Take a fresh look at your lifestyle.

నేటి నుండి భద్రాద్రి రామయ్య పెళ్ళి వేడుకలు షురూ…

 పెళ్ళి కుమారుడుగా రామయ్య ముస్తాబు  
 నేడు రామాలయంలో వసంతోత్సవం, డోలోత్సవం
 కల్యాణానికి తలంబ్రాలు సిద్ధం చేయనున్న దేవస్థానం

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 24 : పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం స్వామివారి కల్యాణానికి సోమవారం నాటి నుండి పనులు ప్రారంభించనున్నారు. హోలీ పౌర్ణమి సందర్బంగా శ్రీ స్వామివారికి వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు. అందుకోసం ముందు గానే ఆదివారం నాడు ఈ పనులకు అంకురార్పణ చేసారు. హోలీ పౌర్ణమి నాడు రామయ్యను పెళ్ళి కొడుకుగా తయారు చేస్తారు. స్వామివారు పెళ్ళికి సిద్దమైనట్లుగా భావిస్తారు. ఈ సందర్బంగా సోమవారం నాడు అర్చకులు , భక్తులతో పసుపు కొట్టించే పనిని ప్రారంభం కానున్నాయి. 9వ తేది నుండి 23 వరకు వసంతపక్ష త్రయుక్త శ్రీ రామనవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 17వ తేది బుధవారం స్వస్తి శ్రీ చాంద్రమాన ‘‘క్రోధి’’ నామ సంవత్సర చైత్ర శుధ్య పాడ్యమి శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని 10.30 గంటల నుండి 12.30 గంటల వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే మరుసటి రోజు 18వ తేది గురువారం నాడు 11.30 గంటల నుండి 12.30 గంటల వరకు శ్రీ సీతారామ పట్టాభిషేకం కన్నుల పండుగగా జరుగనుంది.

అంతే కాకుండా అనుబంధ దేవాలయం అయిన పర్ణశాల క్షేత్రంలో కూడ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. హోలీ పౌర్ణమి నాడు స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు సిద్దం చేయాల్సి ఉన్నది కాబట్టి ఇప్పటికే దేవస్థానం అధికారులు బియ్యాన్ని సిద్ధం చేసారు. ఉభయ గోదావరి జిల్లాల నుండి శ్రీ రామ ఆధ్యాత్మిక సేవా సమితి నుండి 12 టన్నుల 800 కేజీల బియ్యాన్ని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ ఇఓ ఎల్‌ రమాదేవికి అందచేసారు. గోటి తలంబ్రాలను వివిధ ప్రాంతాల నుండి సుమారుగా 300 మంది భక్తులు కాలినడకగా వొచ్చి దేవస్థానం ఇఓ రమాదేవికి అందచేసారు. అంతేకాకుండా జూలూరుపాడు, రాజారావుపేట, పాపికొల్లు, గుడెపూడి, పడమటినరసాపుపరం పలు గ్రామాల నుండి 500 మందికి పైగా రామభక్తులు కలినడకన వొచ్చి గోటి తలంబ్రాలు సమర్పించారు. వీటిని భక్తుల సమక్షంలో తలంబ్రాలుగా సిద్ధం చేయనున్నారు.

అనంతరం స్వామివారిని ఉయ్యాల్లో ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించనున్నారు. అంతేకాకుండా రామదాసు, డూము నరసింహదాసు, కీర్తనలు ఆలపిస్తున్న సమయంలో నక్షత్ర కుంభ హారతులను స్వామివారికి సమర్పించనున్నారు. హోలీ పౌర్ణమి సందర్భంగా ముందుగా ప్రధానాలయంలోని ధృవమూర్తులకు లక్ష్మీతాయారమ్మ వారికి, ఆంజనేయస్వామికి వసంతాన్ని అష్టోత్తంగా చల్లుతారు. అంతేకాకుండా వసంతోత్సవ కార్యక్రమానికి గుర్తింపుగా భక్తులపై పసుపు నీళ్ళను చల్లుతారు. అందుకే దీన్ని వసంతోత్సవం అని కూడ అంటారు. పసుపు కొట్టడం , తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని వైకుంఠ దర్శనం ప్రాంతంలో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం స్వామివారికి డోలోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా  ప్రతీరోజు జరిగే నిత్య కల్యాణాన్ని నిర్వహించబడదని దేవస్థానం అధికారులు తెలిపారు.

Leave a Reply