Take a fresh look at your lifestyle.

అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 02 : గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనాథలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక కమిషన్, ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అంజలీ తెలంగాణ అనాథల హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు బి.వెంకటయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిఏ రవీందర్ ను కలిసి వినతి పత్రం అందజేసినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24 జూన్ 2015లో అనాథ పిల్లలకు అమ్మా నాన్నా ప్రభుత్వమే అని వేసిన సబ్ కమిటిలో నిర్ణయించిన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలన్నారు. 9 జనవరి 2022 నాడు 11 మంది మంత్రులతో దేశం గర్వించేలాగా ప్రత్యేకంగా ఒక సబ్ కమిటి ఏర్పాటుచేసి దాదాపు 40 డిమాండ్లకు పైగా ప్రభుత్వానికి, ముఖ్య మంత్రికి సిఫార్సుచేసిందని గుర్తు చేశారు. అన్ని శాఖలలో ప్రత్యేకంగా కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ పోస్టులను ఏలాంటి షరతులు లేకుండా అర్హతలు బట్టి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. టి.ఎస్.పి.ఎస్.సిలో అనాథలకు 49 ఏళ్ల లోపు ఉన్న ప్రతీ అనాధను అనాధగానే గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలన్నారు. షరతులు లేకుండా బ్యాంకులతో సంబంధం లేకుండా వంద శాతం సబ్సిడితో రుణాలను మంజూరు చేయాలన్నారు. డబుల్ బెడ్రూం పథకం క్రింద ఇండ్లను కేటాయించాలన్నారు. బడ్జెట్ సమావేశాలో అనాథలకు ప్రత్యేకంగా రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. ప్రతి అసెంబ్లీ సమావేశంలో అనాథల తరుపున మాట్లాడటానికి అసెంబ్లీలో ఒక అనాథకు సభ్యునిగా అవకాశం ఇవ్వాలన్నారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను అధికారులు, ల్యాండ్ గ్రాబర్స్, కబ్జా చేస్తు వారిని అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని, కొన్ని సంధర్భాలలో హత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అరికట్టెందుకు ప్రత్యేక అనాథల అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలన్నారు. రూ.15 లక్షలతో అనాధ బంధు పధకం ప్రవేశ పెట్టాలని అన్నారు. అనాథల సమస్యలపై తక్షణ పరిష్కారం కొరకు వారి తరుపున రాష్ట్ర భ్రుత్వం సొంత ఖర్చుతో ఉన్నత న్యాయస్థానాలలో ప్రత్యేక న్యావాదిని నియమించి న్యాయం చేయించాలన్నారు. విక్టోరియా మెమోరియల్ హోంలో 900 మంది నుండి 9000 మంది అనాథలు చదువుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలన్నారు. ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రూప్ -4, గ్రూప్ -2, గ్రూప్ -1, సివిల్ సర్వీసెస్ లాంటి కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, బిఈడి, ఎల్.ఎల్.బి, ఎల్ఎల్ఎం, ఎంఎ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడి, పి.హెచ్.డి లాంటి ప్రత్యేక రెసిడెన్సీయల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. ప్రత్యేక హాస్పిటల్ ఏర్పాటు చేసి, అనాధకు అనారోగ్యం వస్తే కార్పొరేట్ వైద్యం అందించాలన్నారు. ఎంత ఖర్చయినా సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొత్తం ఖర్చు భరించాలన్నారు. అనాథలకు అన్ని రంగాలల్లో 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సిఎం కెసిఆర్ సార్ గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని అన్నారు. అనాధలకు ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం, డీజీపీ ఆఫీస్ లో ప్రత్యేక కౌంటర్లు, ఒక టీమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply