Take a fresh look at your lifestyle.

Corona Second Wave Alert: సెకండ్ వేవ్ క‌ట్ట‌డికి ఆరు రాష్ట్రాల‌కు కేంద్ర బృందాలు..

  • ప్ర‌ధాని మోడీ ఉన్న‌తస్థాయి స‌మీక్ష‌

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ: గ‌త ఏడాది కాలంగా యావ‌త్ మాన‌వాళిని క‌బ‌ళిస్తున్న మ‌హ‌మ్మారి క‌రోనా సెకండ్ వేవ్‌ని క‌ట్ట‌డి చేసేందుకు ఆరు రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా మ‌ళ్ళీ క‌రోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆరు రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించారు. కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఈ స‌మీక్షలో చ‌ర్చించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నందున కేంద్ర బృందాలను ఆ రాష్టానికి పంపాలని నిర్ణయించారు. ఆదివారం న‌మోదైన కేసుల్లో 57 శాతం ఈ ఆరు రాష్ట్రాల్లో ఉన్న‌ట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. అందుచేత‌, ఆయా రాష్ట్రాల్లో ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స‌మీక్షలో ప్ర‌భుత్వం భావించింది. మ‌హారాష్ట్ర‌తో పాటు పంజాబ్, ఛత్తీస్గఢ్ త‌దిత‌ర రాష్ట్రాల‌కి కేంద్ర బృందాలను పంపాలని ప్రధాని ఆదేశించారు. ఏప్రిల్ 6 నుంచి 14 వరకు… కరోనా జాగ్రత్తలు, మాస్క్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.దేశ‌వ్యాప్తంగా 7.3 కోట్లు దాటిన కోవిడ్ టీకాలు దేశవ్యాప్తంగా అమలవుతున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 7.3 కోట్లు దాటింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

ఆదివారం వ‌ర‌కు 11,53,614 శిబిరాల ద్వారా 7,30,54,295 టీకాలిచ్చిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇందులో 89,32,642 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు, 52,96,666 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన రెండో డోసులు, 95,71,610 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన మొదటి డోసులు, 39,92,094 డోసులు కోవిడ్ యోధులకిచ్చిన రెండో డోసులు, 4,45,77,337 డొసులు 45 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటీ డోసులు, 6,83,946 డోసులు 45 ఏండ్లు పైబడ్డవారికిచ్చిన రెండో డోసులు కలిసి ఉన్నాయ‌ని వెల్ల‌డించింది. ఆరు కోట్లకుపైగా (6,30,81,589) మొదటి డోసులు, దాదాపు కోటి (99,72,706) రెండో డోసులు ఉన్నట్టు చెప్పింది. మహారాష్ట్ర, కర్నాటక, చత్తీస్ గఢ్, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ పంజాబ్, మధ్యప్రదేశ్ లలో రోజువారీ కొత్త కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్న‌ట్టు పేర్కొంది. గడిచిన 24 గంటలలో కొత్తగా నమోదైన 89,129 కేసులలో 81.42% ఈ ఎనిమిది రాష్టాలలోనే కావటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 47,913 కేసులు రాగా, కర్నాటకలో 4,991, చత్తీస్ గఢ్ లో 4,174 కొత్త కేసులు నమోదైన విష‌యం తెలిసిందే.

Leave a Reply