(నేడు వానమామలై వరదాచార్యులు వర్ధంతి)
ఈయన పాండిత్య ప్రతిభను గుర్తించి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా నిజామాబాద్ జిల్లా దోమకొండ జనతాకళాశాలలో వరదాచార్యులను సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకునిగా నియమించారు. అనంతరం ఈయన ఆంధ్ర సారస్వత పరిషత్తునుండి విశారద పట్టా పొంది, చెన్నూర్ ఉన్నత పాఠశాలకు బదిలీ అయి 13 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి 1972లో పదవీ విరమణ చేశారు. చెన్నూరు తో ఏర్పడిన అనుబంధంతో అక్కడ ఒక వేదపాఠశాల నెలకొల్పారు. నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు చొరవ, ప్రత్యేక ఆసక్తితో 1972 లో ఈయన శాసనమండలికి నామినేట్ అయి 1978 వరకు సభ్యునిగా కొనసాగారు. వరదాచార్యుల ప్రతిభ 13వయేటనే గుభాళించి పద్య రచన ప్రారంభించారు. 64పైగా రచనలు చేశారు. 1945లో మొదట మణిమాల (పద్యగేయకృతి) తో రచనలు మొదలై, ఆహ్వానము, శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం, పోతన చరిత్రము (మహాకావ్యము), జయధ్వజం, విప్రలబ్ధ (గేయ కథా కావ్యం), స్తోత్ర రత్నావళి (అనువాద కావ్యం), భోగినీ లాస్యం (వ్యాఖ్యానం), గీత రామాయణం (అనువాద గేయ కావ్యం)….వంటి బహుళ రచనలు చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్నారు.
