Take a fresh look at your lifestyle.

గద్దెలపైకి సారలమ్మ

  • సాంప్రదాయబద్ధంగా పూజలు
  • రేపు సమ్మక్క రాక
  • అశేష భక్తుల రాకతో జనసంద్రంగా మారిన మేడారం అరణ్యం

మేడారం నుండి జే. ప్రభాకర్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి
మేడారం, ఫిబ్రవరి 16 : అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. భక్త కోటి జనం ఎదురు చూస్తున్న సారలమ్మ దేవత భక్తుల కోలాహలం, పోలీస్‌ ‌బందోబస్తు మధ్య గద్దెల పైకి చేరుకుంది. బుధవారం రాత్రి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి సారలమ్మను రాత్రి 8 గంటల తర్వాత మేడారంలోని గద్దెలపై ప్రతిష్టించారు. దీంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు ప్రకటించారు. అమ్మవారు గద్దెపై కొలువు తీరారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌.‌కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్‌ ‌సంగ్రామ్‌ ‌సింగ్‌ ‌గణపతి రావు పాటిల్‌, ‌ప్రజాప్రతినిదులు, గిరిజనులు, కన్నేపల్లి చేరుకుని సారలమ్మను కన్నేపల్లి నుండి ప్రధాన పూజారి కాక సారయ్యతో పాటు పలువురు పూజారులు అమ్మవారిని తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు.

బుధవారం సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కన్నేపల్లిలోని సారలమ్మగుడిని సుందరంగా తీర్చి దిద్ది గుడిలో గిరిజన సాంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ, బెల్లం, సారే, చీరలు అమ్మవార్లకు సమర్పించి బోనంను చేతపుచ్చుకున్న సారయ్య సాయంకాలం సమయంలో ఉద్రిక్తతల మధ్య అమ్మవారిని తన తమ్ముడైన జంపన్నను జంపన్న వాగులో ముద్దాడి తల్లి చెంతకు బయలుదేరింది. ఈ సమయంలో క్షలాది మంది భక్తులు జయం సాలరమ్మ, జై సమ్మక్క అంటు నినాదాలు చేయడంతో దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లింది. తన తోబుట్టువు సారలమ్మ తనపై ఉండి నడుచుకుంటు వెల్లడంతో జంపన్న అనందానికి అవదులు లేకుండా పోయిందని పలువురు చర్చింరుకున్నారు. కన్నేపల్లి నుండి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గద్దెలపైకి బయలుదేరిన సందర్బంగా జిల్లా పోలీస్‌ ‌యంత్రాంగం ప్రటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీస్‌ ‌బలగాలను ఏర్పాటు చేసింది.

పూజారుల సమీపంలోకి భక్తులు రాకుండా ప్రత్యేక రోప్‌ ‌పార్టీ ఏర్పాటు చేసిన పోలీసులు, ఆదివాసీ గిరిజన యువకుల సహయం తీసుకున్నారు. ఎట్టకేలకు తన కూతురు సారలమ్మ తన చెంతకు చేరడంతో సమ్మక్క తల్లి పులకరించిపోయింది. సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదాల కోసం మేడారానికి భక్తులు క్యూ కడుతున్నారు. జాతర పరిసరాలు భక్తజన సంద్రంగా మారాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బెల్లాన్ని(బంగారం) కానుకగా సమర్పిస్తున్నారు. ఉదయం నుంచే గుడిసెలు ఏర్పాటు చేసి ముంగిళ్ల వద్ద రంగవల్లులతో అందంగా అలంకరించారు. అమ్మవార్లకు బెల్లం చీరెసారెలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకొని తన్మయత్వానికి లోనవుతున్నారు.

మంగళవారం రాత్రి వరకు మోస్తరుగా ఉన్న రద్దీ..ఇవాళ ఉదయం నుంచి పెద్దఎత్తున పెరిగింది. దీంతో క్యూలైన్లు కిక్కిరిశాయి. జంపన్న వాగులో స్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్ల దర్శనానికి వొస్తున్నారు. దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు. మరోవైపు జాతరలో కొబ్బరికాయలు, బంగారు(బెల్లం) ధరలు కొండెక్కాయని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరికాయ రూ.50, బెల్లం కేజీ రూ.80 నుంచి 120 వరకు అమ్ముతున్నారని భక్తులు మండిపడుతున్నారు.

Leave a Reply