Take a fresh look at your lifestyle.

ఒక సారి అవకాశమివ్వండి 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 16: ప్రజలే నా వసుధైక కుటుంబమని ఎమ్మెల్యేగా నేను గెలిస్తే నా కుటుంబ సభ్యుల్లాంటి మీరంతా గెలిచినట్లేనని, మన పాలన కోసం  మన ఓట్లు మనమే వేసుకుందామని  పటాన్ చెరు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. రామచంద్రపురం, భారతినగర్  డివిజన్ లలోని శ్రీనివాస్ నగర్ కాలనీ, పాత రామచంద్రపురం, కాశిరెడ్డిపల్లి కాలనీ, బాంబే కాలనీ, ఈఎస్ఐ కాలనీ, రంగనాధ్ పురం కాలనీ, పలు కాలనీలలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తానను గెలిపిస్తే చేసే అభివృద్ధి హామీలతో పాటు బీఎస్పీ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు.ఈ సందర్బంగా కాలనిలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రచారంలో భాగంగా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ బడుగుల జీవితాల్లో వెలుగులని నింపుతూ మన బహుజనుల  ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని అన్నారు. మనల్ని కొందరు నాయకులు కేవలం ఓటు బ్యాంకు గా మాత్రమే చూస్తూ మన ఆత్మ గౌరవాన్ని  నోట్ల కట్టాలతో కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే నోట్లతో మా బహుజన సబ్బండ వర్గాల ఆత్మగౌరవాన్ని కొనడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. మనం ఒక్కటిగా పోరాడి చట్ట సభల్లో ప్రవేశిస్తే మనలో నుంచి చాలా మంది మన ప్రాంతాలలో అన్ని స్థాయిల్లో మన బహుజన బిడ్డలు నాయకులుగా ఎదిగే అవకాశం లభిస్తుందని తెలిపారు.మనం ఎదిగితే మన ప్రాంతల్ని మనమే అన్ని రంగాల్లో ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. మన అభివృద్ధి కోసం ఒక్క సారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలని కోరారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన క్షణం నుంచి ఈ ప్రాంత అభివృద్దికి పని చేస్తానన్నారు. ముఖ్యంగా రామచంద్ర పురం ప్రాంతంలో ఇండ్లు లేని నిరు పేదలకు విడతల వారిగా పక్క ఇండ్లు కట్టిస్తానని భరోసా ఇచ్చారు.వర్ష కాలంలో చాలా కాలనీలు ముంపుకు గురవుతున్నాయని, తన దృష్టికి వచ్చిందని, తాను గెలిస్తే  ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళిక బద్దంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. రోజు వారీ కూలి పనులు చేసుకునే నా అన్న తమ్ముళ్లు, అక్క చెల్లెలకు వృత్తి నైపుణ్య కేంద్రలా ద్వారా శిక్షణానిచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.రామచంద్రపురంలోని ఐటీఐ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొస్తానని ప్రకటించారు.నా ప్రయాణంలో నా వెంట నడుస్తున్న సబ్బండ వర్గాల ప్రజలందరికీ ఋణపడి ఉంటానన్నారు.ఈ కార్యక్రమంలో పార్టి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply