Take a fresh look at your lifestyle.

దేవుడి చుట్టూ రాజకీయం..

దేశంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా భారతీయ జనతాపార్టీ హిందుత్వ వాదాన్ని తీసుకువొస్తుంది. ఈ దేశంలోని హిందువులకు తమ పార్టీయే ఏకైక ప్రతినిధినని చెప్పుకునేందుకు సర్వవిధాల ప్రయత్నిస్తూనే ఉంటుంది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో దానికి మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. తాము అధికారంలోకి వొచ్చిన వెంటనే భజరంగ్‌ ‌దళ్‌ను నిషేధిస్తామని  చేసిన ప్రకటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా దావానలంగా మారింది. అది భజరంగ్‌ ‌దళ్‌ అన్న ఒక విభాగాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ ఆ ‌ప్రకటన చేసినప్పటికీ అది హిందువులు ఆరాధించే  హనుమంతుడిని నిషేధించేదిగా  ప్రచారం జరుగుతోంది. అదిప్పుడు హిందూ మనోభావాలను దెబ్బతీసే ప్రకటన అనీ ..ఎన్నికల ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నది .. ఈ నెల 10న కర్ణాటక రాష్ట్ర ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో నువ్వా, నేనా అన్నట్లుగా కాంగ్రెస్‌, ‌బిజెపిలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మల్లిఖార్జున ఖర్గే మొదటిసారిగా ఒక రాష్ట్ర ఎన్నికలను ఎదుర్కుంటున్నారు. అందులోనూ తన సొంత• రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్‌ ‌పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత  ఆయనపై ఉంది. అందుకు గాను ఆ పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను రూపొందించుకుని, ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంలోనే తన ప్రధాన ప్రతిపక్షమైన బిజెపిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. కర్ణాటకలో స్వయంగా ప్రచారానికి వొచ్చిన ప్రధానిపై ఆ పార్టీ తీవ్రాతి తీవ్రంగా విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్షుడు ఖర్గే గత వారం మోదీని విష సర్పంతో పోల్చారు.. అది రాజకీయ వర్గాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది.

దానికి మోదీ కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చాడు. అయితే ఖర్గే కుమారుడు ప్రియాంక్‌ ‌ఖర్గే కూడా ప్రధానిని పట్టుకుని నాలాయక్‌ (‌పనికిరానివాడని) అనడాన్ని కూడా బిజెపి వర్గాలు చాలా సీరియస్‌గానే తీసుకున్నారు. దానికి సమాధానం అన్నట్లు బిజెపి సోనియాగాంధీని విషకన్యగా అభివర్ణించడం కూడా కాంగ్రెస్‌, ‌బిజెపి మధ్య ఒక విధంగా యుద్ధ వాతావరణానికి  దారి తీసింది. ఇదిలాఉంటే  కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌ప్రకటించిన మ్యానిఫెస్టో ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఇది కేవలం కర్ణాటకకే పరిమితం కాకుండా దేశవ్యాప్త ఆందోళనకు దారి తీసింది. తాము అధికారంలోకి వొస్తే భజరంగ్‌ ‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ ‌తన మ్యానిఫెస్టోలో పేర్కొనడమే ఈ ఆందోళనకు కారణంగా మారింది. దీన్ని ఒక ప్రభంజనంగా బిజెపి ఇప్పుడు చేపట్టింది. ఒక విధంగా ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ‌కావాలనే మరో ఆయుధాన్ని బిజెపికి అందించినట్లైంది.

ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు ప్రకటించిన తాయిలాలన్నీ దిగదుడుపు అయ్యాయి.  కర్ణాటక రాజకీయమంతా ఇప్పుడు దేవుడి చుట్టూ తిరుగుతోంది. గతంలో రాముడ•ని బందీ  చేసిన కాంగ్రెస్‌కు ఇప్పుడు  భజరంగ్‌ ‌దళ్‌ ‌నినాదం నచ్చడంలేదని  సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ నే ఆరోపించారు. అందుకు ప్రతిగా   జై భజరంగ్‌బలి నినాదాన్ని ఆయన ఎత్తుకున్నారు. దీంతో  దేశవ్యాప్త బీజెపీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మోదీ సభలన్నీ భజరంగ్‌ ‌బలి నినాదాలతో మారు మోగుతున్నాయి. భజరంగ్‌ ‌కార్యకర్తలు మొదలు, ఆ పార్టీ అనుబంధ శాఖలన్నీ దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్‌ ‌దేవాలయాలముందు హనుమాన్‌ ‌చాలీసా పారాయణాలు మొదలుపెట్టాయి. మ్యానిఫెస్టోను ప్రకటించి వివాదానికి కారణమైన కాంగ్రెస్‌ ‌కార్యాలయాలముందు బిజెపి, భజరంగ్‌ ‌దళాలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరింత ఉధృతంగా  ప్రదర్శనలు చేసే ఆలోచనలో బిజెపి ఉంది.  ఇలాంటి నినాదం చేయడంద్వారా కాంగ్రెస్‌ ‌దుష్ట సంస్కృతిని శిక్షించడమవుతుందని మోదీ తన పార్టీ శ్రేణులకు ప్రబోధించారు.. విభజించి పాలించడమే కాంగ్రెస్‌ ‌సంస్కృతిగా ఉందని, అభివృద్ధి, శాంతి సామరస్యాలకు కాంగ్రెస్‌ ‌శత్రువని ఎన్నికల సభలో మోదీ కాంగ్రెస్‌పై ఈ విషయంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఇది కర్ణాటక కాంగ్రెస్‌కు ఇప్పుడు మైనస్‌గా మారింది. సాక్షత్తు ప్రధాని అంతటివాడు హిందువుల భావాజాలాన్ని రెచ్చగొట్టే విధంగా జై భజరంగ్‌ ‌బలి అన్న నినాదంతో వోటు  వేయాలని పిలుపునివ్వడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్‌ ‌ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే అసలు తమ మ్యానిఫెస్టోలో భజరంగ్‌దళ్‌ని నిషేధిస్తామన్న  అంశమేలేదంటోంది కాంగ్రెస్‌. ‌కులాలు, మతాల పరంగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తే నిషేధించే  చర్యలు తీసుకుంటామని మాత్రమే తమ పార్టీ చెప్పిందంటోంది కాంగ్రెస్‌. ‌బిజెపికి హనుమంతుడిపై ఎంత భక్తి ఉందంటే ఇంతవరకు దేశంలో ఒక్కటంటే ఒక్క ఆంజనేయ దేవాలయాన్ని కూడా ఆ పార్టీ నిర్మించలేదని, అధికారంలోకి వొస్తే తామే తప్పకుండా ప్రతీ గ్రామాన ఆంజనేయ ఆలయాలను నిర్మిస్తామని కాంగ్రెస్‌ ‌ప్రతిగా ప్రకటనలు చేస్తున్నది. ఎన్నికల సమయంలోనే బిజెపి దేవుళ్ళు గుర్తుకు వొస్తారంటున్న కాంగ్రెస్‌, ‌గతంలో గోవాలో నాటి ముఖ్యమంత్రి మనోహర్‌ ‌పారికర్‌  ‌కాలంలో అల్లర్లకు పాల్పడుతున్న శ్రీయసేనపై నిషేధం విధించింది, తమ నాయకుడిగా మల్చుకోవడానికి ప్రయత్నిస్తున్న సర్ధార్‌ ‌వల్లభాయి పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధిస్తే, బిజెపి తీవ్రంగా విమర్శిస్తున్న జవహర్‌లాల్‌ ‌నెహ్రూ నిషేధాన్ని ఎత్తివేసిన చరిత్రను ఆ పార్టీ గుర్తు చేస్తోంది. మొత్తానికి గతంలో రాముడు, నేడు భజరంగ్‌బలితో బిజెపి ఎన్నికల రాజకీయాలకు పాల్పడుతుంది..

Leave a Reply