Take a fresh look at your lifestyle.

2023 ‌లక్ష్యంగా రాష్ట్రంలో రాజకీయాలు

రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండున్నర ఏళ్ళ సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమాను ఆ పార్టీలు వ్యక్తంచేస్తున్నాయి. నిన్నటి వరకు స్థబ్ధతగా ఉన్న పార్టీ నూతన సారథ్యంలో ఉవ్వెత్తున లేవడం, మరో కొత్తపార్టీ ఆవిర్భావంతో ఇక్కడి రాజకీయ వాతావరణమే మారిపోయింది. దానికి తగినట్లు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్యనాయకులు తమ పార్టీలను వొదిలి మరో గూటికి చేరుతున్న క్రమంలో మారుతున్న ఈక్వేషన్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాజకీయ వాతావరణ మార్పుకు పునాది పడింది దుబ్బాక, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల తోనే. దాని తర్వాత రాష్ట్ర క్యాబినెట్‌ ‌నుండి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ ‌చేయడం కూడా మరో కారణంగా మారింది. ఇంతవరకు అధికార టిఆర్‌ఎస్‌, ‌భారతీయ జనతాపార్టీ మధ్యనే తిరుగుతూ వొచ్చిన రాష్ట్ర రాజకీయాలు తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ఆధ్యక్షుడిగా ఎనుముల రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేప్టడంతో అందరి దృష్టి ఇప్పుడు అటువైపు మళ్ళింది. నిన్నటివరకు స్థబ్ధతగా ఉంటూ వొచ్చిన కాంగ్రెస్‌లో నూతన కదలిక ప్రారంభమైంది. పడిలేచిన కెరటంలా దూసుకువొస్తున్న ఈ పార్టీనిప్పుడు పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంటే రానున్న కాలంలో ఈ మూడు ప్రధాన పార్టీల మధ్యనే పోటీ అనివార్యం కాబోతున్నదన్నది స్పష్టమవుతున్నది.

ఇదిలా ఉంటే దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఏలిన తెలుగుదేశం పార్టీకిక్కడ మనుగడే లేకుండా పోయింది. రాష్ట్రం విడిపోయిన ఈ ఏడు సంవత్సరాల్లో పేరుకు మాత్రమే తెలంగాణలో ఆ పార్టీ ఉంటూ వొస్తున్నది. ఆ పార్టీ తెలంగాణ సారథి ఎల్‌. ‌రమణ ఇవ్వాళో రేపో గులాబి కారెక్కబోతున్నట్లు వినికిడి. దీంతో తెలంగాణలో ఇక ఆపార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనంటున్నారు. రాష్ట్ర క్యాబినెట్‌ ‌నుండి బలవంతంగా సాగనంపిన ఈటల రాజేందర్‌ ‌స్థానాన్ని ఎల్‌. ‌రమణతో భర్తీ చేయవొచ్చని తెరాస భావిస్తున్నది. ఎల్‌ ‌రమణ ఆ స్థానానికి ఎంతవరకు న్యాయం చేస్తారన్నది వేరేవిషయం. ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్‌కు ధీటైన ప్రత్యమ్నాయం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ ‌ప్లస్‌ ‌వైఎస్‌ అభిమానులకు గురువారం వైఎస్‌ ‌షర్మిల సారథ్యంలో ఆవిర్భవించిన పార్టీవైపు మొదటి నుండీ కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ, రేవంత్‌ ‌టిపిసిసి అధ్యక్షుడు కావడంతో వారాంతా ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా రాజకీయాల్లో తాము అణచివేయబడుతున్నామన్న అభిప్రాయం రెడ్డి సామాజిక వర్గానికి కొంత కాలంగా ఉంది. తమకో మంచి నాయకత్వం ఉంటే బాగుండన్న వారి ఆలోచనలకు తగినట్లుగా అటు షర్మిల పార్టీ, ఇటు కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి నాయకత్వం లభించడంతో వీరంతా ఎటు మొగ్గుచూపుతారన్నది రానున్న కాలమే నిర్ణయించనుంది. ఏదిఏమైనా చాలాకాలంగా బోసిపోయిన గాంధీ భవన్‌ ‌మాత్రం ఇప్పుడు విద్యుత్‌ ‌వెలుగులు విరజిమ్ముతున్నది. నూతన సారథిని ఆహ్వానిస్తూ కటౌట్లు, బ్యానర్లు, జండాలతో నగరం కోలాహలంగా మారిన తీరు కార్యకర్తల్లో పార్టీ అభివృద్ధి పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నదన్నది మాత్రం స్పష్టమతున్నది.

ఈ పార్టీలన్నిటి ముందిప్పుడు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పరీక్షగా నిలిచి ఉంది. రాబోయే ఎన్నికల్లో అధికారం ఎవరి హస్తగతం కానున్నదన్న విషయానికిది ఒక లిట్మస్‌ ‌టెస్ట్ ‌లాంటిదన్న భావన ఇప్పుడీ పార్టీ వర్ల్లాల్లో లేకపోలేదు. నిన్నటి వరకు అధికార పార్టీలో ఉండి, ఈ నియోజకవర్గానికి సారథ్యం వహించిన ఈటల రాజేందర్‌ ఇప్పుడు, భారతీయ జనతాపార్టీలో చేరి తన స్థానాన్ని ఎట్టి పరిస్థితిలో దక్కించుకోవాలని కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. అధికార టిఆర్‌ఎస్‌ ‌కూడా అటు రాజేందర్‌ను బర్తరఫ్‌ ‌చేసిందోలేదో తమ ప్రభుత్వంపై ఎలాంటి చెడు అభిప్రాయం రాకూడదన్న ఉద్దేశ్యంగా అక్కడి ప్రజలను, పార్టీ శ్రేణులను కలుస్తూ వొస్తున్నది. హుజూరాబాద్‌ ఎన్నికలతోపాటు రానున్న ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చాలా ముందునుండే గ్రౌండ్‌ ‌ప్రిపేర్‌ ‌చేసుకుంటున్నది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత నెలనుండే జిల్లాల పర్యటన ప్రారంభించారు.

వరంగల్‌, ‌సిద్దిపేట, కామారెడ్డి లాంటి ప్రధాన జిల్లాలను పర్యటించడంతో పాటు అనేక వాగ్ధానాలను గుమ్మరించి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిధులను ప్రకటిస్తూ వొస్తున్నాడు. దీనికి తోడు మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం కూడా మొదలైంది. రాష్ట్రం విడిపోకముందు ఉద్యమ నినాదంగా ఉన్న కృష్ణా జలాల్లో వాటా అన్నదిప్పుడు మరోసారి చర్చనాయాంశంగా మారింది. ఎప్పటిలాగేనే తమ వాటాకు వొచ్చే ఒక చుక్క నీటిని కూడా వొదులుకునే పరిస్థితి లేదని చెప్పడంతోపాటు కేంద్రానికి, కేంద్ర జలవనరుల శాఖకు లేఖలు రాయడం, దీనిపై చర్చలు జరుపడం లాంటి ప్రక్రియ కూడా రానున్న ఎన్నికలకు టిఆర్‌ఎస్‌ ‌రంగం సిద్ధం చేసుకుంటున్నదన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. కాగా, తెలంగాణపై కాషాయ జంఢాను ఎగురవేయాలన్న లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్న బిజెపి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందిస్తున్న వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి లబ్ధి పొందే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హుజూరాబాద్‌, ఆ ‌తర్వాత వొచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాదయాత్రల రూట్‌మ్యాప్‌ను తయారు చేసుకుంటున్నారు. నిన్నటివరకు టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనుకున్న ఈ పార్టీకి రేవంత్‌ ‌రాక కొంత నిరాశను కలిగిస్తున్నది. మొత్తానికి రాష్ట్ర రాజకీయాలిప్పుడు ఈ మూడు పార్టీల మధ్య ఆసక్తిగా మారాయి.

Leave a Reply