ముంబై, ఫిబ్రవరి 3: దేశానికి కామధేనువు లాంటి ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించేందుకు ఓవైపు కేంద్రం కసరత్తు చేస్తుంటే.. మరోవైపు ఈ సంస్థ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ సమున్నత శిఖరాలకు దూసుకెళ్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లోని తొలి పది నెలల్లో ఎల్ఐసీ పెన్షన్, గ్రూప్ పథకాల వ్యాపార విభాగం రూ.లక్ష కోట్లకుపైగా ప్రీమియం రాబడితో సరికొత్త అధ్యాయాన్ని లిఖించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఎల్ఐసీ వ్యాపార విభాగాల్లో ఒకే విభాగానికి ఇంత భారీ మొత్తంలో ప్రీమియం ఆదాయం రావడం ఇది వరుసగా రెండో సంవత్సరమని ఓ ప్రకటనలో పేర్కొన్నది. దీంతో ఈ విభాగ నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.7 లక్షల కోట్లకుపైగా పెరిగినట్లు వెల్లడించింది. దేశీయ కంపెనీల్లోని ఉద్యోగులకు రిటైర్మెంట్ ఫండ్ పథకాన్ని ఆఫర్ చేస్తున్న ఈ విభాగం ప్రస్తుతం మార్కెట్లో దాదాపు 80 శాతం వాటాను కలిగి ఉన్నది. ప్రైవేట్ బీమా కంపెనీలు రెండు దశాబ్దాల ముందుగానే ఈ వ్యాపారంలోకి ప్రవేశించినప్పటికీ ఎల్ఐసీ వాటా చెక్కుచెదరకుండా స్థిరంగా కొనసాగుతుండటం విశేషం.
ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే ఎల్ఐసీలో వాటాలు విక్రయించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బ్జడెట్లో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సవి•కరించాలని సంకల్పించింది. వాటాలు విక్రయించే సంస్థల్లో ఎయిర్ ఇం డియా, బీపీసీఎల్‌లను సెప్టెంబర్‌లోగా అమ్మేయాలనుకుంటన్నట్లు దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తెలిపారు. ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకుల్లో వాటా విక్రయానికి సంబంధించి చట్టంలో పలు సవరణలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.