గ్రామ సింహాలు అంటే శునకరాజాలే.. అదేనండి కుక్కలు. వీటి గురించి మాట్లాడాల్సి వస్తే విశ్వాసానికి ప్రతీక అనడంలో అతిశయోక్తి కానే కాదు. ఎన్నో నేర పరిశోధనల్లో శిక్షణ పొందిన కుక్కలు నేరస్థులను పసిగట్టడంలోని విశ్వసనీయత అద్భుతమని నిరూపించాయి. అంతే కాదు, ప్రకృతి బీభత్సాలను ముందే అంచనావేయడంలో మేటి కాదనలేం కదా.. విశ్వాస ఘాతకులను తిట్టేటప్పుడు జనం ఏంట్రా.. కుక్క కున్న విశ్వాసం కూడా లేదు కదరా! అని సంబోధిస్తారు. వాస్తవంగా కూడా విశ్వాసంలో కుక్కను మించిన జీవి లేదు. ఇలా మనిషితో ఉన్న ‘‘బంధానికి’’ అది కరిస్తే వచ్చే ‘‘రేబిస్’’ జబ్బు వల్ల ఏర్పడే భయంతో విశ్వాసంలో కాస్త అగాధం ఏర్పడుతుంది. జీవవైవిధ్యంలో సమస్త జీవులు ఈ భూమి మీద జీవించాల్సిందే. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని జనాభా మాదిరిగానే సంఖ్యను తగ్గించడంతో పాటు వాటికి వచ్చిన జబ్బులకు వైద్యం అందించడం నియంత్రణకు శస్త్రచికిత్సలు చేయడం లాంటివి విస్మరిస్తున్నందు వల్లనే సమస్యలు ఉత్పన్నమౌతున్నాయనేది జంతు ప్రేమికులు గమనించాలి.
ఏ జీవిని సమూలంగా నిర్మూలించాలనేది వ్యాసంలోని ఉద్దేశం కాదు. పల్లె- పట్నం ,వాడ-కాలనీలు అనే తేడా లేకుండా 20-30 సంఖ్యలో వీధి కుక్కలు, కోతులు సంచరిస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో వీధి కుక్కలు విచ్చలవిడిగా దాడి చేస్తూ గాయపరుస్తున్నాయి. వైద్యశాఖ గణాంకాల మేరకు మన రాష్ట్రంలో గత ఏడాది జనవరి నుండి నవంబర్ వరకు 1,68,367 మంది కుక్క కాటుకు లోనవ్వడం జరిగింది. అలాగే కేవలం మన హైదరాబాదు నగరంలోనే సుమారు 6.5 లక్షల కుక్కలు ఉన్నట్టు, అవి రోజుకు సుమారు 400 మందిని కాటు వేస్తున్నట్లు తెలుస్తుంది. అలాంటి బాధితులు యాంటీ రేబిస్ సూది మందు కోసం వస్తున్నారంటే? పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో గమనించాలి. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్( ఐపిఎం) గణాంకాల ద్వారా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటికి తోడు కోతుల, పాముకాటు బెడద అంచనాలకు అధికమేనని తెలుస్తుంది. వాటి బారిన పడిన వారిలో ప్రైవేటు చికిత్స పొందుతున్న వారు అధికమేననీ ఓ అంచనాలో తెలుస్తుంది.
ఇలా రాష్ట్ర మొత్తం మీద అత్యధిక కుక్క కాటు కేసులు హైదరాబాద్ లొనే 17,361 నమోదు కాగా, వాటిలో పెంపుడు కుక్కల కాటు కారణంగా 29 శాతం మంది, వీధి కుక్కల కాటుతో 71 శాతం మంది గాయపడుతున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలతో పాటు కోతుల బాధితుల సంఖ్య పెరుగుతుంది. గత ఏడాది నవంబర్ నాటికి వీటి కారణంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు సుమారు 2లక్షల పైగానే ఉన్నారు. దీనికి తోడుగా పాము కాటు కేసులు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో ఉంటున్నాయి.లి లినియంత్రణలి లిరాష్ట్రంలో వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతున్నా కూడా నగర, పుర పాలక, గ్రామపంచాయతీలు వీటిని నిరోధించడంలో ఆశించిన శ్రద్ధ కనబరచడం లేదు. లివీటిని పట్టుకునే సుశిక్షితులైన సిబ్బంది కొరత, వాటిని తీసుకెళ్లి అడవి ప్రాంతంలో వదిలివేయుటకు కావలసిన వాహనాల కొరత ఉంది లివీటి సంతాన నియంత్రణ చర్యలు అంతంత మాత్రమే. ఒక హైదరాబాదులోనే సుమారు 6.5 లక్షల కుక్కలున్నట్లు అంచనా.. వీటికి సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించాల్సి ఉంది. ఈ చర్యలు లేకపోవడంతో వాటి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. శివారు ప్రాంతాల కుక్కలు వలస రావడంతో కూడా వీటి సంఖ్య పెరిగిపోతున్నట్లు జిహెచ్‌ఎంసి అధికార వర్గాలు చెబుతున్నాయి.
మందులను అందుబాటులోకి తేవాలి.. కుక్క ,పాము కాటు మందులను బాధితు(ప్రజ)లకు అందుబాటులోకి తెచ్చి ప్రాణ నష్టం జరగకుండా, ప్రమాదాల బారిన పడకుండా వారిని రక్షించాలి. ప్రభుత్వం చెపుతున్న వివరాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా అన్ని స్థాయిల్లో ఔషధా(మందు)లు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం రూ, 4,14,79,142 విలువైన1,25,405 డోసుల యాంటీ రేబిస్ ఇంజక్షన్లు ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే రూ,19,91,574 విలువైన 9,147 డోసుల పాము కాటు ఇంజక్షన్లు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కుక్క కాటు గాయాన్ని కట్లు కట్టవద్దు. రేబిస్ వైరస్ నాడి వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. మెదడు వాపునకు గురిచేస్తుంది. దీనితో బాధిత వ్యక్తి ప్రాణాపాయంలో పడిపోతాడు. కుక్క కరవగానే అది పెంపుడుదా! కాదా అనేది గమనించాలి. పెంపుడుదైతే దానికి యాంటీ రేబిస్ టీకా వేయించారో లేదో తెలుసుకోవాలి. అది వేస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కుక్కను ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు చేయకపోయినా కరిస్తే దాన్ని అనుమానించాలి.
గాయాన్ని ధారాళంగా కారే మంచినీటితో శుభ్రపరచాలి. ఎట్టి పరిస్థితుల్లోను యాంటీసెప్టిక్ లోషన్లు, క్రీములు పూయరాదు. పసుపు లాంటివి పెట్టి కట్లు కట్టరాదు. ఆ గాయాన్ని తెరిచి ఉంచాలి. కరిచిన వెంటనే లేదా ఒక రోజులో యాక్టివ్ ఇమ్యూనైజేషన్ టీకాను ఇప్పించాలి. వైద్యులు నిర్దేశించిన టీకా డోసులు తీసుకున్నప్పటికీ, తప్పకుండా పాసివ్ ఇమ్యునై జేషన్ టీకాను ఇప్పించాలి. ఈ టీకాను గాయం ఉన్నచోట వేస్తారు. కుక్క కాటు బాధితుల్లోలి పురుషులు 65 శాతం, మహిళలు 35 శాతం ఉంటున్నారు. అలాగే పాముకాటు బాధితులు 1-10 ఏళ్ళు 18శాతం, 11-20ఏళ్లు 28 శాతం, 21-30ఏళ్లు 32 శాతం, 31-40ఏళ్లు15శాతం ఆపై వయసు వారు7 శాతం ఉంటున్నారు. గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకులి లిఅత్యధిక కుక్కకాటు కేసులు నమోదైన జిల్లాలులి హైదరాబాద్ 17,361. నల్లగొండ 16,374. మేడ్చల్ మల్కాజిగిరి 12,629. కరీంనగర్10,785. నిజామాబాద్ 9,850 .ఖమ్మం 9,359. సూర్యాపేట 8,721. మహబూబ్ నగర్ 7,857. సంగారెడ్డి 7,705. సిద్దిపేట 7,651గా ఉన్నారు.
రేబిస్ ఉన్న కుక్కల లక్షణాలు
సాధారణంగా ఆ కుక్కలు ఒంటరిగా ఉంటాయి. చొంగ కారుస్తుంటాయి. కళ్ళు తేలేస్తుంటాయి. నీళ్లు అంటే భయపడుతుంటాయి. వాటికి ఎదురుగా ఏది కనబడదు.పై లక్షణాలున్న కుక్కల పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా పాముకాటు కేసులు 4,895 నమోదు కాగా అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 629 నమోదైనాయి. పాము కరిస్తే విష సర్పమైతే రెండు కాట్లు, సాధారణ సర్పమైతే కాట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. పాము కాటు బాధితులను వీలైనంత త్వరగా పాముకాటు విరుగుడు మందులను ‘‘యాంటీ స్నేక్ వినమ్’’ ఇస్తే ప్రాణాపాయం నుంచి రక్షించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కుక్క, పాముకాటుల నుండి ప్రజలను రక్షించడానికి ఆ మేరకు ఔషధా(మందు)లు అందుబాటులో ఉంచి సత్వర చికిత్స అందించాలి. మరో వైపు కోతుల బెడద కూడా అన్ని ప్రాంతాల్లో పెరిగిపోతుంది. వీటి బారి నుండి ప్రజలను కాపాడుటకు చర్యలు పెంచాల్సి ఉంది. కుక్కల నియంత్రణకు(శస్త్ర చికిత్స )చేస్తూ పెంపుడు కుక్కలను వీధి కుక్కలను సంబంధిత వైద్యశాఖలను అప్రమత్త పరిచి వాటి ఆరోగ్యాన్ని రక్షించాలి. ప్రజలను వాటి బారిన పడకుండా చూడాలి. అప్పుడే ‘‘కుక్కకు- మనిషికి మధ్య విశ్వాసం’’ అనేది పెరుగుతుంది. రాష్ట్రంలోని గ్రామపంచాయతీ నుండి నగర, పట్టణ ప్రాంతాల సంబంధిత శాఖలను చైతన్యపరిచి వీటి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాలదే..
– మేకిరి దామోదర్, సోషల్ అనలిస్ట్, వరంగల్, 9573666650