Take a fresh look at your lifestyle.

విభిన్న సంస్కృతులకు నిలయం పటాన్ చెరు 

అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలే
ప్రతి ఒక్కరి రక్షణ, అభివృద్ధి మా లక్ష్యం
ప్రతి ప్రభుత్వ పథకంలోనూ సమ ప్రాధాన్యత
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: మినీ ఇండియా గా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ బిడ్డలేనని, ప్రతి ఒక్కరి సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం, ఛట్ పూజ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణ శివారులోని ఎల్లంకి కళాశాల సమీపంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భోజ్ పూరి నటుడు కేసరి లాల్ యాదవ్, గాయకురాలు అక్షరా సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అందరిని ఉర్రూతలూగించింది.నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాశ మైలారం, రామచంద్రాపురం, బొల్లారం, పటాన్చెరు తదితర పారిశ్రామిక వాడలతోపాటు ఆయా పట్టణాల్లో నివసిస్తున్న ఉత్తర్ ప్రదేశ్ ఝార్ఖండ్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరాంచల్ తదితర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ప్రజలు తమ అభిమాన నటుడి ప్రత్యక్ష సంగీత విభావరిని తిలకించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వేల సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఉర్రూతలూగించింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ…  వేలాదిమంది ఉత్తర భారతీయులతో కలిసి వేదిక పంచుకోవడం సంతోషకరంగా ఉందన్నారు.ఉన్న ఊరిని విడిచిపెట్టి.. జీవనోపాధి కోసం పటాన్ చెరు నియోజకవర్గానికి తరలివచ్చిన ప్రతి ఉత్తర భారతీయుడిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు.ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తక్షణమే అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా కేసరి లాల్ యాదవ్, అక్షర సింగ్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మనోజ్ కుమార్, సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, శంకర్ యాదవ్, సపాన దేవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం విక్రమ్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సందీప్ షా, జై కిషన్, రవి, సంజయ్ సింగ్, వినోద్, తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply