Take a fresh look at your lifestyle.

సమాజం పట్ల నిబద్ధతగా పని చేసిన మహనీయుడు సురవరం..!

  • గోల్కొండ పత్రిక పునరాగమణం అవసరం
  • సురవరం 125వ జయంతి ఉత్సవాల సదస్సులో వక్తలు

సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై నిబద్దతో పనిచేసిన మహనీయుడు సురవరం ప్రతాపరెడ్డి అని ప్రముఖ కవి, గాయకులు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ప్రతాపరెడ్డి125వ జయంతిని తెలుగు జాతీ మొత్తం మహోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైన వుందని ఆయన పేర్కొన్నారు. అతితక్కువ వ్యవధిలోనే ఎక్కువ విస్తర్ణంలో పనిచేసి సమాజానికి కావాల్సిన అనేక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఘనత సురవరందేనని ఆయన కొనియాడారు. సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నాడు జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె), మీడియా ఎడ్యూకేషన్ ఫౌండేషన్ ఇండియా, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్, తెలంగాణ సారస్వత పరిషత్ సంస్థల ఆధ్వర్యంలో “జర్నలిజం- నాటి నేటి విలువలు అంశంపై జరిగిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, శాంతనారాయణ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత, టియూడబ్ల్యూజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, ఐజెయు కార్యదర్శి వై.నరెందర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా అధనపు కలెక్టర్ సీతారామయ్య, జయంతి ఉత్సవాల కమిటీ సభ్యురాలు సురవరం పుష్పలత తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు సురవరం ప్రతాపరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళు అర్పించారు.

TUWJ state general secretary Virahat Ali

ఈ సందర్భంగా ప్రధాన వక్త దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ జాతి పునర్నిర్మాణానికి, అస్తిత్వం కోసం సురవరం తీవ్రంగా పరితపించారని అన్నారు. ఆధునికయుగంలో పెద్ద ప్రచార సాధనంగా పత్రికలు వున్నాయని, కానీ నాడు స్వాతంత్ర్యోద్యమం, సంస్కరణలుగా పత్రికలు వచ్చాయన్నారు. నాడు గాంధీ, నెహ్రు రాజకీయ నాయకులుగానే కాకుండా రచయితలుగా మెలిగారని, గాంధీజీ 60వేల సాహిత్యం వ్రాశారని అది సాహిత్యం పట్ల అయనకు వున్న నిబద్ధత అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో సాంఘిక విప్లవంగా సాధనంగా పత్రికలు నడిపిన ఘనత సురవరంకే దక్కుతుందని, తెలంగాణ చరిత్రను పరిశీలిస్తే ఆయన ఒక్క విశ్వరూపంగా కనిపిస్తారని చెబుకొచ్చారు. చదువుకోవడమే కష్టంగా వున్న రోజుల్లో బహుబాషలలో ప్రావీణ్యం సాధించారంటే ఆయన చేసే ప్రతి పనిలో వున్న చిత్తశుద్ది చెప్పకనే చెబుతుందన్నారు. నిజాం కాలంలో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాయడమే కాకుండా చదువుతో పాటు చివరకు తెలుగు మాట్లాడే అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. అలాంటి సమయంలో సురవరం 700 వ్యాసాలు వ్రాశారంటే ఆయన ఎన్ని కోణాలను అలోచించి ఈ వ్యాసాలు వ్రాసారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. కొత్వాల్ వెంకట్రాంరెడ్డి సహకారంతో సురవరం మరింత చైతన్య కార్య్రకమాలు నిర్వహించారని, కేవలం సురవం కోసమే నాడు వెంకట్రాంరెడ్డి గొల్కోండ పత్రికను స్థాపించడం జరిగిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేనందునే ఆ పత్రిక ప్రజల గొంతుకగా మారిందన్నారు. ముఖ్యంగా రామాయణం పై సురవరం విశ్లేషణ చేడమే కాకుండా ఆ కాలంలో వున్న దురాచారాలను సైతం ఎత్తిచూపారన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ, ఏ రచన అయినా సద్విమర్శ లేనపుడు అది వెలుగులోకి రాదని చెప్పారని పేర్కొన్నారు.

ఆయన పత్రికను వృత్తిగా కాకుండా సామాజిక కార్యకర్తగా నిర్వహించారని అందుకే గోల్కోండ పత్రికకు ఎంతమంది సంపాదకులుగా పనిచేసినా, ఎన్ని పత్రికలు వచ్చినా సురవరం ప్రతాపరెడ్డి పేరు, గోల్కొండ పత్రిక పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.తమ చుట్టు జరుగుతున్న వాస్తవాలను తెలుసుకోవాలనే కుతూహలం ప్రజల్లో వున్నా వాటిని తెలియచేసే సరైన వేదిక మాత్రం కరువైందన్నారు. సురవరం అగ్రకులస్థుడైనప్పటికీ వివిధ కుల సంఘాలకు అధ్యక్షునిగా పనిచేసి వారిని సంఘటితం చేశారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆయన నాంది పలికారని గుర్తు చేసుకున్నారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ గోల్కొండ పత్రికను తిరిగి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవశ్యకత ఎంతైన వుందని ఇలా చేయడం వల్ల సురవరం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

అయితే ప్రభుత్వాల కనుసైగల్లో కాకుండా సురవరం అశయాలకు, విలువలకు అనుగూణంగా ప్రజల సహకారంతో ప్రజలకు అందిస్తేనే దాని నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా నడిపే అవకాశం ఉంటుందన్నారు. కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ హక్కులను ప్రశ్నించిన వారే గొప్ప సంపాదకులుగా నిలుస్తారని సురవరం నిరూపించారని చెప్పారు. ప్రస్తుతం చాలా పత్రికలు వున్నప్పటికీ నిజాలు మాత్రం నిర్భయంగా బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయిందంటే పత్రికలు ఎలా పనిచేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. నేడు మీడియా రంగంలో 70శాతం విలువలు పతనం అయ్యాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కారణంగా కొంతైన నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. అనంతరం సురవరంప్రతాపరెడ్డి కుమారుడు సురవరం క్రిష్ణ వర్ధన్ రెడ్డితో పాటు సురవరం పుష్పలతను సత్కరించారు. ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజె రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, టియూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు ఐలమోని శేఖర్, దండు దత్తేంద్ర, మధు, జిల్లా ప్రముఖులు మనోహర్ రెడ్డి, ప్రొదుటూరి ఎల్లారెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్, సహాయ కార్యదర్శి బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply