Take a fresh look at your lifestyle.

వరి వద్దంటున్న ప్రభుత్వం – ఆందోళనలో అన్నదాతలు

“తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ ‌రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం వల్లే తాము కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ తప్పిదమనే అంటున్నారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర మంత్రులు రైతులను కోరారు. కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు వరికి బదులు ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన ఉధృతం చేస్తున్నాయి.”

తెలంగాణలో యాసంగిలో వరి వేయవద్దు,ప్రభుత్వం కొనలేదని, బదనాం వద్దు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి తేల్చి చెప్పడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వ్యవసాయశాఖ మంత్రిగా యాసంగి పంటల సాగుపై ఆయన ప్రభుత్వ వైఖరి వెల్లడించారు. ప్రభుత్వ ప్రకటన వివాదాస్పదమవుతోంది. రైతులను నట్టేట ముంచేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేస్తోందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు మాట్లాడుతూ కేంద్రం వైఖరి వల్లే ఈ విధమైన ప్రకటన చేయాల్సి వస్తోందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ ‌రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం వల్లే తాము కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వ తప్పిదమనే అంటున్నారు. యాసంగిలో వరికి బదులు ఇతర పంటలు వేసుకోవాలని రాష్ట్ర మంత్రులు రైతులను కోరారు.కానీ ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ వైఖరి వల్ల రైతులు వరికి బదులు ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన ఉధృతం చేస్తున్నాయి.

భారీగా వరి సాగు

మన రాష్ట్రంలో అవసరాలకు మించి వరి సాగవుతుంది. రెండు సీజన్లలో కలిపి ముప్పై లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే మన అవసరాలకు సరిపోతుంది. కానీ.. కోటి ఎకరాలకు పైగా పండిస్తున్నారు. అందువల్ల వరి ధాన్యం ఎక్కువగా మిగులుతుంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా వానాకాలంలో భారీగా సాగు జరుగుతోంది. గత ఏడాది వానాకాలంలో 53.84 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. యాసంగిలోనూ ఏకంగా 52.79 లక్షల ఎకరాల్లో వరి వేశారు. రెండు సీజన్లలో కలిపి కోటి ఎకరాలకుపైగా వరి సాగు చేయగా.. ఒక్క ఏడాదిలోనే రెండున్నర కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. వానాకాలం సీజన్‌లో ఉత్పత్తి అవుతున్న సుమారు కోటీ 25 లక్షల టన్నుల ధాన్యంతోనే.. మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల అవసరాలు తీరుతాయి. యాసంగిలో ఉత్పత్తయ్యే మరో కోటీ 25 లక్షల టన్నుల ధాన్యం అదనంగా ఉంటోంది.

ఈ ధాన్యాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వం కొనేది. కానీ.. రెండేళ్లుగా మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా వరి బాగానే పండింది. అందువల్ల కేంద్రం దగ్గర కూడా అవసరానికి మించిన నిల్వలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎంత పండిస్తే అంత కేంద్రం కొనే పరిస్థితి లేదు. గతంలో ఏ బియ్యమైనా, ఎంతైనా ఎఫ్‌సీఐ కొనేది. ఇప్పుడు బాయిల్డ్ ‌రైస్‌ ‌వద్దని తేల్చి చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే బాయిల్డ్ ‌రైస్‌ ‌నిల్వలు పెరిగిపోయాయి. మన దగ్గర నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బాయిల్డ్ ‌రైస్‌ ఎగుమతి అయ్యేది. కానీ.. ఇప్పుడు వాళ్ల దగ్గర కూడా ప్రొడక్షన్‌ ‌పెరిగింది. కాబట్టి ఇంతకుముందులా దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు.

లిప్రత్యామ్నాయ పంటలపై రైతులకు మేలు కలిగేలా స్పష్టమైన విధానం రూపొందించాలి
వరి తగ్గించి ఇతర పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం అనుకుంటే.. దానికి తగ్గట్టు విధానాలను రూపొందించాలి. అంతేకానీ.. ప్రత్యామ్నాయ మార్గాలు చూపించకుండానే వరి సాగు ఆపేయాలని చెబితే రైతులకు ఇబ్బందులు తప్పవు. వరి వద్దంటున్నారు కాబట్టి.. రాష్ట్రానికి అవసరమయ్యే, రైతులకు లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలను ప్రభుత్వమే సూచించాలి. వరి ఎందుకు వద్దంటున్నారో తెలిసేలా ప్రతి రైతుకు అవగాహన కల్పించాలి. ప్రత్యామ్నాయ పంటల మీద వచ్చే లాభాల గురించి స్పష్టత ఇవ్వాలి. అవసరమైతే ప్రభుత్వమే మేలు రకం విత్తనాలను అందుబాటులోకి తీసుకురావాలి. సాగు పద్ధతులపై సలహాలు ఇవ్వాలి. రైతు పండించిన ధాన్యానికి మద్ధతు ధర ఇవ్వాలి. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. అయినా.. రైతులు నష్టపోతారనుకంటే ఇన్సెంటివ్‌లు ఇవ్వాలి.యాసంగి వరి వేయకూడదని తెగేసి చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటల కోసం విత్తనాలను ఉచితంగా అందించాలి. అదేవిధంగా గ్రామాలలో ఆరుతడి పంటలను వేసుకుంటే కోతుల బెడద, మరియు పందుల బెడద వల్ల పంట నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని కూడా పంటల బీమా కింద పరిగణించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి.

– పిన్నింటి బాలాజీ రావు హనుమకొండ
9866776286

Leave a Reply