Take a fresh look at your lifestyle.

రాహుల్‌ ‌గాంధీకే తెలంగాణలో పర్యటించే అర్హత ఉంది..

  • మీరు అంటకాగుతున్న మోదీకి మాత్రమే ఆ అర్హత ఉందా?
  • కాళేశ్వరంపై చర్చకు సిద్ధం
  • బిఆర్‌ఎస్‌ ‌విమర్శలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 3 : కేంద్రంలో పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా రాహుల్‌ ‌గాంధీ పదవి తీసుకోలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌ ‌నేతలకు లేదన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబానికి తెలంగాణలో పర్యటించే అర్హత లేదనడం బీఆర్‌ఎస్‌ అవివేకమన్నారు. పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పటికీ రాహుల్‌ ‌గాంధీ పదవి తీసుకోలేదన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జనగర్జన సభకు ప్రజలు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల కుయుక్తులు చేసింది. అధికారులు, బీఆరెస్‌ ‌ప్రజాప్రతినిధులు, అక్కడి సైకో మంత్రి సభకు రాకుండా జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు…అని రేవంత్‌ ‌రెడ్డి ఆరోపించారు. కానీ అన్ని కుట్రలను చేధించి ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేసిన ఖమ్మం ప్రజలకు, నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్‌ ‌సభ విజయవంతం కావడంతో అసలు నక్క తప్ప వేట కుక్కలన్నీ బయటకు వొచ్చి మొరగడం మొదలు పెట్టాయని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఏ హోదాలో రాహుల్‌ ఇక్కడికి వొచ్చారని ప్రశ్నిస్తున్నారన్నారు. ‘‘రాహుల్‌ ‌గాంధీది మీలా దోపిడీ కుటుంబం కాదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ కుమారుడు రాహుల్‌ ‌గాంధీ. దేశం కోసం సర్వం త్యాగం చేయడానికి భారత్‌ ‌జోడో యాత్రతో ప్రజల్లోకి వొచ్చిన నాయకుడు రాహుల్‌.. ‌దేశంలో రాహుల్‌ ‌గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత  ఉంది’’ అని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పదవులను, ప్రాణాలను త్యాగం చేయడంతో పాటు ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ఇచ్చిన కుటుంబం రాహుల్‌ ‌గాంధీ కుటుంబమన్నారు. అలాంటి రాహుల్‌ ‌గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదని వ్యాఖ్యానించడాన్ని రేవంత్‌ ‌రెడ్డి తప్పుబట్టారు. మీరు అంటకాగుతున్న నరేంద్ర మోదీకి మాత్రమే తెలంగాణలో పర్యటించే ఆ అర్హత ఉందా? అంటూ బీఆర్‌ఎస్‌ ‌నేతలను రేవంత్‌ ‌నిలదీశారు.

‘‘రాహుల్‌ను విమర్శిస్తున్న అసలు మీకున్న అర్హత ఏంటి? ట్విట్టర్‌ ‌పిట్ట, సారా సీసాలో సోడా కలిపేటోడు, మంత్రులు ప్రతి ఒక్కరు రాహుల్‌ అర్హతపై ప్రశ్నిస్తున్నారు. భూమికి మూడు అడుగులున్నోడు కూడా రాహుల్‌ అర్హత గురించి మాట్లాడుతుండు. కడుపుకు అన్నం తినేవారు ఎవరూ రాహుల్‌ అర్హత గురించి ప్రశ్నించరు’’ అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్‌ ‌పార్టీదన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదో బీఆరెస్‌ ‌నేతలు చెప్పాలని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.
‘‘బాక్రానంగల్‌ ‌నుంచి నాగార్జున సాగర్‌, ‌శ్రీరామ్‌ ‌సాగర్‌, ‌జూరాల ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, 1 లక్ష 7 గ్రామాలకు విద్యుత్‌, ‌పబ్లిక్‌ ‌సెక్టార్స్ ‌కంపెనీలు, ఉపాధిహామీ చట్టం, ఆర్టీఐ, ఆహార భద్రత చట్టం, యూనివర్సిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు, హైదరాబాద్‌ ‌నగరానికి ఆదాయం తెచ్చే ఔటర్‌, అం‌తర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీలు, ఫార్మ కంపెనీలు, మెట్రో రైలు ఇలా ఎన్నో ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ‌పార్టీ తెచ్చింది’’ అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్ని ప్రాజెక్టులు మేము తెస్తే మీరు మాత్రం ఫామ్‌ ‌హౌస్‌లు, పేపర్‌, ‌టీవీలు పెట్టుకోవడం తప్ప ఏమి తెచ్చారు? అని ప్రశ్నించారు.

తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ ‌కాదా? మరి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. తెలంగాణ వొచ్చాక ఈ తొమ్మిదేళ్ల కాలంలో కేసీఆర్‌ ‌కుటుంబం ఆస్తులు అమాంతం పెరిగాయని ఆరోపించారు. 2014 జూన్‌ 2‌న కేసీఆర్‌ ‌కుటుంబం ఆస్తులు ఎంత? 2023 జులై 2 నాటికి వారి కుటుంబం ఆస్తులు ఎంత? దీనిపై చర్చించేందుకు వారు సిద్ధమా? అని సవాల్‌ ‌విసిరారు. కాళేశ్వరంపై  కాగ్‌ ఇచ్చిన నివేదికపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ విషయమై కాంగ్రెస్‌ ‌పార్టీ తరపున ఇద్దరు ప్రతినిధులు హాజరౌతామన్నారు. కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులు చర్చకు సిద్ధమా అని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌ ‌గాంధీ ఖమ్మం సభలో కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యల్లో తప్పేమి ఉందని రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‌ ‌చేసిన వ్యాఖ్యల్లో మీరు తప్పును చూపితే  దానికి మీరు విధించే శిక్షకు తాము సిద్ధమని  రేవంత్‌ ‌రెడ్డి  చెప్పారు. రాహుల్‌ ‌గాంధీ వ్యాఖ్యలతో తమ అవినీతి బయట పడిందని  కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావులు పెడ బొబ్బలు పెడుతున్నారని రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ‘‘కాళేశ్వరం అవినీతిపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఆరోపణలు నిజం. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం 38 వేల కోట్లతో కాంగ్రెస్‌ ‌ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మొదలు పెట్టింది.

కేసీఆర్‌ ‌ప్రాజెక్టు పేరు, డిజైన్‌ ‌మార్చి బడ్జెట్‌ ‌ను 1లక్ష 49 వేల131 కోట్లకు పెంచారు. మూడో టీఎంసీ కోసం 25 వేల 831 కోట్లు బడ్జెట్‌ ‌కేటాయించారు. హరీష్‌ ‌రావు, కేటీఆర్‌కు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పటివరకు 85 వేల కోట్లు బిల్లులు చెల్లించింది నిజం కాదా?  కాళేశ్వరం ద్వారా ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి రూ. 45 వేలు ఖర్చవుతుంది. కాళేశ్వరం నిర్వహణకు ఏటా 25 వేల కోట్లు ఖర్చు చేయాల్సి పరిస్థితి. తెలంగాణ వనరులను మింగే తెల్ల ఏనుగు కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇవన్నీ మేం చెప్పింది కాదు.. కాగ్‌ ‌చెప్పిందే. చిత్తశుద్ధి ఉంటే కాగ్‌ ‌నివేదికపై హరీష్‌, ‌కేటీఆర్‌ ‌చర్చకు రావాలి..ప్రాజెక్టుకు కావాల్సిన 90 వేల ఎకరాల్లో కోసం ఇప్పటి వరకు 64 వేల ఎకరాలే సేకరించారు..మరో 20 వేల ఏకరాలకుపైగా సేకరించాల్సి ఉంది. కానీ రీడిజైన్‌ ‌తర్వాత ఆయకట్టు ప్రాంతం ఏమాత్రం పెరగలేదు’’ అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

‘‘ రాహుల్‌ ‌ను విమర్శించడమంటే హరీష్‌, ‌కేటీఆర్‌ ఒకరిపై ఒకరు కాండ్రించి ఉమ్మేసుకున్నట్లే. మీరు దోపిడీ దొంగలు, బందిపోటు దొంగల కంటే హీనం..నిన్నటి ఖమ్మం సభ చూసైనా బుద్ది తెచ్చుకోండి. బీఆరెస్‌ం‌బీజేపీ బైబై ’’ అని రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ‘‘బీఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ విధానం ఏమిటో చెప్పాలి. బీఆరెస్‌ అం‌టేనే బీజేపీ రిస్తాదార్‌ ‌సమితి అని మా నాయకుడు నిన్ననే చెప్పారు. బీఆరెస్‌ను మాతో కలుపుకోమని మా నాయకుడు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ ఉం‌డే ఏ వేదికను కూడా పంచుకోం. మా విధానం ఏంటో మేం చెప్పాం. మా విధానం చెబితే మీకు నొప్పేంటి. మీ విధానం ఏంటో మీరు చెప్పండి.’’ అని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించినా రూ.4000 పెన్షన్‌కు కాంగ్రెస్‌ ‌కట్టుబడి ఉందన్నారు రేవంత్‌ ‌రెడ్డి. కేసీఆర్‌ అవినీతిని ఆపితే చాలు మొత్తం 55 లక్షల మంది పెన్షన్‌ ‌దారులకు కాంగ్రెస్‌ ‌హామీ ఇచ్చిన విధంగా పెన్షన్‌ ఇవ్వొచ్చు అన్నారు. తెలంగాణ ఇచినట్లే.. రూ.4000 పెన్షన్‌ ఇచ్చి తీరతామన్నారు.

వొచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను రానివ్వం. మేము చెబుతున్న ప్రతి ఒక్క హామీని 100 శాతం నెరవేరుస్తామన్నారు.. గతంలో పెన్షన్‌ ‌రూ. 75 మాత్రమే ఉండేది, దానిని రూ. 200 చేసిన ఘనత మాదే అన్న విషయం మర్చిపోకండి అంటూ రేవంత్‌ ‌రెడ్డి గుర్తు చేశాడు. నిన్న ఖమ్మం సభలో మేము ఇచ్చిన పెన్షన్‌ ‌హామీని ససేమిరా అమలు చేసి తీరుతాం అన్నాడు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం బాగా పెరిగింది…ఇపుడు పెన్షన్‌ ‌ను రూ. 4000 కు పెంచడం పెద్ద కష్టం కాదన్నారు.  కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రల్లో 4 వేల పెన్షన్‌ ఇవ్వడం లేదన్నా బీఆర్‌ఎస్‌ ‌నేతల వ్యాఖ్యలకు రేవంత్‌ ‌రెడ్డి కౌంటరిచ్చారు.  ‘‘కర్ణాటక అమలు చేస్తున్న పథకాలు తెలంగాణలో లేవు. ఛత్తీస్‌ ‌గడ్‌ ‌మాదిరిగా ఇక్కడ ధాన్యాన్ని కొనడం లేదు. కాబట్టి ఆయా రాష్ట్రాల జనాభా అవసరాలు, పరిస్థితులను బట్టే పథకాలు ఉంటాయి. రాష్ట్ర ఆదాయం ఆధారంగానే ప్రాధాన్యతలు ఉంటాయి. తెలంగాణలో మా ప్రాధాన్యత రూ.4000 పెన్షన్‌ ఇవ్వడం’’  అన్నారు రేవంత్‌ ‌రెడ్డి. బెంగుళూరులో జరిగే ప్రతిపక్షాల సమావేశానికి బీఆరెస్‌ను రానివ్వం..ఒకవేళ సిగ్గులేకుండా వొచ్చినా..బీఆరెస్‌ను మెడలు పట్టి గెంటేస్తామన్నారు రేవంత్‌ ‌రెడ్డి.

‘‘ఎట్‌ ‌హోమ్‌ ‌కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. ఈ కంపెనీలో కల్వకుంట్ల కవిత భర్త, జోగినిపల్లి సంతోష్‌ ‌రావు డైరైక్టర్లు. తర్వాత ఈ కంపెనీలో కల్వకుంట్ల శైలిమ, తేలుకుంట్ల శ్రీధర్‌ ‌డైరెక్టర్లుగా చేరారు. ఐటీ తర్వాత ఈడీ వొస్తుందనే భయంతోనే కేటీఆర్‌ ‌దిల్లీకి వెళ్లారు. ఈడీ అమిత్‌ ‌షా పరిధిలోకి వొస్తుంది. ఇందుకు కాకుంటే ఏ అభివృద్ధి కోసం కలిశారో ఏ వినతి పత్రాలు సమర్పించారో వాటిని బయటపెట్టాలని’’ అని రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు..

Leave a Reply