Take a fresh look at your lifestyle.

సిఎం పదవి రాష్ట్ర ప్రజలు పెట్టిన భిక్ష

  • జానారెడ్డి 30ఏళ్లలో ఏం చేశారు?
  • పదవుల కోసం పట్టుకు వేళ్లాడింది వారే
  • తృణప్రాయంగా వొదిలేసిన చరిత్ర మాది
  • అభివృద్దిని చూసి వోటేయండి
  • సాగర్‌ ఉప ఎన్నిక ప్రచార సభలో సిఎం కెసిఆర్
  • ఆలోచించి వోటేయాలని పిలుపు

తనకు రాష్ట్ర సీఎం పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని…జానారెడ్డి పెట్టిన భిక్ష ఎలా అవుతుందని సీఎం కెసిఆర్‌ ‌నిలదీశారు. అసలు ఆయనకా అవకాశం వొస్తే నాకు సిఎం పదవి ఇస్తాడా..ఆయనే లాగేసుకుంటాడు కదా అని అన్నారు. సాగర్‌ ఉప ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా హాలియాలో టీఆర్‌ఎస్‌ ‌నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు జానారెడ్డే సీఎం పదవి భిక్ష పెట్టాడని కొందరు అర్థంపర్థం లేని మాటలు అంటున్నారని ఆయన విమర్శించారు. తనకు సీఎం పదవిని ప్రజలే ఇచ్చారని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం తానే పదవులు విసిరి పారేశానని కేసీఆర్‌ ‌పునరుద్ఘాటించారు.

పదవుల కోసం తెలంగాణను వదిలేసింది కాంగ్రెస్సేనని కేసీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ కోసం పదవులను వొదిలేసింది కేవలం టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ‌నేతలు పదవులు పట్టుకుని వేలాడితే పదవులను గడ్డిపోచల్లా వొదులుకున్నామని అన్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ ‌పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డిపై కేసీఆర్‌ ‌విమర్శలు చేశారు. ‘రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యమంత్రి పదవి భిక్ష పెట్టారు. జానారెడ్డి కాదు. తెలంగాణ ఉద్యమంలో పదవులు గడ్డి పోసల్లా వొదిలేశాం. పదవుల కోసం తెలంగాణను వొదిలిపెట్టింది కాంగ్రెస్‌. ‌తెలంగాణ కోసం చాలాసార్లు రాజీనామా చేశాం. కాంగ్రెస్‌ ‌నాయకులు చక్కగా ఉంటే ఎందుకు గులాబీ జెండా ఎగరాల్సి వొచ్చింది. ఈ సభ జరగకూడదని ప్రతిపక్షాలు చేయని ప్రయత్నం లేదు. ఎవరైనా సభలు పెట్టుకోవడం ప్రజాస్వామ్యంలో భాగం.

ఎవరెన్ని చెప్పినా ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి. గాడిదలకు గడ్డి వేసి ఆవులకు పాలు పిండితే కుదరదు. వాస్తవాలన్నీ మి కళ్ల ముందే ఉన్నాయి. ఎవరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో మికు తెలుసు. సాగర్‌లో భగత్‌ ‌గాలి బాగానే ఉందని అర్థమైంది. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. గత పాలకులు తిరుమలగిరి మండలాన్ని ఆగం చేశారు. వోటు వేసే ముందు న్యాయం ఎవరివైపు ఉందో ఆలోచించాలి. నాగార్జున సాగర్‌లో సంక్షేమ పథకాలు అందడంలేదా?. పైరవీలు లేకుండా పాలన సాగిస్తున్నాం.’ అని కేసీఆర్‌ అన్నారు. నాగార్జున సాగర్‌కు జానారెడ్డి ఏమి చేయలేదన్నారు. కాంగ్రెస్‌ ‌హయాంలో పేదలను పట్టించుకోలేదని తెలిపారు. జానారెడ్డి మాట్లాడితే 30 ఏళ్ల చరిత్ర అంటాడని విమర్శించారు. జానారెడ్డి.. నందికొండ మున్సిపాలిటీని అనాథను చేశాడని వ్యాఖ్యానించారు. 30 ఏళ్లలో నాగార్జునసాగర్‌కు డిగ్రీ కాలేజీకి దిక్కులేదని ఎద్దేవా చేశారు.

నోముల భగత్‌కు ఏవిధంగా వోట్లు వేస్తారో అదే విధంగా నెల్లికల్లు లిప్ట్ ‌నీళ్లు కూడా దూకుతాయని కేసీఆర్‌ ‌హామి ఇచ్చారు. గత పాలకులు వొదిలేసిన తిరుమలగిరి సాగర్‌ ‌లిప్ట్‌ను భిక్షమెత్తైనా సరే ఒక్కటిన్నర ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. నందికొండ మున్సిపాలిటీలో స్థలాల సమస్యను పరిష్కరిస్తామన్నారు. నాగార్జున సాగర్‌కు డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని కేసీఆర్‌ ‌హామి ఇచ్చారు. అరవై ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్‌ ‌నాయకులు నాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పెన్షన్లు రూ. 200 ఇస్తే.. తాము ఆసరా పెన్షన్ల కింద ఒక్కో లబ్దిదారుడికి రూ. 2016 ఇస్తున్నామని తెలిపారు. ‘గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా వస్తలేదా, కల్యాణలక్ష్మి వస్తలేదా. గతంలో ఇవన్నీ ఉండేనా. గతంలో రైతు చనిపోతే పరిహారం ఇచ్చే విషయంలో కూడా దారుణాలు చేసేవారు. ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాం.

ఏ పైరవీ లేకుండా ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్టేష్రన్‌ ‌చకచకా జరిగిపోతుంది. ధరణి పోర్టల్‌తో చరిత్ర సృష్టించామన్నారు. ప్లోరైడ్‌తో బాధపడుతున్న ఈ జిల్లాకు మిషన్‌ ‌భగీరథ నీళ్లు తీసుకొచ్చాం. ఏమాయేనే నల్లగొండ.. ఏడుపే నీ గుండె నిండా అని నేనే పాట రాశాను. ఈ 30 ఏండ్ల చరిత్రలో జానారెడ్డి ఏం చేయలేదు. కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వలేదు. ఇవాళ మిషన్‌ ‌భగీరథ ద్వారా వచ్చే నల్లా నీళ్లలో మికు కేసీఆర్‌ ‌కనబడుత లేడా. 60 ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్‌ ‌నాయకులు నాశనం చేశారు. ఇప్పుడు కరెంటు సమస్య లేదు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం’ అని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్‌ ‌తెలిపారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే కాంగ్రెస్‌ ‌నాయకులే కారణం అని స్పష్టం చేశారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసింది తెలంగాణ. ఆంధ్రా 29 లక్షలతో మూడో స్థానంలో ఉందన్నారు. ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రమైంది అని సీఎం స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఎంసీ కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా చేస్తానని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. భగత్‌ ‌గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏందో చూపిస్తా. సాగర్‌ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామన్నారు. ఈ మధ్య కాలంలో మంజూరు చేసిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే భవిష్యత్‌ ఎన్నికల్లో ఓట్లు అడగము అని స్పష్టం చేశారు. ఈ జనాన్ని చూస్తుంటే భగత్‌ ‌గెలుపు ఖాయమైపోయింనద్నారు. హాలియాలో షాదీఖానా తప్పకుండా కట్టిస్తామన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగురేయండి అని సాగర్‌ ‌ప్రజలకు సీఎం కేసీఆర్‌ ‌విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రులు జగదీశ్వర్‌ ‌రెడ్డి,తలసాని శ్రీనివాసయాదవ్‌, అభ్యర్థి నోముల భగత్‌, ‌పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply