Take a fresh look at your lifestyle.

భారీగా పెరిగిన చికెన్‌ ‌ధరలు…

చికెన్‌ ‌ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. కాదు, కాదూ చికెన్‌ ‌ధర కొండెక్కి కూర్చున్నది. పెరిగిన కోడి మాంసం ధరను చూసిన వినియోగదారులు షాక్‌కు గురౌతున్నారు. గత రెండు నెలల కిందట సిద్ధిపేట జిల్లా మార్కెట్‌లో కిలో చికెన్‌ ‌ధర 50-60రూపాయల వరకు విక్రయించారు. కానీ, ప్రస్తుతానికి మాత్రం చికెన్‌ ‌ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గత నెలకు పోల్చుకుంటే ప్రస్తుతం చికెన్‌ ‌ధర అమాంతం 200రూపాయలకు పెరిగింది. గత నెలలో కేజీ చికెన్‌ను 50రూపాయలకు అమ్మిన చికెన్‌దారులు ప్రస్తుతం కిలో చికెన్‌ను 240రూపాయలకు అమ్ముతున్నారు. కొరోనా వైరస్‌ ‌నుంచి బయట పడాలంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని ఈ మేరకు తగిన పోషకాహారం తీసుకోవాలని వైద్యులు, ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పడంతోనే చాలా మంది చికెన్‌ ‌తినేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. కొరోనా భయంతో గత నెల రోజుల కిందట సిద్ధిపేట జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కిలో స్కిన్‌లెస్‌ ‌చికెన్‌ను 40 నుంచి 60రూపాయలకు విక్రయించారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్ల నిర్వహణ భారం కావడంతో సదరు కోళ్లఫాంల యజమానులు ఉచితంగానే కోళ్లను పంచి పెట్టారు కూడా. గుడ్డు ధర కూడా 3రూపాయల చిల్లర పలికింది. ప్రస్తుతం గుడ్డ ధర కూడా నాలుగైదు రూపాయలకు చేరింది.

అయితే, చికెన్‌ ‌గుడ్డు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ రాష్ట్ర ప్రభుత్వాధినేతనే చెప్పడంతో చికెన్‌, ‌గుడ్డుకు ధరలు గణనీయంగా పెరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే,గత ఫిబ్రవరి నెలలో 170 నుంచి 180రూపాయల వరకు కోడి మాంసం ధర పలికింది. అయితే, ఎప్పుడైతే కరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందుతుందన్న ప్రచారం మొదలైందో అప్పటి నుంచి కోడి మాంసం ధర 180రూపాయల నుంచి 150 రూపాయలు, 100రూపాయలు, 80రూపాయలు, 60 రూపాయలు మొదలుకుని ఏకంగా 50రూపాయలకు పడిపోయింది. మార్చి నెలలో దాదాపుగా కిలో కోడి మాంసం ధర సిద్ధిపేట మార్కెట్‌లో 50రూపాయలుగానే ఉంది. 50రూపాయలకు అమ్మినా కొనేవారే కరువయ్యారు. కొందరు పౌల్ట్రీ యజమానులు 2 కిలోల కోడిని సైతం 50రూపాయలకు ఇచ్చినప్పటికీ కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనికి కారణం కరోనా వైరస్‌. ‌కోడి చికెన్‌ ‌తినడం వల్ల కరోనా వైరస్‌ ‌మరింత వ్యాప్తి చెందుతుందన్న భయంతో మాంసం ప్రియులెవరూ కూడా చికెన్‌ ‌తినే సాహసం చేయలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా కోడి మాంసం ధర పడిపోయినప్పటికీ…కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. సిద్ధిపేటలో సడన్‌గా చికెన్‌ ‌ధర మరలా పెరిగాయి. ఏకంగా 240రూపాయలకు చేరింది. 50రూపాయల నుంచి 240రూపాయలకు చేరడం వల్ల చికెన్‌ ‌కోసం వెళ్లిన వారు ఒకింత షాక్‌కు గురవుతున్నారు. సిద్ధిపేటలోని చికెన్‌ ‌సెంటర్‌ ‌యజమానులు కోడి మాంసం ధరలను గణనీయంగా పెంచినప్పటికీ…గిరాకీ మాత్రం బాగానే ఉంటున్నట్లు సమాచారం.

Leave a Reply