Take a fresh look at your lifestyle.

ఎన్నికల తర్వాత గజ్వేల్‌లోనే ఉంటా… మీతోనే గడుపుతా..

  • కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు
  • చేయాల్సింది ఇంకా ఉంది…లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు…కావాలని పట్టుపట్టాలి
  • బీఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌ఖాయం…95 నుండి 105 స్థానాలు గెలుస్తాం
  • గజ్వేల్‌ ‌నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్‌
  • ‌కేసీఆర్‌ ‌రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని బిడ్డలు తనను కడుపులో పెట్టుకుని రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనీ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత, సిఎం, గజ్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వొచ్చే అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం సికింద్రాబాద్‌-‌సిద్ధిపేట రాజీవ్‌ ‌రహదారిపైన గల అంతాయపల్లి ఎస్‌ఎన్‌ఆర్‌ ‌పుష్ప ఫంక్షన్‌ ‌హాలులో జరిగిన గజ్వేల్‌ ‌నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌ ‌పార్టీ శ్రేణుల విస్తృత సమావేశంలో సిఎం కేసీఆర్‌ ‌పాల్గొని మాట్లాడుతూ…తాను కామారెడ్డిలో పోటీ చేయడానికి ఓ కారణం ఉందని, నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో తాను చేపిస్తానని. వొచ్చే టర్మ్‌లో తాను నెలకు ఒక్కపూట గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోనే ఉంటానని….వారితోనే గడుపుతానని కెసిఆర్‌ అన్నారు. గజ్వేల్‌లో కొంత చేశామని, చేయాల్సింది ఇంకా ఉదనీ, ఇదే చాలనీ లీడర్లు ఊరుకోవద్దని, ఇంకా కావాలని పట్టుపట్టాలన్నారు.

గజ్వేల్‌కు ఇంకా చేయాలన్నారు. పదవులు వొస్తాయి, పోతాయని, ఉన్నప్పుడు ఏం చేశారనేది ముఖ్యమని అన్నారు. తాను ఒక్కసారే ఒడిపోయానని, అప్పుడు కూడా ఓడిపోలేదని, ఓడించపడ్డానని…అప్పుడు ఎలక్ట్రానిక్‌ ‌మిషన్లు లేకుండెనని, బ్యాలెట్‌ ‌పేపర్‌ ఉం‌డడంతో 6 వోట్లతో ఓడించారన్నారు. ఊర్లలోకి మిషన్‌ ‌భగీరథ నీళ్లు వొస్తున్నాయనీ, ఊర్లో మోటర్‌ ‌లేదు కానీ నీళ్లు వొస్తున్నాయనీ, ఊర్లో మోటర్‌ ‌లేదు…సంపూ లేదు కానీ, నీళ్లు మాత్రం వొస్తున్నాయన్నారు. దానికి ప్రేరణ సిద్ధిపేట ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పుడు సిద్ధిపేటలో భయంకరమైన కరువు ఉండేదనీ, అప్పుడు ఆలోచన చేసి మిడ్‌మానేరు నుండి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సరఫరా చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చామనీ, అదే తరహాలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్‌ ‌భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామన్నారు. ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన బిందెలతో ప్రదర్శనలు ఉండేవనీ, ఇప్పుడు ఎక్కడ అలాంటి పరిస్థితి లేదన్నారు. తెలంగాణ వొచ్చిన రోజు చెట్టుకు ఒక్కరూ..గుట్టకు ఒక్కరు అయ్యారనీ, మహబూబ్‌నగర్‌తోపాటు ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేదనీ, వ్యవసాయ స్థిరీకరణ జరిగితే వలసలు అగుతాయనీ ఆలోచన చేశానని అన్నారు.

ఇప్పుడు వలసలు వాపసు వొచ్చి అద్భుతంగా వ్యవసాయ రంగం పురోగమించిందనీ, అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. వీటన్నింటి నుండి బయటకు రావాంటే ఎలా అని, ఆ దుఃఖం నుండి బయటకు ఎలా రావాలని ఎంతో ఆలోచన చేశాననీ, ఎంతో మంది ఆర్థిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడి చర్యలు చేపట్టిన తర్వాతే వ్యవసాయ స్థిరీకరణ జరిగిందన్నారు. కొరోనాతో కొంత ఆర్ధిక ఇబ్బందులు వొచ్చాయనీ, రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయనీ, తనకు కూడా కొరోనా వొచ్చిందనీ, కొరోనా అట్లంటా, ఇట్లంటా అని భయంకర వార్తలు మీడియాలో రాశారన్నారు. 24 ఏండ్ల క్రితం ఒక్కణ్ణే బయల్దేరి వెళ్లానని, ఆనాడు కొంత మంది మిత్రులను కూర్చుండి మన బ్రతుకు ఇంతేనా అని బాధ పడేవాళ్లమన్నారు. ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేది కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉండేదని అన్నారు. ఎక్కడ చూసినా చిమ్మని చీకటి, ఎవరిని కదిలించినా మన బ్రతుకులు ఇట్లున్నాయి అనే ఆవేదన ఉండేదన్నారు. తాను 10వ తరగతి చదువుతున్న సమయంలో జిల్లా కేంద్రం సంగారెడ్డికి పోవాలంటే ఐదారు గంటల సమయం పట్టేదనీ, మంజీర నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్‌ ‌వేసినా నీళ్లు రాని పరిస్థితి ఉండేదన్నారు.

అప్పుడు కరెంటు ట్రాన్స్‌ఫార్మర్‌ ‌కాలిపోతే ఒక్కో బాయికి 2, 3 వేల రూపాయలు వేసుకొని బాగు చేయించే పరిస్థితి ఉండేదన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ‌దగ్గరకు 27 మంది ఎమ్మెల్యేల సంతకాలు చేయించుకొని వెళ్లాననీ, కానీ అప్పటి విద్యుత్‌ ‌సంస్థల ఛైర్మన్‌ అన్ని ఒప్పుకుంటా కానీ స్లాబ్‌ ‌మాత్రం చేంజ్‌ ‌చేయమని చెప్పారన్నారు. కానీ, గట్టిగా పట్టిపడితే స్లాబ్‌ ‌చేంజ్‌ ‌చేశారన్నారు. ఆనాడు కరెంటు బిల్లు పెంచమని చెప్పి చంద్రబాబు మోసం చేశారని, ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని అన్నారు. కొంతమందితో కలిసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి ముందుకు వెళ్లాననీ, అప్పుడు తనతో ఎవరూ కలిసి రాలేదనీ, తాను వొస్తే కూడా దాక్కున్నారన్నారు. ఏమైతేనేమి చివరకు తెలంగాణను సాధించుకున్నామన్నారు. ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టుల నిర్మాణం వల్ల భూములు పోయిన వారి బాధ చాలా పెద్దదనీ, తనకు కూడా ఆ బాధ ఉందనీ, తన భూమి కూడా పోయిందన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇవాళ కొండపోచమ్మ సాగర్‌, ‌మల్లన్న సాగర్‌ ‌కింద భూములు కోల్పోయారని, వారికి యావత్‌ ‌రైతాంగం ఋణపడి ఉంటుందన్నారు. ఇండియాలో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణలో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయనీ, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్‌తోనే సాధ్యమైందన్నారు. మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నామనీ, అయినా కాంగ్రెసోళ్లు, టిజెఎస్‌ ‌ఛైర్మన్‌ ‌కోదండరామ్‌ ‌లాంటి వాళ్లు అడ్డుకున్నారనీ, రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాలనీ, రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందామన్నారు. గజ్వేల్‌లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నామనీ, మనం గెలుచుడు కాదు పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను గెలిపించాలన్నారు. అభివృద్ధి ఆగొద్దంటే మళ్లీ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ గెలవాలనీ, ఈ ఎన్నికల్లో 95 నుండి 105 స్థానాలు గెలుస్తున్నామనీ, దాంట్లో తనకు డౌట్‌ ‌లేదనీ సిఎం కేసీఆర్‌ అన్నారు.

కేసీఆర్‌ ‌రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు
నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కొత్త చరిత్ర సృష్టిస్తారనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌, ‌రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌హ్యాట్రిక్‌ ‌సాధించడం పక్కా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌ ‌నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..గజ్వేల్‌ ‌నియోజకవర్గంను ఎంతో అభివృద్ధి చేసిన సిఎం కేసీఆర్‌ ‌రుణం తీర్చుకోవాలంటే రాష్ట్రంలోని అతి ఎక్కువ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గజ్వేల్‌కు రైల్వే స్టేషన్‌ ‌తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేననీ, ప్రభుత్వ హాస్పిటల్స్ ఇప్పుడు గజ్వేల్‌లో నిర్మాణం చేసుకున్నామనీ, దీంతో ఇప్పుడు ఎవరూ కూడా ప్రయివేట్‌ ‌దవాఖానాలకు వెళ్లడం లేదన్నారు. ఇవాళ కూడవెళ్లి వాగు, హల్దీవాగు నిండు కుండల్లా నీళ్లు ఎప్పుడు ఉంటున్నాయన్నారు.

గతంలో నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారనీ, గజ్వేల్‌కు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే తాను రాజీనామా చేస్తా అని కేసీఆర్‌ ‌చెప్పారని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇచ్చి చూపారన్నారు. ఏ కార్యక్రమమైనా మొదట గజ్వేల్‌లో చేసి తరువాత రాష్ట్రం మొత్తం అమలు చేశారన్నారు. ఇవాళ అనేక గ్రామాల్లో మూకుమ్మడిగా తమ వోటు కారుకు, కేసీఆర్‌కు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారనీ, రానున్న 35 రోజులు బాగా కష్టపడి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపిద్దామన్నారు. గజ్వేల్‌లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వొస్తుందన్నారు. మిషన్‌ ‌భగీరథ కార్యక్రమంను ప్రధాని నరేంద్ర మోదీ చేత ప్రారంభం చేయించుకున్నామనీ, అదే మిషన్‌ ‌భగీరథ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశానికి రోల్‌ ‌మోడల్‌ ‌గజ్వేల్‌ ‌నియోజకవర్గం అన్నారు. ఇంటిగ్రేటెడ్‌ ‌మార్కెట్‌, ‌పునరుద్ధరణ చేసిన అడవులు, మిషన్‌ ‌భగీరథ కార్యక్రమం చూసేందుకు ఇవాళ దేశంలో అనేక మంది ఇక్కడకు వొస్తున్నారనీ, ఇవాళ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నామనీ, 3500కోట్ల రూపాయల వడ్లు పండిస్తున్నారనీ మంత్రి హరీష్‌రావు అన్నారు.

Leave a Reply