Take a fresh look at your lifestyle.

‘‘‌సామాన్యుడు – మాన్యుడు – అసామాన్యుడు’’

“ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్న ఆకాంక్షతో 1930లో కాళోజీ గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. 25 సంవత్సరాల వయసులో సత్యాగ్రహోద్య మంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. 1940లో గవిచర్లకి చెందిన రుక్మిణీ బాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప్‌ ‌రెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వంటి వారితో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించి సమ్మె చేయించారు. తెలంగాణలో అక్షర జ్యోతిని వెలిగించాలని ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన వారిలో ఈయన ఒకరు.”

నేడు కాళోజీ 107 వ జయంతి సందర్భంగా…..

నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు  సంఘర్షించనీ’’ అని మావో చెప్పినట్లు ‘‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’’ తీసుకు వచ్చిన  తెలంగాణ ఉద్యమ నిప్పు కణిక, కాలే కడుపులు, రగిలే గుండెలను చూసి చుర కత్తి లాంటి కవితలతో ఉద్యమ సమరశంఖం పూరించిన కలం వీరుడు కాళోజి.  సమాజ గొడవను తన గొడవగా మలుచుకుని ‘‘నా గొడవ’’ పేరుతో కవితలు రాసిన నిరంతర సత్యాగ్రహి, సమరశీలి, ‘‘నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని ,రేపటి జ్ఞాపకాన్ని’’ అని చెప్పిన తెలంగాణ ప్రజల ఉద్యమ ప్రతిధ్వని, రాజకీయ చైతన్యాల సమాహారం, హక్కులు అడిగిన ఉద్యమకారుడు, తెలంగాణ వైతాళికుడు కాళోజీ జయంతి – తెలంగాణ భాషా  దినోత్సవ  సమయాన కాళోజీ జీవిత విశేషాలను తెలుసుకుందాం..
 అన్యాయాన్నెదిరిస్తే
నాగొడవకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నా గొడవకు ముక్తి ప్రాప్తి
అన్యాయాన్నెదిరించినోడు
నాకు ఆరాధ్యుడు…
అంటూ సమాజ గొడవను తన గొడవగా  మలుచుకున్న కవి ఆయన. కాళోజి పూర్తి పేరు రఘువీర్‌ ‌నారాయణ్‌ ‌లక్ష్మీకాంత్‌ ‌శ్రీనివాసా రాం రాజా కాళోజి…  మొదటి ప్రపంచ యుద్ధంతో తాను పుట్టింది 1914 సెప్టెంబర్‌ 9 అని చెప్పేవారు.  కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్‌ ‌జిల్లా, రట్టిహళ్ళి గ్రామంలో రమాబాయమ్మ, రంగారావు దంపతులకు ఆయన జన్మించారు. తల్లి కన్నడిగుల ఆడపడచు, తండ్రి మహారాష్ట్రీయుడు. కాళోజీ కుటుంబం చిన్నతనంలో కొన్నేళ్ళు మహారాష్ట్రలోని సాయిరామ్‌ ‌లో, కొంతకాలం తెలంగాణ ఇల్లందు తాలూకా కారేపల్లిలో నివసించింది. 1917 వరకు ఆ కుటుంబం హనుమకొండలో గడిపి, తర్వాత మడికొండలో స్థిరపడింది. కాళోజి 7 నెలల వయస్సులో  తల్లి రామబాయమ్మ మరణించగా ఏడు నెలల వయసులో అన్న భుజాన ఎక్కీన తాను 80 ఏళ్ళ వయసులో కూడా ఆయన్నే ఆసరగా చేసుకొని ఉన్నానని చమత్కరించేవారు. ప్రాథమిక విద్య మడికొండలో పూర్తి చేసి తరువాత అన్నతో పాటు హైదరాబాద్‌ ‌చేరుకుని పాతబస్తీలోని చౌమహల్లా కాన్గి బడిలో సెకండ్‌ ‌ఫారం, తర్వాత సుల్తాన్‌ ‌బజార్‌ ‌రెసిడెన్సీ మిడిల్‌  ‌స్కూల్లో చదివారు. 1934 ఏప్రిల్‌  ‌లో వరంగల్‌ ‌కాలేజియేట్‌ ‌హైస్కూలులో మెట్రిక్యులేషను పూర్తిచేశారు. 1939లో హైదరాబాద్‌ ‌న్యాయ కళాశాల నుండి పట్టా పొందారు.
ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాలన్న ఆకాంక్షతో 1930లో కాళోజీ గ్రంథాలయోద్యమంలో పాల్గొన్నారు. 25 సంవత్సరాల వయసులో సత్యాగ్రహోద్య మంలో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.”
1940లో గవిచర్లకి చెందిన రుక్మిణీ బాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప్‌ ‌రెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వంటి వారితో అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించి సమ్మె చేయించారు. తెలంగాణలో అక్షర జ్యోతిని వెలిగించాలని ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన వారిలో ఈయన ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945 లో పరిషత్తు ద్వితీయ మహాసభలనునిర్వహణలో కాళోజీ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. వరంగల్‌ ‌కోటలో జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రయత్నించి నగర బహిష్కరణ శిక్షకు గురయ్యారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా వ్యవహరించారు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. నిర్భయంగా మాట్లాడడం ఆయన స్వభావం.   1948లో వరంగల్‌ ‌సెంట్రల్‌ ‌జైలులో ఉన్నప్పుడు బురుజు మీద ఉన్న పోలీస్‌ ఒక రాత్రి ‘‘ మిమ్మల్ని తుపాకీతో కాల్చి చంపిన పాపం లేదని’’  అంతే, కాళోజీ అతని దగ్గరకు పోయి  ధైర్యం ఉంటే కాల్చవోయ్‌ అని సవాల్‌ ‌చేసారు. . ఆయన నిర్భీతి ధైర్యసాహసాలకు అది ఉదాహరణ. హక్కుల కోసం ప్రతి నిమిషం పోరాటాన్ని శ్వాసించి, కవిత్వించి, హక్కుల ఉల్లంఘనను ధిక్కరించిన వ్యక్తి.           .
        సాగిపోవుటె బ్రతుకు
        ఆగిపోవుటె చావు
        సాగిపోదలచిన
        ఆగరాదిచటెపుడు
        బ్రతుక దలచిన పోరు
        సుతరాం తప్పదు…
        బ్రతుకు సాగి  పోవాలంటే
        పోరాటం తప్పదు
అని ఎలుగెత్తి చాటిన ధిక్కార స్వరం ఆధునిక కవి కాళోజీ.  kalogi jayanthi

తెలంగాణ భాష, అందులో యాసలు కాళోజికి చాలా ఇష్టం. తెలుగు భాష అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించిన మొత్తం భాషగా పరిగణించారు. ఆయన ఒక ప్రాంతం భాషను, సంస్కృతిని ఉన్నతీకరించి, మరొక ప్రాంతానికి చెందిన భాషను కించపరచడం  వ్యతిరేకించి కోస్తా పండితులతో తలపడిన సంఘటనలు ఉన్నాయి. రాష్ట్రంలోని కోస్తాంధ్ర,రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణ మాండలికలను గౌరవించేవారు, భాష యాసలను కాపాడుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలంటూ, బడి పలుకుల భాష, నిత్యం జనం వాడే పలుకుబడుల భాష అంతే, వ్యవహారిక భాష అని చెప్పేవారు.  వ్యవహారిక భాష, జీవభాష వైపే మొగ్గు చూపారు..

 

శ్రీశ్రీ అన్నట్లు ‘‘కష్టజీవికి రెండు వైపులా నిలిచే వాడు కవి’’ అనే మాటను అక్షరాలా నిజం చేసిన ధిక్కార కవి కాళోజీ. ఆయనకు ఆడంబరాలు లేవు. అవార్డులు, రివార్డులకు  పదవులకు ఏనాడూ ఆశపడని, రాజీపడని రారాజు కాళోజీ……  కవిత్వమంటే నల్లని సీరతో తెల్లని కాగితాల పై రాసినవి మాత్రమే కావని, కణకణమండే రగిలే నిప్పు కణికలు… అంటూ అక్షర  సేద్యం చేస్తూనే నిరంకుశ నిజాం పాలనపై అలుపెరుగని పోరాటం చేశారు .అద్భుత జీవిత సత్యాలను సామాన్య భాషలో చెప్పిన సామాజిక కవి కాళోజీ. మరాఠీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. ‘‘అణాకథలు, నా భారత దేశ యాత్ర  ,పార్దివ వ్యయము, కాళోజి కథలు, నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇదే నా గొడవ, బాపు! బాపు! భాపు’’ %••% అన్నీ ఆయన రచనలే.. కాళోజీకి రాజకీయాలంటే గిట్టవు. కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున 1978లో సత్తుపల్లి నియోజకవర్గం నుండి జలగం  వెంగలరావు పై ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన ఎన్నడూ ఏ రాజకీయ పార్టీలో లేరు. కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య  విశాలాంధ్రకు ప్రణాళిక వేస్తే దాశరథి, శ్రీశ్రీ  తోపాటు కాళోజీ విశాలాంధ్రను  బలపరచారు. కాళోజీ గొప్ప ప్రజాస్వామికవాది. ఓటు హక్కు ప్రజాస్వామికమైనదని ప్రకటిస్తూ మెడలో బోర్డు వేసుకుని తిరిగేవారు. ప్రజాస్వామ్యానికి ఆయుధం ఓటు.. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచించి   వేయాలనీ పిలుపునిచ్చారు. ఏ యిజానికి కట్టుబడని ప్రజాయిజం ఆయనది. కాంగ్రెస్‌ ‌నుంచి కమ్యూనిస్టు దాకా ఏ పార్టీకి కట్టుబడనివాడు .సంఘాలు , నియమాలు ,సంప్రదాయాలు మనిషిలోని కుళ్ళు మారు రూపాలు అని భావించేవారు.
పివి ప్రధానమంత్రి గా ఉన్న కాలంలో 1992లో కళోజీ తెలంగాణ సాహిత్య సేవలకు, అతని స్నేహితులు ఒప్పించగా, పద్మవిభూషణ్‌ అవార్డుతో  భారత ప్రభుత్వం సత్కరించింది.   కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ‌ప్రదానం చేసింది. కాళోజి గొప్పతనాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతిని  తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. జీవన దృక్పథం నుంచి వచ్చిందే ప్రాపంచిక దృక్పథం . ఆయన ఆదర్శవాది, మానవతావాది .70 ఏళ్లకు పైగా నిరంతర సృజనశీల  కావడంవల్ల   సమాజంలోని వ్యత్యాసాలు ఆయనను అన్నిటికన్నా కృంగదీశాయి. తాను మరణించిన తరువాత భౌతికకాయం వైద్య విద్య పరిశోధనకు ఉపయోగపడాలని కోరుకున్నట్లుగా, 2002 నవంబరు 13న న  మరణించిన తరువాత ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు అందజేసారు. కాళోజీ హింసకు ప్రతిహింసే సరి అనేవారు. రాజ్యహింస మరీ తప్పు అనీ, అందుకు ప్రతి హింస తప్పు కాదని అనేవ్బారు. ప్రస్తుత సందర్భంలో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పాలకులు తడబడుతున్న తరుణంలో కాళోజీలాంటి వారి అవసరం ఎంతో ఉంది. వైద్య విశ్వవిద్యాలయానికి ఆయన పేరును పెట్టినా, కాళోజి క్షేత్ర నిర్మాణం నేటికీ జరగలేదు. ఆఅయన కవిత్వం, జీవనతత్వం పై  పరిశోధన ముందదుగు వేయలేదు. వారి ఆదర్శాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర అబివృద్ది జరిగిన నాడే ఆయనకు నిజమైన నివాళి.
Tanda Sadanandam, District
తండా సదానందం, జిల్లా
ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్‌. ‌మహబఃబాద్‌ ‌జిల్లా. 9989584665

Leave a Reply