Take a fresh look at your lifestyle.

పివి బొమ్మను పెట్టుకుని ప్రచారం చేసుకునే ఖర్మ పట్టింది

పట్టభద్ర ప్రచారంలో దుయ్యబట్టిన బండి సంజయ్‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిమ్మికులతో, అడ్డదారుల్లో గెలవాలని టీఆర్‌ఎస్‌ ‌చూస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌పీవీ నర్సింహారావు ఫొటో పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పీవీ నర్సింహారావు ఘాట్‌ను కూల్చేస్తామన్న పార్టీ దోస్తీ కట్టిన వారి తరపున ఎలా పోటీ చేస్తారని వాణిదేవిని ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సమాజానికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలవకుంటే ముఖ్యమంత్రికి అహంకారం తలకెక్కి ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తుల పేరు చెప్పుకుని మంత్రి పదవి పొందారని.. నేడు వారినే బెదిరించి ఓట్లు రాబట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. సొంత మనుషుల బదిలీలు, ప్రమోషన్ల కోసం జీవోలు మార్చిన సంగతి అందరికీ తెలుసు అని.. ముందు వాటిపై దృష్టి పెట్టాలని ఆ తర్వాత తమ గురించి మాట్లాడాలని బండి సంజయ్‌ ‌హితవు పలికారు.

కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌వెంటిలేటర్‌ ‌పై ఉందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ ‌నుంచి ఎప్పుడు బయటకు పోతారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. మ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఓటే అడగని కేసీఆర్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌, ‌రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీలపై లేఖల పేరుతో కొత్త డ్రామాకు తెరతీసిందని సంజయ్‌ ‌ఫైర్‌ అయ్యారు. రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం ఎకరం భూమి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ‌కు లాలూప్రసాద్‌ ‌యాదవ్‌ ‌మాదిరి జైలు భయం పట్టుకుందని సంజయ్‌ అన్నారు.

సీఎం అవినీతి సొమ్మును పైసాపైసా కక్కిస్తామని చెప్పారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌క్యాండిడేట్లకు ఓటేస్తే.. సీఎం కేసీఆర్‌ ‌కండ్లు మరింత నెత్తికెక్కుతయ్‌. అప్పు‌డు నోటిఫికేషన్లు రావ్‌. ‌టీచర్లు, ఉద్యోగులకు పీఆర్సీ రాదు. నిరుద్యోగులకు భృతి రాదు. ఇవన్నీ రావాలంటే కచ్చితంగా బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలి. అప్పుడే కేసీఆర్‌ ‌ఫాంహౌస్‌ ‌నుంచి బయటకొచ్చి నాలుగు పనులు చేస్తడని సంజయ్‌ అన్నారు. 2023లో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply