Take a fresh look at your lifestyle.

న్యాయం జరగకుంటే….ఛలో నారాయణఖేడ్

  • టీయూడబ్ల్యుజె హెచ్చరిక
  • కలెక్టరేట్ ముందు నిరసన

నారాయణఖేడ్ ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి దౌర్జన్యంగా V6 లోకల్ రిపోర్టర్ పరమేశ్వర్ ఇంటి కట్టడాన్ని కూల్చేసిన సంఘటనపై ప్రభుత్వం స్పందించి బాధితుడికి న్యాయం చేకూర్చాలని, లేనిపక్షంలో ఛలో నారాయణఖేడ్ కార్యక్రమాన్ని చేపట్టి, ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యుజె) సంగారెడ్డి జిల్లా శాఖ కార్యదర్శి విష్ణు కుమార్ హెచ్చరించారు. ఎమ్యెల్యే దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఇవ్వాళ సంగారెడ్డి కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి కలెక్టర్ హన్మంతరావు కు వినతి పత్రాన్ని అందించారు.

నారాయణ్ ఖేడ్ పట్టణంలో ఎమ్యెల్యే భూపాల్ రెడ్డి కనుసైగలతో ఎన్నో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, దీనిని పట్టించుకోని మున్సిపల్ అధికారులు ఎమ్యెల్యే ఆదేశాలతో ఓ పేద విలేఖరి ఇంటి కట్టడాన్ని కూల్చేయడం ఎంతవరకు సమంజసమని విష్ణుకుమార్ ప్రశ్నించారు. కరోనా లాక్ డౌన్ నిబంధనలను కాలరాసి అట్టహాసంగా వెయ్యి మందితో జన్మదిన వేడుక జరుపుకున్న సంఘటనపై ఎమ్యెల్యే భూపాల్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహకారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో టీయూడబ్ల్యుజె వీడియో జర్నలిస్టుల విభాగం బాధ్యులు శ్రీనివాస్, పలువురు సీనియర్ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు ఉన్నారు.

Leave a Reply