Take a fresh look at your lifestyle.

షాహీన్‌బాగ్‌…

“షాహీన్‌ ‌బాగ్‌ ‌స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆడోళ్ళ మీద జరిగే అన్ని రకాల రాజ్య హింసను ఎదిరించే వైతాళిక గీతం కావాలె! గోధ్రా రైలు ఢిల్లీ దాంక తేవాలని కుట్ర జేషేటోళ్ళ సంగతేందో దేశానికి ఎరుక జేయకుంటె రేపటికల్ల మిగతా అన్ని రాష్ట్రాలల్ల ప్రయోగాలు జేయకమానరనే ముందుసూపు తోనుండాలె! మైనారిటీ దళితులు చేయి చేయి కలిపి నడిషే ఉద్దెమాలన్నింటికి షాహీన్‌ ‌బాగ్‌ ‌ముఖచిత్రమై నిలువాలె! నిర్భయ, దిశ చట్టాలన్ని ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పుట్టినయే గని ఆచరణ క్రమంలో కోర్టులు, న్యాయాన్ని గుప్పిట్ల పెట్టుకున్న మనువాదుల చట్టాలే తీర్పులు జెప్పబట్టినయన్న ఎరుక పెంచుకోవాలె! ఆడోళ్ళను ఆట బొమ్మలుగ జూషే మనుధర్మ రాజ్జాన్ని నిలేషి నిలదీయాలె!”

shahinbaghరాజకీయం జెండాలేం లేకుంట జనంగోరిన ఎజెండాల కోసం పదిమంది మహిళలు కూడి పిడికెళ్ళెత్తిన జాగ షాహిన్‌ ‌బాగ్‌. ఆరేడేళ్ళ అమ్మాయిల కాన్నించి అరవై, డెబ్బయ్యేళ్ళ అమ్మమ్మల దాంక నడుంగట్టిన షాహీన్‌ ‌బాగ్‌ ఇప్పుడు మనువాద వ్యతిరేక యుద్ధ శిబిరమైంది. ఆ పేరిప్పుడు ఏలికల గుండెల్లో గుచ్చుకున్న తుపాకీ గుండయ్యింది. వాళ్ళు ఒకే గొంతుకై ఇచ్చే పోరు నినాదానికి లచ్చలమంది మహిళలు పిడికిలెత్తి జైగొట్టుడు దునియా మొత్తం ఇనవడ్డది. దేశానికి ఇది పెద్ద ఆరిష్టమనబట్టిండ్లు మనువాదులు. దేశభక్తికి బీటలు వారే అతి పెద్ద ప్రమాదమనబట్టిండ్లు..ఏలికలు. గుళ్ళు, మసీదులు కూలగొడ్తె ‘‘దేశభక్తి’’ అనుకునే రామరాజ్జంల శాంతియుతంగ కూసోని నినాదాలిచ్చుడు, పాటలు పాడుకునుడు, పసిపోరల ఉయ్యాలలూపుడు దేశద్రోహంలాగ కానచ్చి పాలకులకు గుబులు కాబట్టె! పాలకులకు గింతగనం గుబులై కాళ్ళ కింద తడిషిందంటె ఉద్దెమం మీద దేశద్రోహం ముద్రేసుడే ఆలిషెం. ఎందుకంటె షాహిన్‌ ‌బాగ్‌ ఉద్దెమం ఇత్తనమై దేశమంత పారకముందే మొలుక తీర్గున్నప్పుడే పీకాలని మనుధర్మం జెప్పినట్టున్నది.

yelamanda article prajatantranews‘‘ఆకాశంల సగం’’ అనే పాతకాలం ముచ్చట గని, జరంత సందైతె సాలు ఆడోళ్ళు ‘‘ఆకాశం నుంచి భూమి’’ దాంక ఏలి జూపుతరని మనువాదులకే జప్పున సమజయింది! అప్పటి ‘క్లారా జెట్కిన్‌’ ‌నుంచి ‘చిట్యాల ఐలవ్వ’ దాంక మర్లవడ్డ ఆడోళ్ళందరి ధైర్నాన్నంతా కలగలిపి నిల్సున్న వీర షాహీన్‌ ‌బాగ్‌ ‌పోరుకు ముందుగాల ఓ దండం బెట్టాలె! ఢిల్లీ గుండెల మీద నెత్తుటి సంతకం జేషిన సంఘపరివారపోళ్ళను, వాళ్ళకు కావలి కాయవట్టిన ఇనుపబూట్ల సప్పుళ్ళను సవాలు జేయబట్టిన షాహీన్‌ ‌బాగ్‌ ‘‌శాంతి’పోరాటం మహిళాఉద్యమాల చరిత్రల ఏగుచుక్కయిందనాలె! ఎముకలు కొర్కవట్టిన సలిల సూత మనువాద ఏలికలకు చెమటలు బట్టించిన మన ఆడోళ్ళ తెగువను దిక్కు దిక్కులు అందుకోవాలె! అంతర్జాతీయ ఆడోళ్ళ దినం రోజున గింతకంటె మంచి ముచ్చటేమున్నది.

మునుపు నాలుగు కాళ్ళ మీద నడిషిన జంతువు రొండుకాళ్ళ తోని నడిషినంక మనిషన్నరు. ఎన్నుపూస బొక్కసక్కగై, మాట్లాడుడు మొదలు జేషినంక సూత మనిషి మునుపటి జంతు లచ్చనాలు ఇంకా మరువకుంటున్నడు. కన్న నలుసునే తినజూషే జంతువు తీర్గయ్యిండు. పురుటి నొప్పులువడి పాణం పోషే ఆడజాతిని ఆటబోమ్మోలిగె జూషే కాడికచ్చింది. ఆధునిక సంస్కృతని మాగొప్పగ అనుకునుడే గని ఆడోళ్ళ కాడికచ్చేటాలకు దీని పునాదులన్ని ఆనాటి మనుధర్మం తీర్గనే కాన్రాబట్టె! ఆధునిక మన్వులు రాజ్జెమేలిన కాన్నించి మనిషిధర్మం మంట్లె గలిషి, మనువు ధర్మమే నడువబట్టింది. పెనివిటి కట్టెయి కాలితె ఎంబడి ‘ఆమె’ను సూత బుగ్గి జేషేటి సతిమంటల ‘సావు’ రంగు, రూపు జరంత అటిటయింది. ఇష్టం లేదంటె పిట్రోల్‌ ‌పోసుడు, మోజు తీర్చకుంటె బుగ్గిజేసుడు, యాటలు కోషే కత్తులతోని గొంతులు కోసుడు, యాసిడు పోసుడు గిట్లనే నడువబట్టినంక మారిందేంలేదని అనాలె గద! ఏలికలు మారబట్టిండ్లు గని యెంబటున్న మనుధర్మపు తీరైతె మారలే! ఏండ్లుమారినా ఆడోళ్ళను మాత్రం మొగోళ్ళకు ‘‘పని’’ కచ్చే వస్తువుతీర్గనే అందరు సూడవట్టిండ్లు. లోకం తీరు సూత వంత పాడ్తానట్నే కాలవడ్డది.

కడుపుల పడ్డ కాన్నుంచి కాటికి పోయెదాంక, బతుకేందుకు అడుగడుగున పోరాటం జేషే ఆడోళ్ళకు షాహీన్‌ ‌బాగ్‌ ‌మొదటిదీ కాదు. ఆఖరిది సూత కాదు. అస్తిత్వానికి అడ్డువడ్డ అడుగడుగున పోరుజెండెత్తిన ఆడోళ్ళకు సవాళ్ళు కొత్త కాదు. సంఘ పరివారం రాజ్జెమేలే కాడ మనుధర్మానికి ఎదురొడ్డి నిల్వకుంటె ఉనికికే ప్రమాదమని తెల్వనోళ్ళేం కాదు. నిర్భంధాలకు జడిషి యెనుకడుగేషిన చరిత్ర సూత లేదు. మతం లెక్కలేషి మనుషుల్ని ఇడదీషేటి కుటిలబాజి ఖానూన్‌లను నిలదీషేటి షాహీన్‌ ‌బాగ్‌ ఇప్పుడు మన దేశం నుదుటి తిలకమైంది. అన్ని రకాల హింసను ఎదుర్కునే కాడ మతం పరదాలు అడ్డు తొలిగిపొయినయి. మైనారిటీ సామాజిక వర్గాల మహిళలు కలిసి పోరు జెండెత్తుడు తోని మనుధర్మ వాదుల కుర్చీల కింద కాళ్ళు లుకలుక మంటానయి. గుజరాత్‌ ‌మాదిరి ఢిల్లీలో నడిపించే కుట్రకు తెరలేపిన ఉపన్యాసాలు నెత్తుటేరులు పారించి బెదిరిచ్చినా గుబులు వడకుంట శాంతి గీతం పాడింది షాహీన్‌ ‌బాగ్‌. ‘‘‌గోలీ మారో సాలోంకో’’ పిలుపునిచ్చిన వి’ద్వేశభక్తుల’కు గానీ, ‘జాగా ఖాలీ జేయకుంటె తిప్పలుంటదన’ మైక్‌ ‌బెదిరింపులకు గానీ, రాళ్ళదాడులకు, పిట్రోల్‌ ‌బాంబులకు గానీ, తలొంచని షాహీన్‌ ‌బాగ్‌ ఇప్పుడు మనందరికి కొత్త దారిజూప బట్టింది. ఢిల్లీరోడ్ల మీద పారిన నెత్తుటి మడు గులు పోరాటాన్ని ఏ మాత్రం నీరు కార్చలేక పోయాయి, పైగా దమనకాండను దునుమాడాలని పిలుపునిచ్చి మరింత పదునెక్కిచ్చింది.

రొండు మతాల నడిమిట్ల లొల్లిగ దేశమంత జూపెట్టేందుకు మనువాదుల మీడియా మాగనే తిప్పలు వడ్డదికని బయిటి దేశాల మీడియోళ్ళు మాత్రం ‘‘తామరపూల’’తమాషాను బరువాత జూపెట్టి బాగనే ఇజ్జత్‌ ‌తీషింది. మైనారిటీ, దళిత, సామాజిక వర్గాలకు చెందిన మహిళల శాంతిపోరాటం షాహీన్‌ ‌బాగ్‌ ‌లక్ష్యంగా జరిగిన నెత్తుటిదాడుల సారమేందో లోకమంత తెలిషెటట్టు జెప్పిన వేరేదేశాల మీడియా ముందు మనువాదం బోర్ల బొక్కల వడ్డది. షాహీన్‌ ‌బాగ్‌ ‌స్ఫూర్తిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆడోళ్ళ మీద జరిగే అన్ని రకాల రాజ్య హింసను ఎదిరించే వైతాళిక గీతం కావాలె! గోధ్రా రైలు ఢిల్లీ దాంక తేవాలని కుట్ర జేషేటోళ్ళ సంగతేందో దేశానికి ఎరుక జేయకుంటె రేపటికల్ల మిగతా అన్ని రాష్ట్రాలల్ల ప్రయోగాలు జేయకమానరనేముందుసూపు తోనుండాలె! మైనారిటీ దళితులు చేయి చేయి కలిపి నడిషే ఉద్దెమాలన్నింటికి షాహీన్‌ ‌బాగ్‌ ‌ముఖచిత్రమై నిలువాలె! నిర్భయ, దిశ చట్టాలన్ని ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పుట్టినయే గని ఆచరణ క్రమంలో కోర్టులు, న్యాయాన్ని గుప్పిట్ల పెట్టుకున్న మనువాదుల చట్టాలే తీర్పులు జెప్పబట్టినయన్న ఎరుక పెంచుకోవాలె! ఆడోళ్ళను ఆట బొమ్మలుగ జూషే మనుధర్మ రాజ్జాన్ని నిలేషి నిలదీయాలె!

సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్!
‌డెబ్బయి యేండ్ల తరువాత ఎవలు యేడ బుట్టిండ్లో, ఏ దేశపు పౌరులో లెక్కలు కొత్తంగ రాయాల్సిన అవుసరం ఏందుకచ్చింది? ‘‘మా పుట్టుకే మా చిరునామా’’ అని పాటలు పాడుకుంట శాంతి పోరాటం జేషే మహిళల షాహీన్‌ ‌బాగ్‌ ‌జూషి సర్కార్‌ ‌గంతగనం గుబులు పడుడెందుకు కావచ్చు? ఇనుడే, కాదు, అడిగిన దానికి జవాబులు సూత జెప్పాలె! లేకుంటే నీ పౌరసత్వం సంగతి బయటికెళ్ళాలె! అని బెదిరియ్య బట్టిన భేతాళుని శవాన్ని ఎప్పటి తీరింగనే భుజానేసుకోని ‘‘ఇను! భేతాళ్‌! ‌రొండోసారి గెలిషినంక దేశంల ఇంకో మతం లేకుంట యేరిపారేయ్యాలనే లక్ష్యంతోని సిఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌.‌లాంటి చట్టాలు ముందుకచ్చినయి. దేశచరిత్రల ఏ పోరాటంల సూత మహిళల పాత్ర తక్కువేం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. పది, పదిహేను మంది తోని మొదలయి మొలక మానైనట్టు లక్షలాది మందిని ఉద్యమదారి బట్టించిన శాంతిపోరాటమె గని మనువాదుల గుండెల్లో అశాంతిని రగిల్చి భయం రంగు రూపులను జూపెట్టింది షాహీన్‌ ‌బాగ్‌. అం‌దుకే అన్ని రకాల హింసాకాండకు పాల్పడి అంతర్జాతీయవేదికపై ఇజ్జత్‌ ‌పోగొట్టుకున్నది’’ అని జెప్పుకుంట నడ్వబట్టిండు…నడ్వబట్టిండు.
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply