్మార్గులను క్రూరంగా నిర్జించే (కొడుందోళిలన్‌) ‌నందగోపుని కుమారుడు (నందగోపన్‌ ‌కుమరన్‌) అం‌దమైన నయనాలతో కూడి (ఏరారంద కణ్ణి) తల్లి యశోదకు (యశోదై) సింగపు పిల్లవంటివాడు (ఇళమ్‌ ‌శింగం) నల్లని మేని రంగు కలిగి (కార్మేని) కెందామరల తో పోలిన కన్నులు (చ్చెంగణ్‌) ‌ప్రకాశంలో సూర్యుడిని (కదిర్‌) ‌చల్లదనంలో చంద్రుడిని (మదియం) పోలిన ముఖ బింబము గలవాడు (పోల్‌ ‌ముగత్తాన్‌) ‌భగవానుడైన శ్రీమన్నారాయణుడే (నారాయణనే) పఱై అనే వాయిద్యాన్ని మన అభీష్ఠాలను (పఱై) ప్రపంచంలోని ప్రజలంతా (పారోర్‌) ‌ప్రశంసించే విధంగా (పుగళ ప్పడిందు) ఈ వ్రతంలో పాల్గోనే విధంగా పావై వ్రతాన్ని అనుష్టించడానికి సిద్ధంగా ఉన్నమనకు (ఎమ్బావాయ్‌ ‌నమక్కే) అనుగ్రహిస్తాడు (తరువాన్‌).

అం‌తరార్థం:
దేనికైనా సమయం రావాలంటారు. ఈ వ్రతానికి సరైన సమయం మార్గశీర్షమాసం. అంతగా వేడి ఉండదు, చలీ ఉండదు. సమశీతోష్ణవాతావరణం. పంటలు పండి చేలో పక్షులు వాలే కాలం. నీళ్లలో చేపలు తుళ్లిపడేరోజులు. పంటచేలల్లో హంసలు తిరుగాడుతున్నాయట. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ప్రకృతిలో ఏది శ్రేష్టమో అదే నేను అని అంటూ శ్రేష్టత్వమే భగవంతుడని నిరూపిస్తాడు. అటువంటి శ్రేష్ఠమైన మాసం ఇది. విష్ణుస్వరూపమైన ఈ నెల సమశీతోష్ణంగా ఉండి బ్రహ్మ ముహూర్తంలో భగవద్ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. వెన్నెల విరిసే నెల. దేవతల లెక్క ప్రకారం తెల్లవారుఝాము. ఎట్లా అంటే మనకు ఏటా పన్నెండునెలలు దేవతలకు ఒక రోజు. దక్షిణాయనం దేవతలకు రాత్రి ఉత్తరాయణం పగలు. సూర్యుడు దక్షిణాయనం నుంచి సంక్రాంతి రోజు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే నెల మార్గశీర్షం. దేవతలకు తెల తెల వారే సమయం. సత్వగుణాన్ని పెంచేకాలం. కనుక వ్రతానికిది మంచి సమయం. మనసు మురిసే వెన్నెల వెల్లివిరిసే కాలం. భగవంతుని కళ్యాణ గుణగానాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం చేద్దాం రండి. భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం ఉంటే చాలు ఈ వ్రతం మనమూ చేయవచ్చు. పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని సంపన్నులైన గోపబాలల వలె మనం కూడా శ్రీ కృష్ణుని ప్రేమకోసం గోపబాలలమైపోదాం. ఇక మనకు ఏ భయమూ లేదు. ఆ పరమాత్ముడే పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మనలో ఒకడుగా ఉండడానికి మనదగ్గరికి వచ్చినాడు. ఎప్పుడే రాక్షసులు వస్తారో అని అనుక్షణం తాను కత్తి పట్టుకుని కాపలా కాసే నందగోపుడు మనవాడే. తన లీలలతో ఆశ్చర్యపరిచిపదేపదే యశోద కళ్లు విప్పార్చే గోపాల బాలుడు సింగపు పిల్ల వలె ఆమె ఒడిలో పెరుగుతున్నాడు. నల్లని మేఘం వంటి శరీర చ్ఛాయ. వాత్సల్యం వంటి అనంతమైన గుణాలు కలిగిన వాడు. మిత్రులకు చల్లదనం, శత్రులకు వేడి కలిగించే సూర్యచంద్ర వదనుడు. గోదాదేవి మనందరకీ ఈ తొలిపాశురంలో నారాయణమంత్రోపదేశం చేస్తూ వ్రతానికి పురి కొల్పుతున్నది. ఆయనే మన వ్రతఫలం అని వివరిస్తున్నది.

ఆయన గుణాలే కాదు రూపాలు కూడా అనంతం. ఆకాశం వలె, సాగరం వలె, అంతంలేని జన్మల వలె, తెగని మన కర్మల వలె. అనంత కళ్యాణ గుణ సంపన్నుడు. కొదవ, లోటు లేని వాడు. అంతటా వ్యాపించిన విష్ణువు. విష్ణు అన్నా వాసుదేవ అన్నా నారాయణ అన్నా ఆయన సర్యవ్యాపక శీలాన్ని వివరించే పదాలే. విష్ణు అంటే వ్యాపించి, వాసుదేవా అంటే అంతటా వసించి ప్రకాశించే వాడు. నారాయణ అన్నా వ్యాపకత్వ శబ్దమే. నారములంటే కదలనివి కదిలేవి అనీ అయణం అంటే వాటికి ఆధారమైనవాడని అర్థం. అంతటా వ్యాపించి అన్నింటికీ ఆధారమై అన్నింటినీ ప్రకాశింపచేసేవాడు. వాటికిలోపలా ఉంటాడు బయటా ఉంటాడు. జీయర్‌ ‌స్వామి నారాయణ మంత్రాన్ని అద్భుతంగా వివరిస్తారు. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రీహి సమాసం నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అంటే లోపలా బయట ఉంటాడు. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గిఉంటాడు. ఒక్కసారి చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు. సులభంగా అందడం సౌలభ్యగుణం. మనలోపలే ఉంటాడు కనుక చాలాదగ్గరగా ఉన్నట్టు. సమీపం సామీప్యలక్షణం. పైన కూడా ఉంటాడు కనక పరుడు- అది పరత్వం. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. వారిలోని దోషాలూ తెలుసు, వాటిని దూరం చేయగల్గడం కూడా తెలుసు. దోషాలను తొలగించాలనుకునే వాత్యల్యం తొలగించే శక్తి కూడా కలిగిన వాడు. వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీరి యోగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తాను ఏ విధేంగానైనా ఏమైనా చేయగలడు ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది. ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. అన్నిగుణాలు కలిగిన పరిపూర్ణత్వ శక్తి మంత్రాన్ని మనకు సాధనంగా గోదాదేవి అందిస్తున్నారు. వ్యక్తిగత శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి. కాని భగవదనుభవం అందరితో కలిసి అనుభవించేది. అందరూ కలిసి రావడం గోష్ఠి. అందరూ కలిసి భగవద్గుణానుభవంతో స్నానం చేసి నారాయణ మంత్రంతో వ్రతం చేద్దాం రండి అంటున్నారు. వ్రతం చేయాలన్న కోరిక ఉంటే చాలు అదే యోగ్యత. మరేదో లేదని భయపడవలసిన పని లేదు.

కంసుని ఊడిగం వదిలే మంచి రోజు అక్రూరుడికి, రాముని శరణు వేడే మంచి రోజు విభీషణుడికి వచ్చిన్టు మంచి రోజు వచ్చింది. మార్గం అంటే దారి అని మనకు తెలుసు. ఉపాయమని కూడా అర్థం. భగవంతుడిని చేరడానికి కర్మ జ్ఞాన భక్తి మార్గాలు మూడున్నాయి. కాని ఈ మూడింటి కన్న మంచిమార్గం మరొకటి ఉంది. అది భగవంతుడే. సాధనమూ ఆయనే సాధ్యమూ ఆయనే. భగవానుడే ఉపాయంగా ఉపయోగించి లక్ష్యమైన ఆ భగవానుడిని చేరే వ్రతం తిరుప్పావై.స్నానం. శ్రీకృష్ణుడి విరహంలో వేడి చల్లారాలంటే స్నానం చేయాలి. శ్రీ కృష్ణ విశ్లేషం (విరహం) వల్ల కలిగే విరహం చల్లారాలంటే శ్రీకృష్ణ సంశ్లేషం (సంయోగం) అనే స్నానం కోరుతున్నారు గోపికలు. శ్రీ కృష్ణుడే ఒక జలాశయం. నీతో ఏడేడు జన్మలకూ తొలగని విడదీయరాని సంబంధం కావాలని కోరుతూ ఆ శ్రీ హరి జలాశయంలో మునుగుతారట గోపికలు. వారు ఏదైనా కలిసే చేస్తారు. అంతా ఒక్కరికే అనే స్వార్థంవారికి లేదు. ఆభరాణలతో అలంకరించుకోవడం అంటే శ్రీకృష్ణుడు ఏ క్షణంలో తమను చేరి కౌగిలించుకుంటాడో అని సిద్ధంగా ఉండడం. నమస్కారం, వంచిన తల, పులకించే దేహం, తడబడుతున్న గొంతు, కన్నుల్లో నీరు, ఇవీ ప్రపన్నుల లక్షణాలు. ఇవే ఆభరణాలు. వీటితో సిద్ధంగా ఉన్న ప్రేమైకజీవి ప్రపన్నుడు. గోపకులంలో సంపద పాడి పంటలు, పాలు నెయ్యి.. అన్నీ సరే. కాని అసలు సంపద భగవంతుడైన శ్రీ కృష్ణుడే. ఆయనకు మించిన సంపదేమిటి. ఆయన అన్ని గుణాలతో రేపల్లెలో ప్రకాశిస్తున్నాడు. సులభుడు, సుశీలుడు, సమీపంలో ఉన్నవాడు. వ్యాపకుడు, ప్రకాశించే వాడు. లోటు లేని పరిపూర్ణుడు. చేయిచాస్తే చాలు అందుకునే వాడు. ఆయనమనతో ఆడుతూ పాడుతూ ఉంటే ఈ రెపల్లె అయోధ్య కన్న పరమపదం కన్నఎంతో గొప్పది. అయోధ్యలో వసిష్టుడు ఇతర మునులూ ఉన్నారు. కాని కుడి ఎడమతెలియకపోయినా అమాయకులు శ్రీ కృష్ణునితో కలిసి మెలిసి తిరుగుతున్నారు.

నందగోపుడు సాధారణంగా మెత్తని వాడు. కాని శ్రీకృష్ణుడికి వచ్చే ఆపదలతో కఠినుడైపోయాడు. రాక్షసుడెవడైనా వస్తే చీల్చి చెండాడడానికి శూలంతో సిధ్ధంగా ఉన్నాడు. దూడను ఈనిన ఆవువలె దగ్గరికి గడ్డివేయడానికి వచ్చినా సరే ఎవరొచ్చినాసరే కొమ్ములతో చీల్చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు.

ఇక శ్రీ కృష్ణుడు కార్‌ ‌మేని అంటే మేఘం వలె దాచడానికి వీల్లేని శరీరం గల వాడు. తల్లిదండ్రులు దాచలేని అందం ఆయనది. అందరినీ మోహితులు చేసే సౌందర్యం. చంద్రభాస్కర వర్ఛసుడు. వెలుగుతో పాటు వేడి ఉంటుంది. కాని శ్రీ కృష్ణుడు వెలుగు చల్లనిది. నారాయణనే అనే శబ్దప్రయోగం చేసి గోదాదేవి మరెవరూ సాటిరాని నారాయణుడొక్కడే అని ఘంటాపథంగా ప్రకటిస్తున్నారు. ‘‘ఇతడొకడే సర్వేశ్వరుడు సిత కమలాక్షుడు శ్రీవేంకటేశుడు’’ అన్న గీతాన్ని అన్నమయ్య ఇతడొక్కడే అని ముగిస్తాడు. ఆచార్యత్వం, వాత్సల్యం, జ్ఞానం, శక్తి వంటి అన్ని గుణాలున్నవాడొక్కడే ఒకే ఒక్కడు నారాయణుడు. దేవతలు కూడా తెల్లవారుఝామున గుమికూడే సమయంలోనే దయాసాగరుడైన పరమాత్ముని సంశ్లేషభాగ్యం మనమూ పొందుదాం. ప్రాప్య ప్రాపకాలు రెండూ నారాయణుడే. నారాయణుడై పఱై (ఒక పాత్ర అనీ లేక పరలోక మార్గాన్నిఅనీ) ఇస్తాడు. వ్రతాన్ని చేయడానికి ఎవరు అర్హులు. ఎవరి గురించి చేయాలి. ఆ స్వరూపం ఎటువంటిది అనే ప్రాథమిక వివరాలను ప్రథమ పాశురం వివరిస్తున్నది. ముఫ్పైపాశురాల స్వరూపం సూక్ష్మంగా ఈ మొదటి పాశురంలో ప్రతిఫలిస్తున్నది.

గోదా గోవింద గీతం (తిరుప్పావై) 2
నారాయణ చరణాలే శరణు

తొలి గీతం లో గోపికలను పిలిచిన గోదమ్మ రెండో గీతంలో మొత్తం అందరనీ పిలుస్తున్నారు. హరికథలనే పాలు పెరుగు ఉంటే వేరే పాలు పెరుగు ఎందుకడుగుతారు. నోటిమీద అదుపుకోసం ఈ పాట పాడుకొమ్మంటున్నారు.

వైయత్తు వాళ్వీర్గాళ్‌ ‌నాముమ్‌ ‌నమ్బావైక్కు
శెయ్యుమ్‌ ‌కిరిశైగళ్‌ ‌కేళీరో, పాఱ్కడలుళ్‌
‌పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,
నెయ్యుణ్ణోమ్‌ ‌పాలుణ్ణోమ్‌ ‌నాట్కాలే నీరాడి,
మైయిట్టెళుదోమ్‌ ‌మలరిట్టు నాముడియోమ్‌
‌శెయ్యాదన శెయ్యోమ్‌ ‌తీక్కురళై చ్చెన్ఱోదోమ్‌,
ఐయముమ్‌ ‌పిచ్చైయు మాన్దనైయుమ్‌ ‌కైకాట్టి,
ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్‌

‘‌వైయత్తు వాళ్‌ ‌వీర్‌ ‌గాళ్‌’ , ఈ ‌భూమిమీద ఆనందంగా ఉండాలనుకుంటే రండి. ‘నాముం నంపావైక్కు..’ ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు, ‘శెయ్యుం కిరిశైగళ్‌ ‌కేళీరో..’ ఏంచేద్దామో వినండి.. ‘పాఱ్కడలుళ్‌ ‌పైయత్తు యిన్ఱ పరమనడిపాడి…’ పాలకడలి లో సుకుమారంగా శయనించి ఉన్న వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం‘నెయ్యుణ్ణోం పాలుణ్ణోం’  నెయ్యీ వద్దు, పాలూ వద్దు. ‘నాట్కాలే నీరాడి’ తెల్లారుజామున స్నానం చేద్దాం. ‘మైయెట్టుళుదోం మలరిట్టు నాం ముడియోమ్‌…’ ‌కనులకు కాటుక పెట్టుకోం కొప్పులో పూలు ముడవం…విలాసాలువదిలేద్దాం. ‘శెయ్యాదన శెయ్యోం’ చెయ్యకూడదని పెద్దలుచెప్పినవి చెయ్యం. ‘తీక్కుఱళైచ్చెన్ణోదోమ్‌’ ‌మరొకరి మనసు కష్టపెట్టే పుల్లవిరుపు మాటలు మాట్లాడం, ‘ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి’, చేతనైనంత వరకు దానాలు చేస్తాం. ‘ఉయ్యమాఱెణ్ణి ఉగంద్‌ ..’ ఈ ‌పనులన్నీ ఆనందంతో చేస్తాం..

బోమ్మకంటి శ్రీనివాసాచార్యుల స్వామి వారి అనువాదం సిరినోము
సుఖముల తూగాడు సుదతులార, వినుండు
చిత్తశుధ్దికి వ్రత సిధ్ధికొరకు
చేయగావలసిన చెయుదులు నుడివెద
పాలకడలి మీద పవ్వళించు
పరమాత్ము పదములు పాడగా వలయును
పరహరింప వలెయు పాలు నేయి
నీరాడి వేబోక నెరుల పూవులు లేక
కనుల కాటుక లేక కదలవలయు
చేయరాని పనులు చేయరా దెవరము
స్వామితో చాడీలు పలుక రాదు
దాన ధర్మములు యథాశక్తి సేయుడు
ముక్తి ద్రోవ నెరిగి ముదము గనుడు1

మాయ కమ్ముకుని అజ్ఞానం విస్తరించే ఈ భూమ్మీద ఈ కాలంలో ఉజ్జీవించి చైతన్యోద్దీపకులు కావడానికి, నారాయణ వ్రతం చేద్దాం రమ్మని పిలిస్తే ఇంత మంది వచ్చారా అని ఆండాళ్‌ ఆశ్చర్యపోయిందట. సరే నోము లో చేయకూడనివి చేయవలసినవి చెప్పుకుందాం అన్నారు. వ్రతం చేసే అధికారి సంభవిత సంభవములగురించి తెలుసుకోవలసి ఉంటుంది.

వర్షంకోసమో మరే ఫలం కోసమో కాదీ వ్రతం. నాముం నంపావైక్కు …మనం వేరు, పద్ధతి వేరు ఇది చాలా భిన్నమైనది. మన లక్ష్యం కూడా విశిష్టమే. నారాయణుని సాన్నిధ్యమే మన లక్ష్యం. ఆ పరమాత్మను చేరడానికి ఆయనే మార్గం. నాం పావై… ఇంద్రజిత్‌ ‌రాముడిని జయించడానికి వేదమంత్రాలతో ఒక యజ్ఞం చేసినాడు. కాని మన యజ్ఞాలూ వ్రతాలూ అన్నీ భగవంతుని చేరుకోవడానికి, ఆ వైభవాన్ని పరమానందాన్ని అందుకోవడానికి.

పాలకడలిలో శేషతల్పమున పవ్వళించిన విష్ణుని శ్రీపాదాలను స్మరిస్తూ మోక్షాన్ని ఆకాంక్షిస్తూ సంస్కృతంలోనో ద్రవిడంలోనో ఏభాషలోనో వేదాలను గానం చేద్దాం. ఓరామ నీనామ మెంతో రుచిరా అనుకుందాం. భగవన్నామం ముందు ఈ పాలూ నేయీ ఎంత? మనకీ భౌతిక పదార్థాలు అవసరమా? తెల తెలవారు ఝామున లేద్దాం. చల్లని నీట స్నానం చేద్దాం. ఈ వ్రతం పూర్తయ్యే వరకూ కళ్లకు కాటుకా వద్దు, జడలో పూలూ వద్దు అంటున్నారు గోదమ్మ. శ్రీవైష్ణవులకు ఈ అలంకారాలతో పనిలేదు. పూలు పాలూ అలంకరణలన్నీ శ్రీకృష్ణునితో కలిసి ఉండడానికే గాని మరే ప్రయోజనమూ లేదు. మన పెద్దలు ఆచరించిన మంచి మనమూ ఆచరిద్దాం. వారు చేయని పనులు మనం చేయడం ఎందుకు? నిజానికి తండ్రి తనకు రాజ్యం ఇచ్చినా, అన్న రాముడు ఏలుకొమ్మని ఆదేశించినా, రుషులు తల్లులు పెద్దలు పరిపాలించమని కోరినా, గురువు తప్పులేదని చెప్పినా,  భరతుడు రాముని పాదాలనే ఆశ్రయించాడు, ఆయన ధరించిన పాదుకలనే కోరుకున్నాడు. ఎందుకంటే సూర్యవంశంలో సింహాసనం ఎప్పుడూ పెద్దకొడుకుకే గాని చిన్నవాడు అధిరోహించరాదు. అన్న సజీవుడై ఉండగా తమ్ముడు రాజ్యాన్ని పాలించడం జరగదు. ఆ శిష్టాచారమే ధర్మమని పెద్దలు నుడివిన మాట నడిచిన బాటను భరతుడు పాటించాడు. మనసా వచసా రామపాదాన్ని రాజ్యవైభవాలకన్న మిన్నగా భావించిన భాగవతోత్తముడు, పరమ భక్తుడు భరతుడు.

పరుల గురించి చెడు పలకని లక్షణం వైష్ణవ లక్షణం. వైష్ణవ జనతో తేనే కహియే పీడ్‌ ‌పరాయీ జానీరే … ఇతరుల బాధలు తెలిసిన వాడినే వైష్ణవుడంటారని మీరా భజన బోధిస్తున్నది. మనసులో కూడా పరుల చెడు ఆలోచించరాదు. ఎందుకంటే మనసులో మెదిలే ఆలోచన అంతర్యామికి తెలిసిపోతుందని తెలుసుకోవాలి కనుక. అంతరంగ మందు అపరాథములు చేసి, మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ అని వేమన అన్నాడు.
సీతాదేవి నిజమైన వైష్ణవ సతీమణి. తనను బాధించిన రాక్షసులకు హాని ఎప్పుడూ తలపెట్టలేదు. రామునికి ఒక్క చాడీ కూడా వారిపై చెప్పలేదు. హనుమంతుడు అక్కడ రాక్షసులు బాధించిన విషయం కళ్లారా చూసి బాధపడి, అనుజ్ఞ ఇస్తే వారిని చంపేస్తానంటాడు. అప్పుడు సీత, వారు స్వయంగా ఆ పనులు చేయలేదు, రావణాసురుడి ఆజ్ఞకు బద్ధులైన సేవకులు కదా. కొంత అతి చేసి ఉండవచ్చు. అది ఈ ధరిత్రిమీద ఉన్నవారందరు పాల్పడే పనే. తప్పు చేయని వాడెవడు నాయనా అంటుంది. నీవూ కాస్త ఆజ్ఞను అతిక్రమించావు కదా. నిన్ను రాముడు చూసి రమ్మని కదా ఆదేశించింది. కాని నీవు కాల్చి పడేశావు కదా’’ అని వివరిస్తుంది.  ఈ ధరిత్రిలో అందరూ తప్పులు చేసేవారనంటావా తల్లీ, అయితే రాముడు కూడా…’’  సీత సమాధానం ఇది. ‘‘అవును రాముడు కూడా.. శూర్పణఖ వలచి వచ్చినపుడు నేను ఏకపత్నీవ్రతుడనడం వరకు సరిపోయేది. కాని లక్ష్మణుడి దగ్గరికి పంపి, వేళాకోళమాడి అవమానించడం అతి కాదా. ఇప్పుడు ఈ దుష్పరిణామాలన్నీ వాటి పర్యవసానమే కదా హనుమా’’. వారే కాదు తానూ తప్పు చేసానని మరో సందర్భంలో ఆమె అంటారు. బంగారు లేడి ఉండదని తెలిసి కూడా కావాలని కోరడం, లక్ష్మణుడిని పరుషంగా నిందించి పంపడం తన తప్పులే అంటారామే. ఎవరో తప్పు చేశారని శిక్షించడానికి అందరూ సిద్ధ పడడం సరికాదు.  దయాగుణ సంపన్నుడై ఉండాలి, భగవద్విషయాలను జనులకుచెబుతూ ఉండాలి, ఇవే వైష్ణవ లక్షణాలు. నిత్యమూ ఆనందంగా ప్రశాంతంగా ఉంటూ సర్వజనుల సముద్ధరణే జీవిత ధ్యేయంగా చరించడం విద్యుక్త ధర్మం.

భగవంతుడిని చేరడానికి జ్ఞాన భక్తి కర్మ మార్గాలు ఎన్నో ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమనుకునే వారు మార్గశీర్షంలో పయనిస్తున్నారని శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌ ‌స్వామి వ్యాఖ్యానించారు. రెండో పాశురంలో ఆండాళ్‌ ‌తల్లి కృత్యములు అకృత్యముల గురించి తెలియజేస్తున్నారు.

వైయత్తు వాళ్‌ ‌వీర్‌ ‌గాళ్‌ , ఈ ‌భూమిమీద ఆనందంగా ఉండాలనుకుంటే రండి. భూమి తామస గుణం ఇస్తుందట. భూమిమీద ఉండగా సాత్విక గుణం కలగడం అంటే కుంపెటలో తామరపువ్వు పూసినట్టు. భగవంతుడే రాముడై వస్తే భూమిమీద తామసగుణ ప్రభావానికి లోనైనాడు. హనుమతో సీత ఈ విధంగా అన్నారట. ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజం, నీవు చూసి రమ్మంటే కాల్చి వెళ్తున్నావు అది తప్పు కాదా. నేనంటే తప్పు చేసానేమో మరి రాముడు కూడా తప్పు చేసాడా తల్లీ అని ప్రశ్నించాడు హనుమ. కాదా మరి.. శూర్పణఖ వచ్చినపుడు వలచినానని చెప్పినప్పుడు నేను ఏకపత్నీ వ్రతుడనని అని నిరాకరిస్తే సరిపోయేది కదా, కాని తమ్ముడిని చూపడం వేళాకోళంచేయడం అవసరం లేనిపనే కదా. అనేక పరిణామాలకు ఆనాటి ఘటనలే కారణం కాదా?
జీయర్‌ ఈ అం‌శాన్ని మరింత విశేషంగా వివరిస్తారు. ‘‘నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది. ఇవన్ని ఏవి లేనప్పుడు కూడా పరమాత్మ, ఈ జీవులందరూ ఉన్నారు. వారి అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు. కాని కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరి నేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతొలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు. అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్య్రుమ్న, సంకర్షణ అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు’’. వాసుదేవ రూపంతో సర్వం తన అధీనంలో ఉంచుకుంటాడు. అందులోంచి తీసిన ఒక రూపానికి సంకర్షణ అని పేరు. ఇది ప్రళయం చేయడానికి శివునిలో తానుండి మరో రూపం తీస్తాడు, అది అనిరుద్ధ. బ్రహ్మలో తానుండి సృష్టి కోసం మరో రూపాన్ని తీస్తాడు. అది ప్రద్యుమ్న. సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇంద్రునిలో ఉండి ఆ పనిచేస్తాడు. ఆర్తితో పిలిచే వారిని ఆదుకోవడానికి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటుందో అని అవతారాలను పంపడానికి సిద్ధంగా ఉంటాడు. కనుక అన్ని అవతారాలకు మూలస్థానం పాలకడలి’’ అని జీయర్‌ ‌స్వామి అత్యద్భుతంగా వివరించారు.

నాముం నంపావైక్కు.. ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు, శెయ్యుం కిరిశైగళ్‌ ‌కేళీరో.. ఏంచేద్దామో వినండి.. పాఱ్కడలుళ్‌ ‌పైయత్తు యిన్ఱ పరమనడిపాడి… ఆ పాలకడలి లో సుకుమారంగా పయనించి, తన పాదం తొలి అడుగు అక్కడ వేసి ఉన్న ఆ వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం, ఆయన్ను మించిన వారు లేరుకనుకనే పరమన్‌ అం‌టున్నారు. శిశువు తన తల్లి స్తన్యాన్ని గుర్తించినవిధంగానే భక్తుడు భగవంతుడి పాదాలను గుర్తించగలగాలి. పాలకడలిలో పరమాత్ముడు మొదట పాదం మోపినాడు. భగవంతుడిని చేరడానికి భగవంతుడే మార్గం అని చెప్పే మార్గశీర్ష పాశురం ఇది.

కొన్ని అల్పమైన పదాలలో అనల్పమైన అర్థాన్ని గుది గూర్చిచెప్పిన అద్భుత కవిత ఇది.

రేపటి నుంచి సంక్రాంతి దాకా రోజూ ఒక పాశురం అర్థం తెలుసుకుందాం.
మాడభూషి శ్రీధర్‌

Leave a Reply