Take a fresh look at your lifestyle.

ఏంఏంసిలో ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ రిలే నిరాహార దీక్ష

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 8: మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 11,12న కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపటనున్నట్లు రంగా రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంద మల్లమ్మ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చల్లా నర్సింహ రెడ్డి మాట్లాడుతూ.. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. ఈ నెల 11,12న మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో రిలే నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ చేపట్టిన రిలే దీక్షలకు కార్పొరేషన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చల్లా కోరారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెరిగిన ఇంటి పన్నులు తగ్గిస్తానని ఇచ్చిన హామీని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికి నిలబెట్టుకోకపోవడం దారుణమన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ లో ఇంటి పన్నులు, మంచి నీటి బిల్లులు గ్రేటర్ హైద్రాబాద్ కన్నా అధికంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో నూటికి నూరు శాతం పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు ఉంటారని, అలాంటి వారిపై అధిక పన్నులు మోపడం దారుణమన్నారు. పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో దాదాపు ఏడాదిగా   పోరాటం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఆందోళనకు స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా అధికారులు అధిక పన్నులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పన్నులు చెల్లించని వారిపై పెనాల్టిలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, మంచి నీటి బిల్లులు తగ్గించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లా బాల్ రెడ్డి, శ్రీశైలం, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply