Take a fresh look at your lifestyle.

కొనసాగిన వాయిదాల పర్వం

వరుసగా మూడరోజూ దద్దరిల్లిన పార్లమెంట్‌ ఉభయసభలు
జిఎస్టీ, ఆర్థిక ద్రవ్యోల్బణంపై చర్చకు విపక్షాల పట్టు
పార్లమెంటు గాంధీ విగ్రహం ముందు విపక్షాల నిరసన ధర్నా

న్యూ దిల్లీ, జూలై 20 : పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. తొలి రోజు నుంచే ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మూడో రోజూ జీఎస్టీ రేట్ల పెంపుపై పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఉభయసభలు నేటికి వాయిదా పడ్డాయి. వరుసగా మూడోరోజు బుధవారం కూడా పార్లమెంట్‌లో విపక్షాల నిరసనలు కొనసాగాయి. ధరల పెరుగుదలను నిరసిస్తూ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. పార్లమెంట్‌ ‌బయట సైతం నిరసనలు కొనసాగించారు. ఈ క్రమంలో రాజ్యసభ మొదట మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. లోక్‌సభలోనూ నిరసనలు హోరెత్తడం వల్ల.. సభను మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ‌ప్రకటించారు. సభను వాయిదా వేసే ముందు..ఎంపీల తీరుపై స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సభ నిర్వహించేది చర్చల కోసమేకానీ, నినాదాల కోసం కాదని హితవు పలికారు. ప్రజలు సభల నుంచి చర్చలు ఆశిస్తున్నారన్నారు. సభ్యులు గొడవ చేస్తూ సభ పరువు తీస్తున్నారు.

రచ్చ చేస్తున్న సభ్యుల తీరు పార్లమెంటరీ సంప్రదాయాలకు భంగం కలిగిస్తుంది. అంశాల వారీ చర్చల కోసం నిబంధనల ప్రకారం సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. జీరో అవర్‌లో ఏదైనా అంశాన్ని లేవనెత్తడానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. సభలో ఆందోళన చేయడానికి, అలజడి సృష్టించడాన్ని అనుమతించను. సభ్యులు సీటులోకి వెళ్తే మాట్లాడే అవకాశం ఇస్తా’ అని స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా పేర్కొన్నారు. అయితే, సభ్యులు తమ ఆందోళనపై వెనక్కి తగ్గలేదు. దీంతో సభ వాయిదా వేయక తప్పలేదు. మరోవైపు, పార్లమెంట్‌ ఆవరణలో విపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనకు దిగారు. ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం ముందు బ్యానర్లు ప్రదర్శిస్తూ బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు కూడా మరోసారి గళమెత్తారు.

పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ‌సహా ఇతర ఎంపీలతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు ఆందోళన నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ ‌పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్‌ ‌ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Leave a Reply