Take a fresh look at your lifestyle.

భూముల అమ్మకంపై..విడ్డురంగా విపక్షాల వ్యాఖ్యలు

  • ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ
  • దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ..గోదావరి, సింగూరూ జలాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు
  • సంగమేశ్వర ‘లిప్ట్’ ‌సర్వే పనులనుప్రారంభించిన మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను సర్కారు విక్రయించాలని నిర్ణయించిన నేపథ్యంలో.. విపక్షాల వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు సర్వే పనులను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎత్తిపోతల ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని, 60, 70 రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ ‌తయారు చేయాలని అధికారులను కోరుతున్నానన్నారు. రూ.16 కోట్లతో సంగమేశ్వర, రూ.11 కోట్లతో బసవేశ్వర సర్వే పనులు చేపడుతున్నామన్నారు.భూములమ్మితే అధికారంలోకి వొచ్చాక మళ్లీ తీసుకుంటామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ‌సర్కారు 88,500 ఎకరాలు అమ్మిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. గురివింద గింజ తరహాలో భట్టి ఆరోపణలున్నాయన్నారు. భూముల విక్రయం అత్యంత పారదర్శకంగా జరుగుతోందని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు. భూములు అమ్మితే వొచ్చిన ఆదాయంతో పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని, ఇలా కాకూడదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా ? అని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్‌ ‌కోసం ప్రభుత్వం నెలకు రూ.900 కోట్లు ఖర్చు పెడుతున్నదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసిందని హరీశ్‌రావు అన్నారు. మీరు అమ్మిన దాంట్లో 40 శాతం మీకే ఇస్తామని పోటి పెట్టిందని ఆయన చెప్పారు. కేంద్రం బీహెచ్‌ఈఎల్‌, ఆర్డినెన్స్ ‌ఫ్యాక్టరీ భూములు అమ్మకానికి పెట్టిందన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంటున్నదని అన్నారు. పెట్టుబడుల ద్వారా బలహీన వర్గాలు రిజర్వేషన్లు కోల్పోతాయని చెప్పారు. కేంద్రం తరహాలో రాష్ట్రం పన్నులు పెంచలేదన్నారు. ఏడాదిలో 43 సార్లు పెట్రోలు ధరలు పెంచిందని ఆయన ఆక్షేపించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎంపీలు బీబీ పాటిల్‌, ‌కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్‌,‌గూడెం మహిపాల్‌ ‌రెడ్డి, మానిక్‌ ‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఫరీ దొద్దీన్‌ ‌మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌, ‌డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌మల్కాపురం శివకుమార్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ..గోదావరి, సింగూరూ జలాలతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం
దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం మారిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ శివారులో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం లింగంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ అన్ని విధాల రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. జిల్లా మొత్తం సస్యశ్యామలం చేయడానికి సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. కాలేశ్వరం నీళ్లను సింగూర్‌కు తేవాలని, సింగూర్‌ ‌ద్వారా సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి, ఆందోల్‌, ‌జహీరాబాద్‌ ‌నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందన్నారు. బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ద్వారా నారాయణఖేడ్‌ ‌నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాల సర్వే పనుల కొరకు ప్రభుత్వం రూ. 27 కోట్లు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా కరువు జిల్లాగా ఉండేదని, తాగు సాగు నీరు లేక ప్రజలు రైతులు చాలా కష్టాలు పడ్డారన్నారు. ముఖ్యమంత్రికి జిల్లాపై, ఈ ప్రాంత పరిస్థితులపై పూర్తి అవగాహన ఉందన్నారు.

సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 మండలాల్లోని 230 గ్రామాలకు సాగునీరు అందుతుందన్నారు. 60-70 రోజుల లోపు డిపిఆర్‌ ‌తయారు చేయాలని ఇరిగేషన్‌ ‌శాఖ చీఫ్‌ ఇం‌జనీర్‌కు సూచించారు. 70 రోజుల్లోపు సర్వే పనులు పూర్తిచేసి నిధులు మంజూరు చేసి ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. కాళే•శ్వరం నీటిని నారాయణఖేడ్‌ ‌నియోజకవర్గం కర్ణాటక సరిహద్దు చివరి గ్రామం వరకు అందిస్తామన్నారు. ఈ నెల 15 నుండి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అవుతాయన్నారు. కొరోనా వొచ్చి ప్రభుత్వ ఆదాయం తగ్గినా రైతు ప్రయోజనాలను యథావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. రైతు కోసం రైతు బీమా ఇచ్చిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదన్నారు. రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలు మాగాణిగా మార్చాలన్నదే లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క యాసంగిలోనే 90 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వానాకాలం యాసంగి కలిపి సుమారు 2.20 కోట్ల క్వింటాళ్ల ధాన్యం పండిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, బీబీ పాటిల్‌, ‌శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ ‌భూపాల్‌ ‌రెడ్డి, శాసనసభ్యులు క్రాంతి కిరణ్‌, ‌మాణిక్‌ ‌రావు, గూడెం మహిపాల్‌ ‌రెడ్డి, జగ్గారెడ్డి , జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌మంజుశ్రీ, జిల్లా కలెక్టర్‌ ‌హనుమంతరావు, అదనపు కలెక్టర్‌ ‌వీరారెడ్డి, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్‌, ‌మాజీ ఎంఎల్‌ ‌సి ఫరీరుద్దీన్‌, ‌డీసీఎంఎస్‌ ‌చైర్మన్‌ ‌మల్కాపురం శివకుమార్‌, ‌మార్క్ ‌ఫెడ్‌ ‌చైర్మన్‌ ‌జగన్మోన్‌ ‌రెడ్డి, చీఫ్‌ ఇం‌జనీర్‌ అజయ్‌ ‌కుమార్‌, ఆయా మండల ప్రజాప్రతినిధులు, సర్పంచులు, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply