Take a fresh look at your lifestyle.

సంక్రాంతి రద్దీకి 6,400 ప్రత్యేక బస్సులు

  • నేటినుంచే అందుబాటులోకి ప్రత్యేక బస్సులు
  • రిటర్న్ ‌టిక్కెట్‌ ‌బుక్‌ ‌చేసుకుంటే పదిశాం రాయితీ

అమరావతి,జనవరి5 : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6,400 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఎపిఎస్‌ ఆర్‌టిసి పేర్కొంది. ప్రత్యేక బస్సులు కూడా సాధారణ చార్జీలతోనే నడుస్తాయని అధికారులు తెలిపారు. రిటర్న్ ‌జర్నీ కన్షెషన్‌ ‌కాన్సెప్ట్‌కి ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక బస్సులు ఈ నెల 6 నుంచి 14 వరకు, సంక్రాంతి తర్వాత రోజుల్లో ఈనెల 16 నుంచి 19 వరకు బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్‌టిసి సమాయత్తమవుతోందని తెలిపారు. ఇప్పటికే 10 నుంచి 13 వరకు అన్ని సాధారణ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్లు పూర్తయ్యాయన్నారు. పండగ వేళ.. ప్రయాణీకులను రాబట్టేందుకు డిస్కౌంట్లను బంపరాఫర్లను ప్రకటించింది.

ఇప్పటికే వయోవృద్ధులకు టిక్కెట్టులో 25 శాతం రాయితీ ఇస్తోన్న ఆర్టీసీ.. ఇప్పుడు నలుగురు ప్రయాణికులు (పిల్లలు సహా) ఒకేసారి టిక్కెట్టు తీసుకుంటే చార్జీ మొత్తంలో ఐదు శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి ఈ విధానం లాభదాయకం కానుంది. ఈ వాలెట్‌ ‌ద్వారా టిక్కెట్టును బుక్‌ ‌చేసుకున్నా చార్జీలో ఐదు శాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. రానూపోనూ టిక్కెట్టును ముందుగా రిజర్వేషన్‌ ‌చేసుకుంటే తిరుగు ప్రయాణం ఛార్జీలో 10 శాతం తగ్గిస్తుంది.ఈ విధానాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక బస్సులకూ వర్తింపజేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. పట్నాలు, సిటీల్లో స్థిరపడిన వారందరూ సంక్రాంతికి సొంతూరుకు వస్తుంటారు. దీంతో ఈ విధానం ద్వారా అటు ఆర్టీసీకి, ఇటు ప్రయాణీకులకు ఉపయోగం కలగనుంది. మరోవైపు..జనవరి 6 నుంచి 18 వరకు…సంక్రాంతికి సొంతూళ్లకు   వెళ్లేవారి కోసం 6,400 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేశారు. ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమలరావు తెలిపారు. అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక సర్వీసులను నడుపుతామని చెప్పారు. మొత్తం 6,400 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక తయారు చేసుకున్నామని, తెలంగాణా నుంచి 3,600, కర్నాటక నుంచి 430, చెన్నరు నుంచి 150 ప్రత్యేక సర్వీసులు నడుపనున్నట్లు తెలిపారు.

జనవరి 6 నుంచి 14వ తేదీ వరకు ఆంధప్రదేశ్‌కు వచ్చేందుకు, 15 నుంచి 18వ తేదీదాకా తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా ప్రయాణంతోపాటు తిరుగు ప్రయాణానికి కూడా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ ‌చేసుకుంటే 10 శాతం రాయితీని ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 800, విశాఖపట్నానికి 450, రాజమండ్రికి 200, ఇతర ప్రాంతాలకు 770 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికులు తమ సందేహాలను 0866 2570005 నెంబర్‌కు ఫోన్‌ ‌చేసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Leave a Reply