వివరాలు వెల్లడించిన ఏఎస్పీ డా. వినీత్
భద్రాచలం,జూలై 26 (ప్రజాతంత్ర ప్రతినిధి) : భద్రాచలం పోలీసులు అక్రమ గంజాయి రవాణా కు చెక్ పెట్టారు. 42 లక్షలకు పైగా విలువ చేసే 214 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఏఎస్పీ డా.వినీత్ తెలిపారు.సోమవారం నాడు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 02.00 గంటలకు, సాయంత్రం 6గంటల సమయంలో భద్రాచలం పట్టణ ఎస్.ఐ ఎస్. మధు ప్రసాద్ సిబ్బంది కలిసి ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక వెర్నా కారు ఏపి 28 ఎడబ్ల్యూ 4469, ఒక స్కోడా కారు ఏపి 16 బిజి 7777 నెంబర్ గల వాహనాలలో, ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తూ కనిపించారని వారి వాహనాల్ని తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ తనిఖీ లో వీరి వద్ద 214 కేజీల గంజాయి లభించిందని దీని విలువ సుమారు 42,80లక్షల రూపాయలుగా ఉండునని ఏఎస్పీ పేర్కొన్నారు. ముద్దాయిలను విచారించగా వారి పేర్లు 1.సర్దార్ రాథోడ్ 2.అంజిత్ , 3. నాగ సుందర్, 4. ఉమేష్ 5. కామరాజు మునియప్ప , అని వీరు సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రానికి చెందినవారని చెప్పినట్లు ఏఎస్పీ వెల్లడించారు.వీరు ఈ గంజాయిని ధారకొండ, సీలేరు ప్రాంతాల నుండి హైదరాబాద్, బెంగుళూరు కు తీసుకు వెళ్తున్నారని చెప్పినట్లు నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు